విత్తనశుద్ధి చేద్దాం..

ABN , First Publish Date - 2020-06-25T10:19:53+05:30 IST

వివిధ పంటల్లో విత్తనశుద్ధి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణాజీ అన్నారు.

విత్తనశుద్ధి చేద్దాం..

అధిక దిగుబడులు సాధిద్దాం

సాగు బాగుండాలంటే విత్తనశుద్ధి తప్పనిసరి 

ఉండి కేవీకే శాస్త్రవేత్త కృష్ణాజీ సలహాలు


పంట బాగా పండాలంటే ఏం చేయాలి.. ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై  ఉండాలి.. విత్తనం మంచిదైతే సరిపోతుందా..? ఎటువంటి విత్తనమైనా శుద్ధి చేయాలి.. ఆ తరువాతే సాగులో దిగాలి. అది వరి అయినా అపరాలైనా ఇంతే.. విత్తనశుద్ధి చేయకుండా సాగులో దిగామా మిగిలేది నష్టాలే.. కష్టాలే.. అందుకే  విత్తు నుంచి వచ్చే విపత్తును ముందుగానే అరికడితే ఆ తరువాత లాభాల పంటే.. మరి విత్తన శుద్ధి ఎలా చేయాంటారా.. ఇదిగో ఇలా.. 


ఉండి, జూన్‌ 24 : వివిధ పంటల్లో విత్తనశుద్ధి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణాజీ అన్నారు. రైతులకు పలు సూచనలు సలహాలను అందించారు. పంటలను తొలి దశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శిలీంద్ర నాశినులతో గాని, పురుగు మందులతో గానీ లేదా జీవ శిలీంద్ర నాశినులతో గానీ తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా ద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు సుమారుగా 20 - 25 శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. కొన్ని పంటల్లో నిద్రావస్థ ఉండడం వల్ల మొలక సరిగా రాదు. అటువంటపుడు సిఫారసు చేసిన గాఢమైన ఆమ్లాలతో శుద్ధిచేయడం వల్ల నిద్రావస్థ తొలగించి మంచి మొలక శాతం రాబట్టవచ్చునని రైతులకు సూచించారు.


విత్తనశుద్ధి పద్ధతులు...సలహాలు


పొడి విత్తన శుద్ధి : పొడి విత్తన శుద్ధికి డ్రమ్ములలో మూడింట రెండు వంతుల విత్తనం వేసి సిఫారసు చేసిన మోతాదులో మందు వేసి బాగా తిప్పినట్లయితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు లేదా బెల్లం ద్రావణం లేదా చిక్కటి గంజి ద్రావణం గానీ కలపడం వల్ల మందు పట్టుకుని విత్తన శుద్ధి మందు ఒక రక్షణ కవచంగా ఏర్పడి చీడ నివారణ సాధ్యమవుతుంది. విత్తన మోతాడు తక్కువగా ఉంటే కుండలు లేదా మందపాటి ప్టాస్టిక్‌ సంచులు ఉపయోగించి చేయవచ్చు.


తడి విత్తనశుద్ధి : తగినంత నీటిని తీసుకోని  ఆ నీటిలో సిఫారసు చేసిన మందులు కలుపుకుని, విత్తనాలను నానబెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు చీడపీడల నుంచి పంటలను   రక్షించుకోవచ్చు.


స్లర్రీ పద్ధతి : నీటిలో కరిగే అంతర్వాహిక శిళీంద్రనాశీనులు లేదా కీటక నాశినులు తగినంత నీటిలో కలిపి చిక్కటి ద్రావణం చేసుకోవాలి.ఈ ద్రావణాన్ని విత్తనాలకు పట్టించి తరువాత తడి ఆరే వరకు నీడలో ఆరబెట్టి విత్తుకోవడం ద్వారా మంచిఫలితాలు సాధించుకోవచ్చు.తడి విత్తనశుద్ధి, స్లర్రీ పద్ధతిలో విత్తనాల పైన ఉండే శిలీంద్ర బీజాలే కాకుండా విత్తనం లోపలఉండే బీజాలు కూడా నాశనమవుతాయి. 


