సైకిల్‌ సవారీ నియోజకవర్గాల్లో కదిలిన నేతలు

ABN , First Publish Date - 2020-03-08T11:43:11+05:30 IST

నియోజకవర్గస్థాయిలో టీడీపీ నేతలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను ఎంపిక చేసేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అంతకంటేమించి అధికరపక్షాన్ని ఢీకొనేందుకు

సైకిల్‌ సవారీ నియోజకవర్గాల్లో కదిలిన నేతలు

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

నియోజకవర్గస్థాయిలో టీడీపీ నేతలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను ఎంపిక చేసేందుకు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అంతకంటేమించి అధికరపక్షాన్ని ఢీకొనేందుకు సిద్ధపడుతూనే మరోవైపు వారి నుంచి వచ్చే ఒత్తిళ్ళను  ఏ మాత్రం ఖాతరు చేయనివారినే అభ్యర్థులుగా దింపాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకే జాబితాలను రూపొందిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా ఇప్పటికే వేగం పెంచి తక్షణ నిర్ణయాలవైపు కదులుతున్నారు. ఉండి, నరసాపురంతోసహా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఈ కసరత్తు దాదాపు ఒక కొలిక్కి వస్తుండగా, మిగతా నియోజకవర్గాల్లో ఇంకా వేగం పుంజుకోకపోగా, కొందరు నేతల్లో సబ్ధత తొలగలేదు. దీంతోపాటు భీమవరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ప్రతిష్ఠంభన నెలకొనడంతో ఇక్కడ కనీసం అభ్యర్థులను ఖరారు చేసే వ్యవస్థే లేకుండా పోయింది. దీనిపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. 


ఎన్నికలొచ్చి పడినా.. 

ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ముందుకు కదలినా ఈమేరకు తెలుగుదేశంలో మాత్రం ఇంకా పూర్తిగా కదలిక కనిపించలేదు. ఇప్పటికే అధికారపక్షం ఒకవైపు దూకుడుగా వ్యవహరి స్తుండగా, దీనికి తగ్గట్టుగానే ప్రధాన ప్రతిపక్షం తగిన అభ్యర్థులను ఎంపిక చేసి, ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధపడాల్సి ఉండగా, కొన్ని నియోజకవర్గాల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తణుకు, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లో కీలక సమావేశం నిర్వహించి పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ఆరంభించారు. క్షేత్రస్థాయి నుంచి కేడర్‌ అభిప్రాయాలను సేకరిస్తున్నారు.


గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు దాదాపు తుదికసరత్తు కూడా ఆరంభమైంది. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ఇప్పటికే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించి, ఆ మేరకు అభ్యర్థులను ఖరారు చేయగలుగుతు న్నారు. దాదాపు నియోజకవర్గం అంతా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీల జాబితాలను కూడా దాదాపు మిగతా నియోజకవర్గాల కంటే ముందుగానే ప్రకటించబోతున్నారు. ఆకివీడు మండలానికి సంబంధించి ఎంపీపీగా మాజీ డీసీసీబీ చైర్మన్‌ ముత్యాలరత్నం సతీమణిని ప్రకటించారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలోనూ రిజర్వేషన్ల ప్రకారం ఒకటికి, రెండుసార్లు ఆచితూచి వ్యవహరిస్తూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు.


ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు మండలానికి తొమ్మిది మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కలిపి ఇచ్చిన నివేదికలు, పేర్లు ఆధారంగా అందరికీ సమన్యాయం జరిగేలా అభ్యర్థులను రెండురోజుల్లో ప్రకటించబోతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మొగల్తూరు, నరసాపురం మండలాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని వ్యవహరిస్తున్న వారిని రప్పించి, వారితో చర్చిస్తున్నారు.


ఎటు తిరిగి ఏలూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి అంతర్గతంగా నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. పోలవరం, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లోనూ పార్టీ కేడర్‌ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చురుగ్గా కదిలారు. సాధ్యమైనంతమేర బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. 


భీమవరం, కొవ్వూరు సంగతేంటి ?

చాలా కాలం నుంచి వివాదాలకు నిలయంగా ఉన్న కొవ్వూరులో స్థానిక సంస్థలకుగాను పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. ఇక్కడ రెండు వర్గాలుగా పార్టీ చీలింది. వీటిని ఒకటిగా చేర్చేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు ఇప్పటిదాక ఫలించలేదు. తగ్గట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో దీని ప్రభావం కేడర్‌పై పడింది. కొవ్వూరు మున్సిపాల్టీతోసహా జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఈ రెండువర్గాలు ఎవరంతటివారుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సమయం కేవలం రెండురోజులే మిగిలి ఉండగా, ఆలోపే అభ్యర్థుల ఖరారు చేయడం అంత తేలికైన విషయం కాదని భావిస్తున్నారు.


అంతకంటేమించి ఒకటికి, రెండుసార్లు బుజ్జగించే ప్రయత్నం జరిగినా ఇవేవి ఫలించలేదు. భీమవరంలో సీనియర్‌ నేత అంజిబాబు ఇప్పటికీ మౌనం వీడలేదు. కీలకమైన భీమవరంలో మిగతా శ్రేణులన్నీ నాయకత్వ లేమితో బాధపడుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి భీమవరం వాసి. ప్రత్యేకించి ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలోనే బుజ్జగింపు జరిగినందున ఆయన మెత్తపడతారని సీతమ్మతోపాటు మిగతా నేతలు అంచనా వేశారు. అయితే పరిస్థితి పార్టీ కేడర్‌కు అంతుపట్టకుండా పోయింది.  తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కన్వీనర్‌ ఈలి నాని స్థానిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వీలుగా అంతర్గతంగా నేతల అభిప్రాయాలను ఒకవైపు సేకరిస్తూనే ఆదివారం నుంచే మండల సమావేశాలు నిర్వహించి, అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. తాజా పరిణామాల న్నింటిపైనా తెలుగుదేశం అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. తగ్గట్టుగానే నేడోరేపో సబ్ధుగా ఉన్న నేతలతో మారోమారు చర్చించే అవకాశాలూ లేకపోలేదు. 


అభ్యర్థులు రెడీ అయినా భయం 

అధికారపక్షం ఒకవైపు దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో పార్టీ పరంగా నేరుగా బరిలోకి దిగేందుకు కొందరు వెనుకాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాడోపేడో తేల్చుకోవడానికి ఇంకొందరు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండగా ఇదంతా తమకే అనుకూలిస్తుందని పార్టీ నేతల్లో కొందరు ఒక అంచనాకు వచ్చారు. ఈ ధైర్యంతోనే వారంతా నేరుగా పోటీ చేసేందుకు సాహసం చేస్తున్నారు. దాదాపు ఒకటి, రెండు నియోజకవర్గాల మినహా మిగతా అన్నిచోట్లా పోటీకి వీలుగా అభ్యర్థులు తమ పేర్లను స్థానిక నేతలకు సమర్పించారు. సామాజిక, ఆర్థిక బలం ఉన్న నేతలను బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తుంది. స్థానికంగా సమన్వయంతో సిఫార్సు చేస్తే దీనికి అనుకూలంగా వ్యవహరించేందుకు పార్టీ సిద్దపడుతుంది. అందుకనే సాథ్యమైనంత మేర ఎంపీటీసీలను మాత్రం ఎంపిక చేసే బాధ్యత లోకల్‌ కేడరే తీసుకుంది. 

Updated Date - 2020-03-08T11:43:11+05:30 IST