గోదావరి పరవళ్లు

ABN , First Publish Date - 2020-08-12T10:56:53+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

గోదావరి పరవళ్లు

ధవళేశ్వరం వద్ద 10.30 అడుగులకు నీటిమట్టం

లక్షా 46 వేల 733 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల


కొవ్వూరు/ నిడదవోలు/ పోలవరం, ఆగస్టు 11 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతుండడంతో మంగళవారం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 10.30 అడుగులు, భద్రాచలం వద్ద 24.70 అడుగుల చొప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి. ఎగువ నుంచి వరద నీరు అధికంగా రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. గోదావరి వరద నీరు పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ ఉన్న ఇసుక తిన్నెలను పూర్తిగా ఆక్రమించింది.


పోలవరం వద్ద ఉన్న కడెమ్మ సూయిజ్‌ గేట్లకు అనుకుని ప్రవహిస్తుంది. ఎగువ నుంచి లక్షా 57 వేల 725 అడుగుల ఇన్‌ఫ్లో వస్తుండంతో ధవళేశ్వరం బ్యారేజీకున్న 175 గేట్లను పైకెత్తి లక్షా 46 వేల 733 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ దిగువన్న ఉన్న మూడు ప్రధాన డెల్టాలకు 12  వేల 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని గోదావరి హెడ్‌ వాటర్‌వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆర్‌.మోహనరావు తెలిపారు. రానున్న 24 గంటల్లో గోదావరి   నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలున్నాయని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-12T10:56:53+05:30 IST