మా కష్టం తీరేదెప్పుడో.. దేవుడా!!

ABN , First Publish Date - 2020-04-24T09:47:01+05:30 IST

ఆలయాలు లాక్‌ అయ్యాయి.. అర్చకుల ఆదాయం డౌన్‌ అయింది.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే

మా కష్టం తీరేదెప్పుడో.. దేవుడా!!

అర్చకులకు ఆర్థిక ఇబ్బందులు - పనిలేక కార్పెంటర్ల అవస్థలు కరోనా.. కరోనా.. ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఎందుకంటే కరోనా అంతా ఇంతా పనిచేసిందా.. అందరినీ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.. లక్షలాది మంది జీవనంపై దెబ్బకొట్టింది.. చేద్దామంటే పనిలేక.. ఆదాయం వచ్చే దారి లేక ఆకలితో అలమటిస్తున్నవారెందరో.. ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అని ఏ రోజుకారోజు దాతల సాయానికి ఎదురుచూస్తున్నారు. ఆలయాల్లో నైవేద్యం పెట్టి మా సంగతేంటి దేవుడా అంటూ  అర్చకులు ప్రశ్నిస్తుంటే.. తమను ఆదుకోవాలని వడ్రంగి కార్మికులు కోరుతున్నారు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి.. కరోనా ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టివేసింది..     ఈ కష్టాల నుంచి బయపడేదెప్పుడా అంటూ అంతా ఎదురుచూస్తున్నారు. 


మా సంగతేంటి దేవుడా!

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 23 : ఆలయాలు లాక్‌ అయ్యాయి.. అర్చకుల ఆదాయం డౌన్‌ అయింది.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి తెచ్చిపెట్టింది.. నిత్యం దేవుడికి నైవేద్యం పెట్టే అర్చక కుటుంబాలే ఆకలితో అలమటించే రోజు వచ్చింది.. కరోనా వైరస్‌ కారణంగా గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ మూతపడ్డాయి.దేవాలయాల్లో ప్రతీ రోజూ ఉదయం స్వామికి పూజలు, నివేదన చేసి తాళాలు వేస్తున్నారు. దీంతో అర్చకుల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.. ఆలయాలు తెరిచి ఉంటే భక్తులకు ఇచ్చే కానుకలతో పాటు.. దేవాలయం నుంచి వచ్చే జీత ంతో అర్చకుల కుటుంబాలు జీవిస్తాయి.


ప్రతీ నెలా జీతం కంటే కానుకలే ఎక్కువగా వస్తాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులనేవి ఉండేవి కాదు. అయితే గత నెల రోజులుగా ఆలయాలు మూతపడడంతో చాలా మంది చిన్న చిన్న అర్చకులను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. దీంతో మళ్లీ పూర్తిగా ఆలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని అర్చకులు ఎదురుచూస్తున్నారు. 


జిల్లాలో 5 వేల మంది అర్చకులు...

జిల్లా వ్యాప్తంగా ఎండోమెంట్‌ ఆధ్వర్యంలో మొత్తం 1667 దేవాలయాలు ఉండగా..ప్రైవేట్‌ దేవాలయాలు 3 వేల వరకూ ఉన్నాయి. మొత్తంగా  జిల్లాలో సుమారు 5 వేల మంది అర్చకులు ఉన్నారు. ఎండోమెంట్‌ దేవాలయాల్లో 640 మంది అర్చకులు ఈనాం (పొలాలుపై వచ్చే ఆదాయంతో) పనిచేస్తున్నారు. 250 దేవాలయాల్లో నెలవారీ జీతాలే ఆధారం.  ఇక 6ఏ గ్రేడులో 9 దేవాలయాలు, 6బీలో 376 6సీలో 330 దేవాలయాలు 250 దేవాలయాలు జీతాలు చెల్లించేవి ఉన్నాయి. ప్రైవేటు దేవాలయల్లో కమిటీ సభ్యులే జీతాలు చెల్లిస్తారు.


