నాగుల చవితి సందడి

ABN , First Publish Date - 2020-11-18T04:30:41+05:30 IST

దీపావళి అమావాస్య తర్వాతి కార్తీక శుద్ధ చతుర్ధిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.

నాగుల చవితి సందడి
తోపుడు బండిపై తేగల విక్రయం

వీరవాసరం/పాలకొల్లు రూరల్‌, నవంబరు 17: దీపావళి అమావాస్య తర్వాతి కార్తీక శుద్ధ చతుర్ధిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. నాగుల చవితిరోజున రైతు కుటుంబాలతో పాటు భక్తులు నాగపూజ చేస్తారు. పంట భూములలో పుట్టలను అలంకరించి నాగులకు నైవేద్యం సమర్పిస్తారు. పాలు, గుడ్డు ఇతర ఆహార పదార్థాలతో పాటు ప్రత్యేకంగా తాటిబుర్ర, తేగలను నివేదిస్తారు. బుధవారం నాగులచవితి సందర్భంగా బజారులలో తాటిబుర్రను, తేగల విక్రయాలను ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాగుపాము పుట్టలు, పంట పొలాల్లో పుట్టల వద్ద రైతులు నాగుల చవితి ఏర్పాట్లు చేస్తున్నారు.


నాగుల చవితికి పుట్ట వద్ద నివేదించే తేగలు, బుర్రగుంజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తంపటి, కాల్చిన తేగలను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. పట్టణ ప్రాంతాల్లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. మొగల్తూరు మండలం జెట్టిపాలెం పరిసర ప్రాంతాల నుంచి తెచ్చి పాలకొల్లు పట్టణంలో విక్రయిస్తున్నారు. ఇసుక మైదానాల్లో పండే తేగలు ఎంతో రుచికరంగా ఉంటాయని జెట్టిపాలెంకు చెందిన విక్రయ దారులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌ తెలిపారు. గ్రామాల్లో విరివిగా లభ్యమయ్యే తేగలు మూడు కలిపి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-11-18T04:30:41+05:30 IST