లక్షల ఎకరాలు నీట మునిగినా.. పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-10-27T17:43:48+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి తెలిసినవి ఇవే..! ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడం, ఉన్న భవనాలను కూలగొట్టడం, సీఎం జగన్‌రెడ్డి కేసుల మాఫీ..

లక్షల ఎకరాలు నీట మునిగినా.. పట్టించుకోరా?

ప్రభుత్వ తీరుపై లోకేశ్‌ ఫైర్‌

జగన్‌ రెడ్డి పాలనలో కక్ష తీర్చుకోవడం.. ఉన్నవి కూల్చేయడమే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

నష్టపోయిన ప్రతీ రైతుకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి

దెబ్బ తిన్న ప్రతీ ఇంటికి ఐదు వేలు సాయం చేయాలి వరద ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పర్యటన


పశ్చిమ గోదావరి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి తెలిసినవి ఇవే..! ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడం, ఉన్న భవనాలను కూలగొట్టడం, సీఎం జగన్‌రెడ్డి కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం. ఇంతకుమించి రాష్ట్రాభివృద్ధికి వారు చేసింది శూన్యం. లక్షల ఎకరాలు వర్షాలు, వరదలకు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.


వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆకివీడు మండలంలోని ఆకివీడు, సిద్ధాపురం, అయి భీమవరం, తణుకు నియోజకవర్గంలోని ఈడూరు, తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో లోకేశ్‌ సోమవారం పర్యటించి బాధితులను ఓదార్చారు. ఆకివీడు జిల్లా పరిషత్‌ బాలురున్నత పాఠశాలలో ఉంటున్న సుందరయ్య కాలనీ వలస బాధితులతో మాట్లాడి  బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఏటా ముంపు బారిన పడుతున్నామని, ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో పట్టించుకొనే నాథుడే లేరని లోకేశ్‌కు మహిళలు విన్నవించుకున్నారు. నిత్యావసర సరుకులు, నగదు అందాయా ? అని అడిగి తెలుసుకున్నారు. మందపా డు లోని వరద నీటి వల్ల ముంపు బారిన పడిన వరి పొలాలను పరిశీలించారు. ఇవి చేపల చెరువులను తలపిస్తున్నాయన్నారు. రైతుల ఇబ్బందులను తెలు సుకున్నారు. పంట నష్టాన్ని సక్రమంగా అంచనా వేసి రైతులకు అండగా నిలబడాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సిద్ధాపురంలోని కురుపాక కాలనీలోని వీధులలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. 40 ఏళ్లలో ఎన్నడూ ఇంత వరద రాలేదని, తాము పూర్తిగా నష్టపోయామని, రైతులు, వరద బాధితులు వాపోయారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తిస్థాయిలో అందలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్టు కుటుం బానికి రూ.500 అందలేదని ఆవేదన చెందారు. 


విఫలమైన ప్రభుత్వం 

రైతులకు సహాయం అందించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్రంగా విమర్శిం చారు. తన పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వహయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరించిందన్నారు. అతినీతిలో మునిగిన ముఖ్యమంత్రి జగన్‌..  రైతుల పొలాలు మునిగితే కనీసం పరిశీలించలేదన్నారు. రైతు లేని రాజ్యం వచ్చిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించలేదని విమర్శించారు. రైతు లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని, మంత్రులు సైతం వీరి ని బూతులు తిడుతున్నారని విమర్శించారు. లక్షలాది ఎకరాలు పంట నీట మునిగిన మంత్రులు, సీఎం పర్యటించిన దాఖలాలు లేవన్నారు. సీఎం కేవలం విజయవాడ చుట్టునే తిరుగుతున్నారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 57 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతు భరోసా మోసం అన్నా రు. 17 లక్షల మందికే కౌలు రైతులకు భరోసా ఇవ్వవలసి ఉండగా కేవలం 54 వేల మందికి భరోసా ఇచ్చారన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకు 25 వేల వంతున పరిహారం ఇవ్వాలని, ఇళ్లు దెబ్బ తిన్న ప్రతీ కుటుంబానికి 5 వేల వంతున సహాయం చేసి, పశుగ్రాసం ఉచితంగా సరఫరా చేయాలన్నారు.


వరి, ఆక్వా నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకోవాలన్నారు. ముంపునకు గురైన ఇళ్ల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో తమ ప్రభుత్వం వర్షాలు, తుఫాన్‌లు సంభవిస్తాయని తెలియగానే ముందస్తు చర్యలు చేపట్టామని.. ఈ ప్రభుత్వం తుఫాన్‌  సం భవించి 15 రోజులైనా నిత్యావర వస్తువులు అందించలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు న్యా యం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తణుకు మండలాల్లో దాదాపు 12 వేల ఎకరాలు వరి పంట పాడైందన్నారు. ఇక్కడ మాత్రం నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 


ఘన స్వాగతం

ఆకివీడు మండలం దుంపగడపలోని ఉప్పుటేరు వద్ద ఆయనకు ఎమ్మెల్యే రామ రాజు, నర్సాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతరామలక్ష్మి, అంగర్‌ రామ్మోహనరావు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. లోకేశ్‌ను చూసేం దుకు జనం ఎగబడ్డారు. పర్యటన మొత్తం ప్రజలు, బాధితుల సమస్యలను సావఽ దానంగా విన్నారు. వారి సమస్యలపై పోరాటం చేస్తానని, అనుక్షణం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పర్యటన మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కళింగపాలెం గ్రామస్థుల విన్నపం మేరకు.. షెడ్యూల్‌లో లేనప్పటికీ ఆ గ్రామాన్ని పర్యటించారు. లోకేశ్‌ వెంట ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామ రాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, నరసాపురం, ఏలూరు, రాజమహేంద్ర వరం పార్లమెంట్‌ నియోజక వర్గాల పార్టీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనే యులు, కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్‌, ముప్పిడి వెంకటేశ్వరరావు, భూపతిరాజు తిమ్మరాజు, అల్లూరి కన్నయ్యరాజు తదితరులు పాల్గొన్నారు.


త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆకివీడు-నుంచి సిద్దాపురానికి ట్రాక్టర్‌పై వెళుతున్న లోకేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గ్రామానికి  ట్రాక్టరు నడుపుతూ బయలుదేరిన లోకేశ్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రమాదం త్రుటిలో తప్పింది. లోకేశ్‌ ట్రాక్టర్‌ను నడుపుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చినకాపవరం డ్రెయిన్‌ గట్టులో దిగబడింది. మలుపు తిరుగుతున్న సమ యంలో ఈ ప్రమా దం సంభవించింది. అదృష్టవశాత్తూ ఎవ రికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి వెనుక వచ్చిన వేరొక ట్రాక్టరును నడుపుతూ ఆయన సిద్దాపురం పర్యటించారు. దీనిపై ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-10-27T17:43:48+05:30 IST