కట్టడి కఠినం

ABN , First Publish Date - 2020-04-05T10:53:18+05:30 IST

జిల్లా కేంద్రమైన ఏలూరుతోసహా మిగతా పట్టణాలన్నిం టిలోనూ ప్రజల్లో కొంత చైతన్యం కనిపిస్తోంది.

కట్టడి కఠినం

మంత్రి ఆళ్ల నాని ఉన్నతాధికారులతో సమీక్ష 

 తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశం 

 నేడు మాంసం దుకాణాలకు సెలవు

 ఆక్వా రైతులకు వీలైతే ఆర్టీసీ బస్సులు 

 భీమవరంలో మంత్రి రంగనాథరాజు ప్రకటన 

 పరీక్షల రిపోర్టులకు నిరీక్షణ 

నేడు తొమ్మిది నిమిషాలు కొవ్వొత్తుల వెలుగు 

 ప్రధాని పిలుపునకు ప్రజలు సన్నద్ధం


జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు    తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే   జిల్లా వ్యాప్తంగా నమోదైన  కరోనా పాజిటివ్‌ కేసులను దృష్టిలో పెట్టుకుని, ఎక్కడికక్కడ కట్టడికి ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆరంభమైన దగ్గర నుంచి ఉదయం వేళల్లో మాత్రమే కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లకు సడలింపు ఇస్తున్నారు.  ఆ తర్వాత రోడ్లమీదకు ఏ ఒక్కరిని  అనుమతించడం లేదు. ఇలాంటి తరుణంలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా నమోదు కావడంతో జిల్లాలో అప్రమత్తత రెట్టింపు             అయ్యింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కఠిన నియమాలను అమల్లోకి తెచ్చారు. 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లా కేంద్రమైన ఏలూరుతోసహా మిగతా పట్టణాలన్నిం టిలోనూ ప్రజల్లో కొంత చైతన్యం కనిపిస్తోంది. గడిచిన మూడు రోజులుగా వీధుల్లోకి వచ్చేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే నిత్యావసరాలు, కూరగాయాల కొనుగోళ్లకు కొన్నిచోట్ల ఎగబడుతూనే ఉన్నారు. కరోనా నివారణకు ఇదొక పెద్ద విఘాతం. అందుకనే ఇప్పటికే రైతుబజార్లను విభజించి పట్టణాల్లో అనేకచోట్ల అందుబాటులోకి తెచ్చారు. సమూహా లన్నీ ఒకేచోట గుమిగూడకుండా జాగ్రత్తలు పడ్డారు. ఇప్పటిదాక ఢిల్లీతో లింకులు ఉన్నవారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వర్తించింది. వీరి నుంచి వైరస్‌ ఇంకెవరికైనా సంక్రమించిందా లేదా అనే దానిపై నాలుగు రోజులుగా కుస్తీలు పడుతున్నారు.


ఎక్కడికక్కడ ఆరా తీసి మరీ అనుమానితులను జాబితాలో చేర్చి తక్షణం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఒక్క ఏలూరు నగరంలోనే ఇప్పటిదాక ఎనిమిదిమందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. వీరిలో ఒకరిని తాజాగా విజయవాడకు తరలించినట్టు సమాచారం. 14 మందికి ఏలూరు నగరంలోనే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిం చిన వారి పట్ల పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు.  తాడేపల్లిగూడెంలో సమావేశమైన 49 మంది పాస్టర్‌లను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు చేశారు. అనంతరం సీఐ ఆకుల రఘు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 


కట్టడికి మరిన్ని కఠిన చర్యలు 

ఏలూరు నగరంలో కరోనా వైరస్‌ విస్తృతం కాకుండా కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలకు పదునుపెట్టారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి ఆళ్ళ నాని శుక్రవారం తాజా పరిిస్థితిపై సమీక్షించారు. నగరంలో ఇప్పటిదాక తీసుకున్న ముందస్తు చర్యలేంటి, తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా అధికారులతో సమీక్షించారు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ కరోనా కట్టడికి సమిష్టి ప్రయత్నాలు జరగాలి. అందరూ కలిసి రావాలి. నగరంలో పరిస్థితి అదుపులో ఉండాలి’ అంటూ మంత్రి నాని ఏలూరు నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. గత ఆదివారం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదివారం మాంసం, చేపలు, చికెన్‌ దుకాణాలు తీయరాదంటూ మునిసిపల్‌ కమిషనర్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


గతవారం ఎక్కడికక్కడ దుకాణాలముందు పెద్దసంఖ్యలో గుమిగూడడం, చేపల మార్కెట్‌ జనసమర్ధంతో నిండిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపైనే విమర్శలు కూడా వచ్చాయి. వైరస్‌ కట్టడికి ఇప్పటికే ఒక ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పరిగణిస్తుండగానే, మరోవైపు ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడటాన్ని తీవ్రంగా పరిగణించారు.  జిల్లాలో కరోనా కట్టడికి ఒక వైపు ప్రయత్నాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఆక్వా రైతులతోపాటు మిగతా రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నామని రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి రంగనాథరాజు ప్రకటించారు. నరసాపురం డివిజన్‌ అధికారులతో భీమవరంలో ఆయన సమీక్షించారు. ప్రత్యేకించి ఆక్వా రైతులు చేపలు, రొయ్యల పట్టుబడికిగాను ఆటోల్లోనూ, ఇతర వాహనాల్లోనూ పెద్దసంఖ్యలో తీసుకువెళ్ళడాన్ని అనుమతించేది లేనేలేదని, రైతులు కోరితే ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేశారు.  


పరీక్షల నివేదికకు నిరీక్షణ 

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన తరుణంలో వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాక జిల్లా నుంచి దాదాపు రెండువందలకు పైగానే నమూనా పరీక్షలను ల్యాబ్‌లకు పంపారు. ఈ నివేదిక ఇంకా జిల్లాకు చేరాల్సి ఉంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతాయా, పెరుగుతాయా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్దగా పెరగకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే క్వారంటైన్‌లో చేర్చిన అనుమానితులందరికీ ఆహార, వసతి విషయాల్లో రాజీ పడకుండా ఏర్పాట్లను కొనసాగించాల్సిందిగా అధికారులను జేసీ-2 నంబూరి తేజ్‌భరత్‌ ఆదేశించారు. 


జిల్లా వ్యాప్తంగా 14 పాజిటివ్‌ కేసులకు ఏలూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. దీని దృష్ట్యా ఆసుపత్రి ప్రాంగణాన్ని పూర్తిగా మూసివేశారు. కేవలం కొన్ని పరీక్షలకు మాత్రం కొందరిని అనుమతిస్తున్నారు. ప్రధాన గేట్లను మూసివేసి, సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీనికితోడు చిన్నచిన్న రోగాలతో ప్రజలు ఎక్కడికి వైద్య చేయించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

 

నేటి రాత్రికి కొవ్వొత్తుల వెలుగు 

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రజలు సంఘటితంగా చైతన్యవంతంగా ఉండేలా ప్రధాని మోదీ ఈ మధ్యనే దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగానే ఆదివారం రాత్రి 9 గంటలకు నివాసాల్లోని విద్యుత్‌ నిలిపివేసి ఆ స్థానంలో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌లైట్లతో తొమ్మిది నిమిషాలపాటు కాంతిని నింపాల్సిందిగా దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపునకు స్పందనకు నేటి రాత్రి కొవ్వొత్తులు వెలిగించేందుకు ప్రజలు సమాయత్తం అవుతున్నారు.


అయితే ఒకేసారి అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ లైట్లు ఆర్పివేయడం వల్ల విద్యుత్‌ గ్రిడ్‌కు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌డీసీ (స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌) గ్రిడ్‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఏవీవీ సూర్యప్రతాప్‌ తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని విద్యుత్‌ దీపాలు మాత్రమే ఆఫ్‌ చేయాలని, ఫ్రిజ్‌, ఫ్యాన్లు, ఏసీలు వంటి ఉపకరణాలు ఆన్‌లోనే ఉంచాలని సూచించారు.  

Updated Date - 2020-04-05T10:53:18+05:30 IST