వాహనాలు రయ్‌రయ్‌

ABN , First Publish Date - 2020-05-09T08:12:31+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ విధించడంతో 40 రోజుల పాటు జనజీవనం స్తంభించింది.

వాహనాలు రయ్‌రయ్‌

పెరిగిన పెట్రో, డీజిల్‌ వినియోగం


ఏలూరు సిటీ, మే8: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ విధించడంతో 40 రోజుల పాటు జనజీవనం స్తంభించింది. మూడు రోజులుగా లాక్‌డౌన్‌ సడ లింపులతో జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. కొన్ని సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకోవడంతో వాహనాలకు పని పడింది. రోడ్లపై వాహనాలు రయ్‌మని తిరుగుతున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుం డడం, లాక్‌డౌన్‌ మినహాయింపుల కారణంగా రవాణా కూడా ఊపందుకుంది. లారీలు, వ్యాన్‌ల రాకపోకలు ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్‌లో పెట్రో బంక్‌లను అత్యవసర సర్వీసుగా గుర్తించినా అవసరం పరిమితం కావడంతో పెట్రోలు, డీజిల్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న రెడ్‌జోన్‌ ప్రాంతాలు మినహా ఆరంజ్‌, గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో వ్యక్తిగత పనులపై వాహనాలు వెళ్లడానికి అనుమతించారు. దీంతో వాహనాలు ఎక్కువ సంఖ్యలోనే రోడ్డెక్కాయి. దీంతో పెట్రోలు, డీజిల్‌ వినియోగం క్రమేపీ పెరుగుతోంది.


లాక్‌డౌన్‌ సమయంతో పోలిస్తే ప్రస్తుతం సగానికి పైగా ఇంధన వినియోగం పెరిగిందని ఆయిల్‌ కంపెనీల సమాచారం. జిల్లాలో సాధారణంగా రోజువారీ 2.60 లక్షల లీటర్ల పెట్రోలు,  4.70 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తారు. లాక్‌ డౌన్‌ సమయంలో రోజువారీ పెట్రోలు 1.60 లక్షలు లీటర్లు, డీజిల్‌ 2లక్షల లీటర్లు అమ్మకాలు జరిగాయి. తాజాగా లాక్‌డౌన్‌ సడలింపులతో రోజువారీ పెట్రోలు 3 లక్షల లీటర్లు, డీజిల్‌ 5లక్షల లీటర్లు వినియోగం జరుగుతోంది. జిల్లాలో 272 పెట్రోలు బంక్‌లున్నాయి. లాక్‌డౌన్‌లో అత్యవసర సర్వీసుగా పెట్రోలు బంక్‌లను గుర్తించినా వాహన రాకపోకలు లేకపోవడంతో వినియోగం లేక ఆదాయం బాగా తగ్గిందని పెట్రోలు బంక్‌ యజమానులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు పుంజుకోవడంతో ఆదాయం పెరిగిందని  చెబుతున్నారు.

Updated Date - 2020-05-09T08:12:31+05:30 IST