జీవశిలీంద్ర నాశినులు : కొన్ని రకాల జీవ శిలీంద్ర నాశినులు, ట్రైకో డెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానం సుడోమోనాస్‌ వంటి వాటితో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్ళు కలుగజేసే శిలీంద్రాలను నాశనం చేయడమే కాకుండా పంట చివరి వరకు రక్షణ కల్పిస్తాయి.ఈ మందులు భూమిలోనే అభివృద్ధి చెందుతాయి.పంటను బట్టి 8 నుంచి 10  గ్రాములు వరకూ ఒక కిలో విత్తనానికి మోతాదు అవసరం అవుతుంది.


వేడి నీరు లేదా ఆవిరితో : ఈ  పద్ధతి చెరకు పంటకు బాగా ఉపయోగపడుతుంది. విత్తన ముచ్చెలను 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత గలిగిన వేడి నీరు లేదా ఆవిరితో శుద్ధి చేయడం వల్ల ఎర్ర కుళ్ళు తెగులు సమర్థ వంతంగా నివారించవచ్చు. కూరగాయల పంటల్లో కూడా కొన్ని రకాల వైరస్‌లు బాక్టీరీయా తెగుళ్లను నివారించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.


సూర్యరశ్మితో : ఈ పద్ధతిని కూరగాయల పంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా విత్తనాలను 4 గంటల పాటు నానబెట్టి తరువాత టార్పాలిన్‌ పట్టాపైన పలుచగా పరిచి ఎండతగిలేలా చేస్తారు.దీని ద్వారా కొన్ని రకాల శిలీంద్రాలు నాశనం అవుతాయి. 

 

జీవన ఎరువులు : పప్పు దినుసుల పంటల్లో రైజోబియం వంటి జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేయవచ్చు. దీని వల్ల పంటకు కావలసిన నత్రజని మోతాదు 25 శాతం తగ్గించవచ్చు.ఈ పద్ధతికి ముందుగా ఒక లీటరు నీటిలో 50 - 100 గ్రాముల బెల్లం కలిపి 15 నిమిషాలు బాగా మరగ కాచి చల్లార్చుకోవడం ద్వారా మనకు చక్కటి ద్రావణం తయారవుతుంది.ఈ ద్రావణానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ కలిపితే జావ లాంటి పదార్థం తయారవుతుంది. ఈ ద్రావణం 8 నుంచి 10 కిలోల విత్తనానికి సరిపోతుంది.


విత్తనశుద్ధి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

విత్తన శుద్ధి చేసేటపుడు చేతికి గ్లౌసులు ముఖానికి మాస్క్‌లు ధరించాలి.

శుద్ధి చేసిన విత్తనాలను మనుషులు గానీ, పశువులు గానీ ముట్టుకోకూడదు.

ఏ పంటకు సిఫారసు చేసిన మందులను ఆ పంటకే వాడాలి.

సిఫారసు చేసిన మోతాదుకు మించి మందు వాడితే మొలక శాతం దెబ్బతింటుంది.

శుద్ధి చేసేటపుడు విత్తనాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండకూడదు.

శుద్ధి చేసేటపుడు విత్తన పై పొర ఊడిపోకుండా నెమ్మదిగా చేయాలి.

విత్తడానికి కొన్ని గంటల ముందు మాత్రమే జీవన ఎరువులు లేదా జీవ శిలీంద్ర నాశినులతో శుద్ధి చేయాలి.

ఒక పంటకు రెండు మూడు రకాల మందులతో శుద్ధి చేసేటపుడు ముందుగా

కీటక నాశినితో శుద్ధి చేసి, తరువాత శిలీంద్ర నాశినితో శుద్ధిచేసి చివరిగా జీవ

శిలీంద్ర నాశిని కలపాలని శాస్త్రవేత్త ఎంవి.కృష్ణాజీ రైతులకు సూచించారు.

Updated Date - 2020-06-25T10:19:53+05:30 IST