గాలి..వాన
ABN , First Publish Date - 2020-04-26T11:24:35+05:30 IST
జిల్లాలో శనివారం రాత్రి చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఉరుములు, మెరుపులు, పిడుగులు..
వరి, అరటి, మొక్కజొన్న, మామిడి పంటలకు భారీ నష్టం
జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆకివీడులో వడగళ్ల వాన
ఏలూరుసిటీ, ఏప్రిల్ 25 : జిల్లాలో శనివారం రాత్రి చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రైతులు కష్టపడి ధాన్యం గట్టెక్కిస్తున్నారు. చాలాచోట్ల రైతులు కోసిన ధాన్యం రోడ్డుపై ఆరబెట్టుకున్నారు. ఇటువంటి సమయంలో వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల కారణంగా మామిడి కాయలు రాలిపోగా, అరటి తోటలు నేలవాలాయి. మొక్కజొన్న, మిర్చి పంటలకు భారీగానే నష్టం వాటిల్లింది. వరి చేలకు అపారనష్టం వాటిల్లింది. దాదాపు 80 శాతం దాళ్వా పంట కోతలు పూర్తయ్యాయి. పనల మీద ఉన్న పంటకు వర్షం వల్ల తీవ్ర నష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల చేలల్లోనే ధాన్యపు రాశులు పోసి ఉన్నాయి. రాత్రివేళ వర్షం పడడంతో రైతులు పొలాల వైపు పరుగులు తీశారు. బరకాలతో ధాన్యపు రాశులు కప్పేప్రయత్నం చేశారు.
జిల్లా అంతటా వర్షం
జిల్లాలో ఏలూరునగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని కామవరపుకోట, పెదవేగి, దెందులూరు, పెదపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోను, ద్వారకాతిరుమల, భీమడోలు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, తణుకు, పెంట పాడు, ఉండి మండలాల్లోను భారీగానే వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కామవరపుకోట మండలంలో అరటి తోటలు నేలనంటాయి. మామిడికాయలు నేలరాలాయి. ఆరబెట్టిన మొక్కజొన్న పంట దెబ్బతింది. లింగపాలెం మండలంలో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఈ మండలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది.
దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. భీమడోలు మండలంలోని భీమడోలు, పోలసానిపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నల్లజర్ల మండలంలోని నల్లజర్ల, అనంతపల్లి గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీగానే వర్షపాతం నమోదైంది. నిడదవోలు, దేవరపల్లి, కొవ్వూరు తదితర ప్రాంతాలలో కూడా వాతావరణం చల్లబడింది. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వర్షం అంతంత మాత్రంగా ఉన్నా ఉరుములు, మెరుపులుఎక్కువగా కనిపించాయి. ఆకివీడులో వడగళ్ల వాన కురిసింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియడంతో మెట్ట ప్రాంత మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆకివీడులో పిడుగుపడి ఎలక్ర్టానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయి.