కొత్త కసరత్తు
ABN , First Publish Date - 2020-11-06T05:09:05+05:30 IST
పార్లమెంటరీ నియోజకవర్గాలు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరో 48 గంటల్లో వీటికి సంబంధించి నివేదికలు అందజేయాల్సిందిగా ఆయా జిల్లాల యంత్రాంగానికి ఆదేశించింది.
జిల్లా రూపురేఖలపై వివరాలు ఇవ్వండి
ఆస్తులు, అంతస్థులు చెప్పండి
సరిహద్దులు సూచించండి
ఉద్యోగుల వివరాలు తెలపాల్సిందే
తారుమారు కానున్న జిల్లా భౌగోళిక పరిస్థితి
ఏలూరు, నర్సాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) పార్లమెంటరీ నియోజకవర్గాలు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మరో 48 గంటల్లో వీటికి సంబంధించి నివేదికలు అందజేయాల్సిందిగా ఆయా జిల్లాల యంత్రాంగానికి ఆదేశించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈనెల 7వ తేదీ నాటికి పూర్తిస్థాయి నివేదిక అందించడంతో పాటు, సమగ్ర వివరాలు పొందుపర్చాలని సూచించింది. ఇప్పటి వరకు పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది రూపు దాల్చుతుందా ? లేదా ? అనే దానిపై మీమాంస ఉండేది. హఠాత్తుగా ప్రభుత్వం ఈ ప్రక్రియకు మరోమారు తెరలేపింది. స్పష్టమైన నివేదికలు కోరింది. వీటికి సంబంధించి ఫార్మాట్లను ప్రజలకు పంపింది. ఆగమేఘాల మీద వీటన్నింటి పూర్తిచేసి తమకు నివేదించాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇక దీంతో పార్లమెంటు నియోజకవర్గాలు కేంద్రంగా జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్టుగానే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య శాఖాధిపతులంతా కసరత్తుకు దిగారు. క్షణం తీరిక లేకుండా కూడికలు, తీసివేతలతో బిజీగా మారారు. జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం తనకు కావాల్సిన నివేదికలను ఓ వైపు కోరుతూనే ఉన్న వనరులు, ఆస్తులు, మిగతా వ్యవస్థల వివరాలన్నింటినీ ఒకే మారు రప్పించే పనిలో పడింది.
ప్రభుత్వం ఏం కోరుకుంటోంది..?
వాస్తవానికి ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏలూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు, కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి ఏలూరు కేంద్రంగా కొత్త జిల్లాను ప్రతిపాదిస్తున్నారు. నర్సాపురం లోక్‌సభ పరిధిలో నర్సాపురం, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటిని కలిపి నర్సాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలకు వీలుగానే సరికొత్త నివేదికలను కోరారు. ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే వున్న నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ స్థానాలు రాజమహేంద్రవరం జిల్లాలోకి వస్తాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఇప్పటికే అసంపూర్తిగా నిర్మించిన భవనాలను కూడా, ఉద్యోగుల వివరాలు, ఖాళీ స్థలాలు ఇతర వనరులను నేరుగా నివేదికలో పొందుపర్చాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సహా మిగతా జలవనరుల వివరాలను పొందుపర్చాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఏలూరు పార్లమెంటు స్థానం పరిధిలో అనేకమైన కీలకమైన జలవనరులతో పాటు ఆసియాలోనే మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. కొత్తగా జిల్లాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వనరులు, ఉద్యోగుల వివరాలు ఇతరత్రా సమాచారాన్ని క్రోడీకరిస్తూనే ఇంకోవైపు అదనపు సమాచారాన్ని వీలైనంత మేర ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరారు. ప్రత్యేకించి ఏలూరు ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఉంది. ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినా ఏలూరులో సమగ్రమైన కార్యాలయాలు అందుబాటులోనే ఉన్నాయి. ఇక డివిజన్ కేంద్రాల విషయానికి వస్తే నూజివీడు డివిజన్ కేంద్రం కొత్త జిల్లాలో భాగంగా ఏలూరులో వచ్చి విలీనం కావాల్సిందే. నూజివీడు, ఏలూరు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ వీటిలో మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు చెబుతున్నారు. నర్సాపురం విషయానికి వస్తే నర్సాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే జిల్లా కేంద్రంగా పరిగణించే వీలుంది. ఇక్కడ సబ్ కలెక్టర్ హోదాలో రెవెన్యూ డివిజన్‌గా పాలన సాగుతోంది. కీలకమైన ఈ పార్లమెంటు స్థానంలో రాజకీయ పరిణితే కాకుండా రాష్ట్రం మొత్తం గుర్తెరిగిన భీమవరం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది.
జిల్లా స్థాయి కమిటీలే కీలకం
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీవో), ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈవో, డీఎంహెచ్‌వో వంటి అధికారులు ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యోగుల సంఖ్య, రెగ్యులర్ వారితోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌తో కలిపి 27 వేల మందిగా ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులే 13 వేల మంది ఉన్నారు. 3,354 పాఠశాలలు ఉన్నాయి. పోలీసు సబ్ డివిజన్‌లోనూ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు డీఎస్పీ వంటి అధికారి కేంద్రంగా ఉండే కొవ్వూరు కాస్త రాజమహేంద్రవరంలోకి విలీనమవుతుంది. నూజివీడు సబ్ డివిజనగా ఉండే ప్రాంతం ఏలూరులో విలీనం కాబోతోంది. ప్రత్యేకించి కొత్త జిల్లాల ఏర్పాటులో ఇప్పటికే ప్రభుత్వం తీస్తున్న ఆరాతో పాటు ఈ నెల 7వ తేదీ నాటికి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి చేరాలి.ఆ పనిలోనే అధికారులంతా నిమగ్నమయ్యారు.
సమాచారం అందించండి : జేసీ వెంకట రమణారెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో డివిజన్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సమాచారాన్ని వెంటనే సమర్పిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికా రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాలు, మౌలిక సదుపాయాల వివరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో లాగిన్ అయి నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి జిల్లా అదనపు ఎస్పీలు ఏవీ సుబ్బరాజు, ఎం.మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
