కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన

ABN , First Publish Date - 2020-11-01T05:03:28+05:30 IST

కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌లను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ విస్సాకోడేరులో శనివారం వాటర్‌ట్యాంక్‌ ఎక్కి సుమారు 5 గంటలపాటు నిరసన తెలిపారు.

కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన
వాటర్‌ట్యాంక్‌పై నిరసన చేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్‌లు

పాలకోడేరు, అక్టోబరు 31: కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌లను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ విస్సాకోడేరులో శనివారం వాటర్‌ట్యాంక్‌ ఎక్కి సుమారు 5 గంటలపాటు నిరసన తెలిపారు. డీఎస్సీ ద్వార ఎంపికైన సుమారు 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యో గులుగానే మిగిలారన్నారు. 18 ఏళ్లుగా భద్రతలేని ఉద్యోగులుగా జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితం పాలకోడేరులో వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంనుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో తమ జీవితాలకు భరోసా కల్పించాలంటూ మరోసారి వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నామని అన్నారు.


విస్సాకోడేరులో కాంట్రాక్టు హెల్త్‌ అసిస్టెంట్‌లు నిరసన చేస్తున్న ప్రదేశానికి ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి, గ్రామ కార్యదర్శి పోలయ్య, మహిళా పోలీసులు, భీమవరం ఫైర్‌ సిబ్బంది చేరుకున్నారు. ట్యాంకు ఎక్కిన కాంట్రాక్టు హెల్త్‌అసిస్టెంట్‌లు తమకు తగిన హామీ వచ్చేవరకు దిగేదిలేదని పట్టుబట్టారు. చివరికి నరసాపురం ఉప వైద్యాధికారి సీహెచ్‌వి రంగంనాయుడు వచ్చి సమస్యను ఉన్నతాధికారులకు తెలియపరుస్తానని చెప్పడంతో ట్యాంక్‌పైనున్న హెల్త్‌అసిస్టెంట్‌లు కిందికి దిగివచ్చారు. అనంతరం హెల్త్‌ అసిస్టెంట్‌ల సమస్యలను వివరిస్తూ డిప్యూటీ డీఎంఎండ్‌హెచ్‌వోకు వినతిపత్రం అందించారు.


కేసు నమోదు

విస్సాకోడేరులో వాటర్‌ ట్యాంకు ఎక్కిన పీహెచ్‌ సీ హెల్త్‌ అసిస్టెంట్‌లు షేక్‌ బురాన్‌సాహెబ్‌, జే.శ్రీను, వైఎస్సార్‌ గోపాలకృష్ణపై 309 సెక్షన్‌ కింద ఆత్మహత్యాయత్నం కేసునమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్‌ఐ ఏజీఎస్‌.మూర్తి తెలిపారు.

Read more