పట్టణవాసులపై పన్నుభారం
ABN , First Publish Date - 2020-12-01T05:49:24+05:30 IST
పట్టణ జనాభాపై పన్నుల భారం పడనుంది. భవనాలు లేదా ఖాళీ స్థలాలపై వాటి మూల విలు

మునిసిపాలిటీల్లో కొత్త ఆస్తిపన్ను విధానం
మార్కెట్ విలువ ఆధారంగా పెంపు
అదనపు భారంపై ఆందోళన
కరోనా కాలంలో మరిన్ని కష్టాలు..!
జీవో నెం.190 ద్వారా కొత్త తరహా ఆస్తిపన్ను విధించేందుకు సిద్ధమవు తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానానికి భిన్నంగా భవనం లేదా స్థలం మార్కెట్ విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. ఒక పట్టణంలో ప్రాంతాల వారీగా స్టాంపు విలువ మారుతుంటుంది. ఆ ప్రకారమే కొలతలు వేసి పన్ను వేస్తారు.. ఉదాహరణకు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు సెంట్లలో ఉన్న రెండంతస్తుల భవనానికి రూ.6500 పన్ను చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సెంటు మార్కెట్ విలువ రూ.20 లక్షలు ఉంది..నివాస భవనాలకు వాటి మూల విలువలో కనిష్ఠంగా 0.10 శాతం.. గరిష్ఠంగా 0.50 శాతం వరకు విధించే అవకాశాలున్నాయి.. ఈ లెక్కన సరాసరిన 0.2 శాతం లెక్కగట్టినా రూ.12,000 పన్ను కట్టాల్సి వస్తుంది.. అంటే దాదాపు 40 శాతంపైనే అదనంగా భారం పడనుంది.. ప్రస్తుతం దీనిపైనే అంతటా ఆందోళన వ్యక్తం అవుతోంది.
భీమవరం, నవంబరు 30 : పట్టణ జనాభాపై పన్నుల భారం పడనుంది. భవనాలు లేదా ఖాళీ స్థలాలపై వాటి మూల విలువ ఆధారంగా ఆస్తిపన్ను పెంచాలని ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు చేసింది. నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లోని భవనాలు, ఖాళీ స్థలాలన్నిటికీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వాటి మూల విలువ (స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించే కేపిటల్ వాల్యూ) ఆధారంగా ఆస్తి పన్ను నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ వాటి వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన దీనిని విధిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి భవనాల విస్తీర్ణాన్ని చదరపుటడుగుల్లోనూ, భూములు– ఇళ్ల స్థలాలను చదరపు గజాల్లోనూ పరిగణనలోకి తీసుకుంటారు. ఈ కొత్త ఇంటిపన్ను ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజలు పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కరోనా వైరస్ కష్టాలు ఇంకా తొలగలేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అవస్థలు పడుతుంటే పన్నులు పెంచే ఆలోచనపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వివిధ స్థిరాస్తుల ఆస్తి పన్నును నివాస భవనాలకైతే వాటి మూల విలువలో కనిష్ఠంగా 0.10 శాతం.. గరిష్ఠంగా 0.50 శాతం వరకు.. అదే నివాసేతర భవనాలకైతే కనిష్ఠంగా 0.20 శాతం.. అత్యధికంగా 2 శాతం లోపు నిర్ణయించాలి. ఖాళీ భూములు, ఇళ్ల స్థలాలకైతే మున్సిపాలిటీల్లో 0.20 శాతం, నగర పాలక సంస్థల్లోనైతే 0.50 శాతం విధించే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకు ముందు భవనం నిర్మించినప్పుడు టౌన్‌ప్లానింగ్ నియమావళి ప్రకారం పన్ను వసూలు చేసేవారు. భవనం, పెంకుటిల్లు, బంగాళా పెంకుటిల్లు, రేకుల షెడ్డు ఇలా ఇంటి నిర్మాణాన్ని బట్టి పన్ను వసూలు చేస్తారు. భవనంలోపల టైల్స్ గానీ, గ్రానైట్స్ కానీ వాడినప్పుడు దానికనుగుణంగా ధరలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను విధింపులో పట్టణాన్ని జోన్లు వారీగా విభజన చేస్తారు. ఆ జోన్‌లో ఉన్న నివాసాలు, నివాస ఇతర అద్దెలను సరాసరి లెక్కలు వేసి, కట్టడపు కొలతల ప్రకారం ఏడాది అద్దె విలువతో చదరపు మీటర్‌కు ధర నిర్ణయిస్తున్నారు. ఖరారైన పన్నును మున్సిపల్ పాలకవర్గాలు తీర్మానం చేసి రెంట్ పేయర్లు అభిప్రాయం స్వీకరించిన తరువాత గెజిట్ ద్వారా కలెక్టర్‌కు పంపిస్తారు. తదుపరి అమలులోకి వస్తుంది. కొత్త విధానం అమల్లోకి వస్తే భూమి విలువ పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరుగుతుంది. ఈ విధానం అమలైతే మున్సిపాలిటీలకు 30 శాతం అతనంగా పన్ను ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
2007 తరువాత మళ్లీ ఇప్పుడు...
ఆస్తిపన్ను పెంపు 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పెంచారు. అప్పుడు పెంపు శాతం 50 నుంచి 100 శాతం వరకు ఉంది. 2002లో చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 165, 178 ద్వారా 200 శాతం పెంచాలని ప్రతిపాదించారు. కానీ నివాసాలకు 75 శాతం, వాణిజ్యానికి 150 శాతం పెంచారు. ఆ తరువాత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అదే జీవోను పూర్తిగా అమలు చేసింది. ఇలా గత 13 ఏళ్లుగా ఎటువంటి పెంపు లేదు.
మున్సిపాలిటీ ఆస్తుల సంఖ్య పన్ను ఆదాయం
ఏలూరు 41,499 రూ.28.79కోట్లు
భీమవరం 30,039 రూ.15.37కోట్లు
తాడేపల్లిగూడెం 23,805 రూ.11.41కోట్లు
తణుకు 16,371 రూ.9.31కోట్లు
పాలకొల్లు 14,447 రూ.5.72కోట్లు
జంగారెడ్డిగూడెం 13,420 రూ.5.42కోట్లు
నరసాపురం 14,399 రూ.4.37కోట్లు
నిడదవోలు 9,238 రూ.3.60కోట్లు
కొవ్వూరుృ 10,502 రూ.2.00కోట్లు
మొత్తం 1,73,720 రూ.85.99 కోట్లు
నిడదవోలులో ఆస్తి పన్ను పెంపు కాపీలు దహనం
నిడదవోలు : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆస్తి పన్ను, మంచినీటి పన్నుల చార్జీల భారం మోపే కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత జువ్వల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ప్రజలపై పన్నుల భారం మోపడం అన్యాయమ న్నారు. ప్రజలు అద్దె విలువ కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే ప్రజలు వాటిని వ్యతిరే కించాలన్నారు. గండి శ్రీనివాసరావు, టి.నాని, మహేశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.