ఏలూరులో తీవ్ర కలకలంపై మంత్రి నాని స్పందన.. ఆ రిపోర్ట్ వస్తేనే..!

ABN , First Publish Date - 2020-12-06T17:23:27+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనాలకు వస్తున్న వింత వ్యాధిపై

ఏలూరులో తీవ్ర కలకలంపై మంత్రి నాని స్పందన.. ఆ రిపోర్ట్ వస్తేనే..!

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనాలకు వస్తున్న వింత వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. శనివారం నాడు ఈ వింత వ్యాధి వెలుగులోకి రాగా హుటాహుటిన ఏలూరుకు వెళ్లిన మంత్రి నాని ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకూ ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇంకా మూర్ఛ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారని.. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకుంటున్నారని వెల్లడించారు.


ఆ రిపోర్ట్ వస్తేనే..

ఇప్పటివరకూ 70 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 76 మంది మహిళలు, 46 మంది చిన్నపిల్లలు మొత్తం 157 మందికి చికిత్స అందిస్తున్నాం. సమస్య ఉత్పన్నమైన ప్రాంతాల్లో మెరుగైన వైద్య క్యాంప్‌లు పెట్టాం. ఎవరికి ప్రాణాపాయం లేదు.. ఐదుగురికి రిపీటెడ్‌గా ఫిట్స్ వస్తున్నాయి. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారికి కాస్త విషమంగా ఉంటే వారిని విజయవాడ తరలించాం. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. మధ్య వయస్కులు క్షేమంగా ఉన్నారు. పిల్లలు, వృద్ధులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదు. బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు.. ఇప్పుడు అంతా నార్మల్‌గా ఉంది. ఇంకా కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే రోగం ఏమిటో తెలుస్తుంది అని మంత్రి నాని మీడియాకు వెల్లడించారు.

Read more