‘పశ్చిమ’లో భారీ వర్షాలకు అల్లకల్లోలం.. జన జీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2020-09-16T17:29:27+05:30 IST

జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు..

‘పశ్చిమ’లో భారీ వర్షాలకు అల్లకల్లోలం.. జన జీవనం అస్తవ్యస్తం

తమ్మిలేరు ఉధృతికి ఒకరి దుర్మరణం.. మరో ఇద్దరు సురక్షితం

కంసాలిపాలెం వద్ద కుప్ప కూలిన ఎర్రకాలువ వంతెన 

చెరువులకు గండ్లు.. పట్టణాల్లో రోడ్లపైకి డ్రెయినేజీ నీరు 

స్వల్పంగా పెరిగిన గోదావరి


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు రైతులకే కాదు.. మిగతా వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి భారీ వర్షా లకు తావిచ్చింది. తెలంగాణ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు పడడంతో ఆ నీరంతా దిగువకు చేరుతోంది. తమ్మిలేరు జలాశయానికి ఎడతెరపి లేకుండా వర్షపు నీరు వచ్చి చేరుతూనే ఉంది. ఈ కారణంగా వరుసగా మూడో రోజు రిజర్వాయర్‌ నుంచి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ తిరిగి వర్షాలు మరింతగా పడి తే నీరు విడుదలను మరికాస్త పెంచవచ్చు. ఇప్పటికే తమ్మిలేరు ఉధృ తికి ఏలూరు గడగడలాడిపోయింది. వైఎస్‌ఆర్‌ కాలనీ నీట మునిగిం ది. చింతలపూడి వద్ద తమ్మిలేరులో ఒకరు కొట్టుకు పోయారు.


వరద ను ఊహించకుండా దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు చుట్టూ వున్న కాజ్‌వేలన్నింటిపైన భారీగా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటిని దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్‌ రక్షణ నిమిత్తం సాధ్యమైనంత మేర ఒక క్రమపద్ధతిలోనే నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే తమ్మిలేరు వరద పరిస్థితిని గంట గంటకూ అధికారులు బేరీజు వేస్తున్నారు. తగు జాగ్రత్తలతో బులిటెన్లు విడుదల చేస్తున్నారు. శనివారపుపేట కాజ్‌వే నుంచి శ్రీపర్రు వద్ద వున్న కాజ్‌వే వరకూ భారీ ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా రాకపోకలన్నింటినీ పూర్తిగా నిలిపివేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఓ వైపు శనివారపుపేట, మరోవైపు శ్రీపర్రు వద్ద వంతెనల నిర్మాణానికి ఇంతకు ముందే అనుమతులిచ్చినా ఏళ్ల తరబడి పూర్తి చేయలేకపో యారు.


ఫలితంగా ఏలూరు నగరంలో రాకకు అస్తవ్యస్తంగా మారింది. లింగారావుగూడెం వద్ద తమ్మిలేరు వరద నీరు చేలల్లోకి చేరింది. ఇక్క డ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వైఎస్‌ఆర్‌ కాలనీలోనూ వరద నీరు చేరింది. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లగా ఇంకొందరు కాలనీల్లోనే ఉండిపోయారు. ఆఖరికి రాత్రి వేళ విషసర్పాలు తిరగడంతో భయాందోళన నెలకొంది. తమ్మిలేరు రిజర్వాయర్‌ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవసరమైన పక్షంలో దీనిని మరింత పెంచే అవకాశం ఉంది. జిల్లాలోని వివిధ జలాశయాల్లోనూ భారీగా నీరు చేరింది. కొవ్వాడ రిజర్వాయర్‌ నుంచి గేట్లను ఎత్తివేశారు. ఇక్కడ కాజ్‌ వేపై నిండుగా నీరు ప్రవహిస్తోంది. ఎర్రకాలువ ఉగ్రరూపం ప్రదర్శి స్తోంది.


జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్రకాలువ జలాశయం పూర్తి గా నీటితో నిండింది. దీంతో అధికారులు అప్రమత్తమై సుమారు ఎని మిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిడద వోలు, తాడేపల్లిగూడెం రూరల్‌ మండలాల మధ్య ఎర్రకాలువపై నిర్మించిన వంతెన కొంతభాగం కుప్పకూలింది. అధికారులు ఆ ప్రాం తానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అంతటా చిన్న చిన్న చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఇంకొన్ని చెరువుగట్లకు ఏ క్షణా న్నైనా గండి పడే అవకాశం ఉంది. దీంతో ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 


స్వల్పంగా పెరిగిన గోదావరి

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి స్వ ల్పంగా పెరిగింది. రెండు రోజులుగా ప్రవాహం పెరిగి మరోవైపు వడి తీవ్రత సాధారణ స్థాయికి మించింది. ఇప్పటికే పోలవరం వద్ద గోదా వరి నీటిమట్టం 20 మీటర్లు ఉండగా క్రమేపీ పెరుగుతోంది. పది రోజు ల క్రితమే గోదావరికి వరదలు వచ్చి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. తిరిగి శాంతించగానే వర్షాల కారణంగా వరద నీరు పెరుగుతోంది. కొత్తూరు కాజ్‌వేపై ఐదడుగుల నీరు చేరింది. రాకపోకలు ఆటంకం కలిగింది. కొందరు సాహసించి ఇటు నుంచి ఆ వైపుకు చేరే ప్రయ త్నం చేశారు. మంగళవారం సాయంత్రం మరింత పెరగడంతో రాకపో కలను నిలిపివేశారు. 


అన్నదాతకు భారీ నష్టం

24,890 ఎకరాల్లో పంటలు మునక

ఏలూరు: జిల్లావ్యాప్తంగా అన్నదాతలకు భారీ నష్టమే వాటిల్లింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే వేల ఎకరాల్లో పంట నాశనమైంది. తాజాగా మూడు రోజుల్లోనే వేల ఎకరాల్లో అరటి, వేరుశనగ, వరితోపాటు ఉద్యాన పంటలు నీట మునిగాయి. 35 మండలాల్లోని 197 గ్రామాలలో 24 వేల 890 ఎకరాల్లోని పంటలు ముంపునకు గురయ్యాయి. ఇందులో వరి 23 వేల 610 ఎకరాలు, ప్రత్తి 490 ఎకరాలు, వేరు శనగ 590 ఎకరాలు, చెరకు 75 ఎకరాలు ఉన్నాయి. 125 ఎకరా ల్లో ఇసుక మేటలు వేసి దెబ్బ తిన్నాయి. పాలకొల్లు, ఆచంట, పోడూరు, నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, ఆకివీడు, కాళ్ల, ఉండి, తాడేపల్లిగూడెం, గణపవరం, నిడమర్రు, పెంటపా డు, తణుకు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, ఆత్తిలి, భీమడోలు, ఉంగుటూరు, నల్లజర్ల, కుక్కు నూరు, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, వీరవాసరం, భీమవరం, పాలకోడేరు, చింతలపూడి, టి.నరసాపురం, లింగపాలెం, ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లోని 197 గ్రామాలలో పంట లకు నష్టం వాటిల్లింది.


దెందులూరు, తాడేపల్లిగూడెం మండలా ల్లో ముంపునకు గురైన పంట పొలాలను జిల్లా వ్యవసాయశాఖ జేడీ గౌసియాబేగం మంగళవారం పరిశీలిం చారు. రైతులకు సూ చనలు చేశారు. కోతలకు సిద్ధంగా ఉండి నేలకొరిగిన కంకులను పరిశీలించారు. పంట పొలాల్లో నీరు తీస్తే నష్టం అంచనా వేస్తా మని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం 9,956 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని వివరించారు.
Updated Date - 2020-09-16T17:29:27+05:30 IST