అర్చకుల జీతాలు కూడా పెద్దగా ఉండవు. రూ. 5 నుంచి రూ. 10 వేల లోపే ఉంటాయి. ఈనాం దేవాలయ భూములపై పంట వచ్చిన తరువాత కానీ జీతాలు ఇవ్వరు. కొన్ని దేవాలయాల్లో హుండీలు లెక్కిస్తే కానీ జీతాలివ్వరు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం కష్టంగా ఉంది. వైశాఖ మాసంలో ఎక్కువగా 50 నుంచి 60 శాతం దేవాలయాల్లో కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. దీంతో అర్చకుల ఆదాయం భారీగా ఉండేది. అయితే ఆలయాలే మూతపడడంతో ఈ ఏడాది ఆదా యం లేకుండా పోయింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రూ. 5 వేల ఆదాయంలోపు ఉన్న దేవాలయాలకు దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా రూ. 5 వేల ఆర్ధికసాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో  కొంత ఊరట కలుగుతుంది.  


అర్చకులు ఇబ్బంది పడుతున్నారు..

కరోనా ప్రభావం అర్చకులపై చాలా ప్రభావం చూపింది.. చాలా మందికి రోజు గడవడమే కష్టంగా ఉంది. ఆలయాలు ఉంటే కానుకల రూపంలో రోజూ ఎంతో కొంత ఆదాయం వచ్చేది. అది కాకుండా నెలవారీ జీతం ఉండేది. అయితే ఈ నెల అదీ లేదు.. జీతం లేదు.. దీంతో ఇబ్బందులు పడుతున్నారు.. పెద్దింటి పురుషోత్తమాచార్యులు, అర్చక సమాఖ్య  రాష్ట్ర  ఉపాధ్యక్షుడుప్రభుత్వం సాయం అందించాలి.. అర్చకులు  ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వ సాయానికి ఎదురుచూస్తున్నారు. నెల రోజులుగా రూపాయి ఆదాయం వచ్చే మార్గం కానరాక సతమతం అవుతున్నారు. ప్రభుత్వసాయం అందితే కొంత ఊరట కలుగుతుంది. 

వెలవలపల్లి జానకిరామయ్య ,అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు


పనిలేక.. బతకలేక...

తణుకు: చేద్దామన్నా పనిలేదు..ఆదాయం వచ్చే దారి లేదు.. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల రోజులుగా పనిలేక వండ్రంగి కార్మికులు అల్లాడుతున్నారు. భవన నిర్మాణాలు నిలిచిపోవడంతో చాలా రంగాలపై  ఆ ప్రభావం పడింది. దానిలో వండ్రంగి పనివారు ఒకరు. జిల్లాలో సుమారు 15 వేల మంది కార్మికులు వడ్రంగి పనిపై ఆధారపడి జీవిస్తున్నారు.ఒక్క తణుకులోనే 3 వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 10 శాతం మాత్రమే ఆర్థికంగా స్థిరపడినవారుంటారు. మిగిలిన 90 శాతం మంది రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులే.


వండ్రంగి కార్మికులకు రోజుకు సుమారు రూ. 500 నుంచి రూ. 600ల వరకూ సంపాదిస్తారు. అయితే గత నెలరోజు లుగా రూపాయి సంపాదన లేదు. దీంతో ఆయా కుటుం బాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్మికులకు సరిగా పనిలేక పోవడంతో ఏ రోజుకు ఆ రోజు అన్నట్టు గడచిపోయింది. ప్రస్తుతం రోజువారి పనిలేకపోవడంతో కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కార్మికుడికి ప్రభుత్వం రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


ఐదు నెలలుగా సరిగా పనుల్లేవ్‌

గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో సరిగా పనిలేక కార్మికులు ఇబ్బం దులు పడుతు న్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. రోజువారీ కూలీలు కావడంతో ఇబ్బందిగా ఉంది.  ప్రభుత్వం ఆదుకోవాలి. -రామకృష్ణ, వడ్రంగి అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


ప్రభుత్వం ఆదుకోవాలి :  ఉదయభాస్కరరావు, కార్మికుడు

భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి. కొన్ని   సామాజిక వర్గాలకు అందిస్తున్న విధంగానే కార్పెంటర్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి.   


దుర్భరంగా జీవితాలు :  కొండబాబు, కార్మికుడు

కార్పెంటర్ల జీవితాలు దుర్భరంగా మారాయి. గుర్తింపు కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.10 వేల సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం  వెంటనే నిర్ణయం తీసుకోవాలి.


పనిలేక.. పస్తులు :  నాగబాబు, కార్మికుడు

తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాలు పస్తులండే పరిస్ధితులు వచ్చాయి. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.

Updated Date - 2020-04-24T09:47:01+05:30 IST