రూ. 4 నుంచి రూ. 40 వేలకు..

ABN , First Publish Date - 2020-06-18T11:02:32+05:30 IST

పంచాయతీ రాజ్‌ శాఖలో 157 మంది తాత్కాలిక ఉద్యోగులకు తీపికబురు అందింది.

రూ. 4 నుంచి రూ. 40 వేలకు..

పంచాయతీ రాజ్‌ శాఖలో జీవో 142  అమలు 

157 మంది తాత్కాలిక ఉద్యోగుల పర్మినెంట్‌

010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు

27 ఏళ్ల తరువాత నిరీక్షించిన కల


ఏలూరుసిటీ, జూన్‌ 17 : పంచాయతీ రాజ్‌ శాఖలో 157 మంది తాత్కాలిక ఉద్యోగులకు తీపికబురు అందింది. దాదాపు 27 ఏళ్ల తరువాత వారి నిరీక్షణకు ఫలితం లభించింది. 1993 సంవత్సరం నవంబరు 25వ తేదీ ముందు ఫుల్‌ టైమ్‌, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, కన్సాలిడేటెడ్‌ పే, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులుగా చేరిన వారందరికీ పంచాయతీ రాజ్‌ శాఖలోని మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ప్రకారం జీతాలివ్వాలని రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జీవో 142 జారీ చేసింది. అయితే నాటి నుంచి అమల్లోకి రాలేదు. ఆ జీవో 142ను అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శితో పాటు పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. మొట్టమొదటిగా జిల్లాలో కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చొరవతో డీపీవో తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ ఆ జీవో అమలుకు కృషి చేశారు.


జిల్లాలో పనిచేస్తున్న 157 మంది పంచాయతీ రాజ్‌ తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి టైమ్‌ స్కేల్‌ ఏర్పాటు చేశారు. 010 పద్దు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పొందే అవకాశం కల్పించారు. వీరిలో 28 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 71 మంది బిల్లు కలెక్టర్లు, ఇద్దరు లైబ్రరీ అటెం డర్లు, 12 మంది ఆఫీస్‌ సబార్టినేట్‌ సిబ్బంది, 44 మంది స్వీపర్లు ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడంతో వారి జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం రూ. 4 నుంచి రూ. 5 వేలు  జీతం పొందే వారు గరిష్టంగా రూ. 40 వేల వరకు పొందే అవకాశం ఉంది.స్వీపర్లు/ ఆఫీస్‌ సబార్డినేట్స్‌కు టైమ్‌ స్కేలు రూ.13000 -42070, జూనియర్‌ అసిస్టెంట్లకు స్కేలు రూ.16400- 49870, బిల్లు కలెక్టర్లకు రూ. 15030-46060, లైబ్రరీ అటెండర్లకు రూ. 13780-42490గా ఉంది. దీనిపై తాత్కాలిక ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


ఆనందంగా ఉంది..

పంచాయతీరాజ్‌ శాఖలో తాత్కాలికంగా పనిచేస్తున్న 157 మంది ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడానికి అవకాశం కలిగింది. పంచాయతీ రాజ్‌లో ఉద్యోగుల వెతలు నాకు తెలుసు.. అందుకే ప్రభుత్వ జీవో వచ్చిన వెంటనే కలెక్టర్‌ ఆదేశాలతో ఆగమేఘాలపై పనిపూర్తి చేశా. చాలా ఆనందంగా ఉంది.

  - తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌, డీపీవో

Updated Date - 2020-06-18T11:02:32+05:30 IST