టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-06-04T11:09:53+05:30 IST

మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తీపి కబురు అందించింది.

టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

ముందుగా రేషనలైజేషన్‌

దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి బదిలీ తప్పనిసరి


ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 3: మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తీపి కబురు అందించింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు మూడో తేదీలోగా వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆధారంగా టీచర్ల బదిలీలు నిర్వహించనున్నారు. విద్యాశాఖపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా విద్యార్థులు సాధించిన గ్రేడ్‌ల ఆధారంగా టీచర్ల బది లీలకు ఫెర్‌పార్మెన్స్‌ పాయింట్లు కేటాయించి ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని తొలగించారు. స్పెషల్‌ కేటగిరీలోకి వచ్చే కిడ్నీ మార్పిడి, గుండె శస్త్రచికిత్స, ఉద్యోగులైన భార్య భర్త (స్పౌజ్‌), అవివాహిత మహిళలు, చట్ట బద్దంగా విడాకులు తీసుకుని వంటరిగా జీవిస్తున్న మహిళలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.


ఈ దఫా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల బదిలీలను చేప ట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలుత పాఠశాలల్లో తరగతుల వారీగా టీచరు, విద్యార్థుల నిష్పత్తి ప్రాతిపదికన హేతుబద్దీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియను పూర్తి చేసిన తరువాత మిగులు (సర్‌ప్లస్‌)గా గుర్తించిన టీచర్లను కూడా బదిలీల్లో చేర్చనున్నారు. 


గిరిజన ప్రాంత పాఠశాలల్లో కొరత భర్తీ అయ్యేనా ? 

జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్య పాఠశాలల్లో మొత్తం 13450 మంజూరు (శాంక్షన్డ్‌) ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, వీటిలో 11240 పోస్టుల్లో మాత్రమే టీచర్లు పని చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలలో ప్రాథమిక పాఠశాలలు 139, ప్రాథమికోన్నత 25, ఉన్నత పాఠశాలలు ఎనిమిది ఉన్నాయి. వీటిలో 642 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, కేవలం 360 పోస్టుల్లో మాత్రమే టీచర్లు ఉన్నారు. వర్కింగ్‌ పోస్టుల్లోనూ చాలా వరకూ డిప్యుటేషన్లపై నియమితులైన వారే. ఫలితంగా గిరిజన ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉండడం, విద్యాప్రమాణాలు దిగజారడం, తదితర సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ దఫా గిరిజన ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చేస్తామన్న హామీ ఎంత వరకూ కార్యరూపంలోకి వస్తుందో వేచి చూడాల్సిందే. 


ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి  మెరుగయ్యేనా ? 

జిల్లాలో 495 ఏకోపాధ్యాయ (సింగిల్‌ టీచర్‌) పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నిర్ణీత 20 మంది కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు 350కి పైగా ఉన్నాయి. ఒకవేళ టీచరు  సెలవు పెడితే ఆ రోజు పాఠశాలకు తాళాలు వేయాల్సిందే. అయితే ముందుగా అనుమతి తీసుకున్న తరువాతే టీచరు సెలవు పెట్టాల్సి ఉంటుందని, ఆ రోజున  సమీప పాఠశాలల నుంచి టీచర్లను డిప్యూ టేషన్‌పై పంపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆకస్మికంగా సెలవు పెట్టాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సమా ధానం ఉండదు. తాజా బదిలీల్లో  ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో టీచరు వస్తే విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయనడంలో సందేహం లేదు. 


ముందుగా రేషనలైజేషన్‌ 

రేషనలైజేషన్‌ ఉత్తర్వుల ప్రకారం టీచరు, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక పాఠశాలలకు 1:30 గాను, ప్రాథమికోన్నతలో 1:35, ఉన్నత పాఠశాలల్లో 1:40గా తీసుకుని హేతు బద్ధీకరణను చేపట్టాల్సి ఉంది. ఈ నిష్పత్తుల ప్రకారం గతంలో చేపట్టిన రేషనలైజేషన్‌ వల్ల జిల్లాలో 900 మంది ఎస్‌జీటీలు సర్‌ప్లస్‌ టీచర్లుగా గుర్తించారు. వీరిలో ఉన్నత విద్యా ర్హతలు, సబ్జెక్టు నిపుణతలు ఉన్న వారిని డిప్యూటేషన్లపై కొరత ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠ శాలల్లో తాత్కాలికంగా నియమించారు. మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు బోధన కోసం 613 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు అవసరం అని విద్యాశాఖ ఇటీవల గుర్తించింది. ఆ ప్రకారం తాజాగా చేపట్టనున్న రేషన లైజేషన్‌ తరువాత నిర్వహించే బదిలీల్లో వీటన్నింటిని పరిష్కరించి సమ న్యాయం చేయాల్సి ఉంటుంది. 


ఆ..1,148 మందికి బదిలీ తప్పనిసరి 

జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే స్కూలులో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యా యులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఆ ప్రకారం ప్రధానోపాధ్యా యులకు ఐదు సంవత్సరాలు, మిగతా టీచర్లకు ఎనిమిది సంవత్సరాలు స్టేషన్‌ సర్వీసు ఒకే స్కూలులోగా నిర్ణయించేందుకు ప్రభుత్వం ఇటీవల సంకేతాలు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీని ప్రామాణిక తేదీ (కటాఫ్‌డేట్‌)గా పరిగణించి హెచ్‌ఎంలు, టీచర్ల వివరాలను సబ్జెక్టుల వారీగా సేకరించారు. దీంతోనే పాటే 20 శాతం హెచ్‌ఆర్‌ఏ (ఇంటిఅద్దె భత్యం) పొందుతున్న వారి వివరాలను కూడా సేకరించారు. ఆ ప్రకారం సెకండరీ గ్రేడ్‌ టీచర్లలో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్న వారు 70 మంది ఉండగా, లాంగ్‌ స్టాండింగ్‌ 547 మంది ఉన్నారు.


ఒకే స్కూలులో లాంగ్‌స్టాండింగ్‌ పనిచేస్తున్న గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు 32 మంది, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌లు 74 మంది ఉన్నారు. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో తెలుగు 60 మంది, హిందీ 24, ఇంగ్లీషు 71, సోషల్‌ స్టడీస్‌ 48, గణితం 116, ఫిజికల్‌ సైన్స్‌ 106, బయోలాజికల్‌ సైన్స్‌ 60 మంది ఉన్నారు. వీరుగాక ఫిజికల్‌ డైరెక్టర్లు ముగ్గురు, పీఈటీలు ఏడు మంది ఉన్నారు. మొత్తం మీద లాంగ్‌ స్టాండింగ్‌ 1148 మంది ఉండగా తాజా బదిలీల్లో వీరందరికీ స్థానచలనం తప్పనిసరి. కాగా 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్న హెచ్‌ఎంలు, టీచర్లలో ఎగ్జిస్టింగ్‌ 103 మంది, లాంగ్‌ స్టాండింగ్‌ 100 మంది ఉన్నారు.  

Updated Date - 2020-06-04T11:09:53+05:30 IST