స్థానిక నగారా మోగింది

ABN , First Publish Date - 2020-03-08T11:36:01+05:30 IST

స్థానిక నగారా మోగింది. వరుసగా మూడు వారాల పాటు ఈ నెలాఖరు వరకు స్థానిక సమరానికి వీలుగా నిర్ణీత షెడ్యూల్‌ను ప్రకటించారు. తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి

స్థానిక నగారా మోగింది

11 నుంచి మునిసిపల్‌ ఎన్నికలకు సమాయత్తం 

23న పోలింగ్‌కు ఏర్పాట్లు 

రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు 

ఈ నెల 15 నుంచే సన్నాహాలు 

27, 29 తేదీల్లో పోలింగ్‌ 

అదే రోజుల్లో మధ్యాహ్నం నుంచే ఓట్ల లెక్కింపు - ఫలితాలు విడుదల

అమల్లోకి ఎన్నికల కోడ్‌  నిబంధనలు తప్పొద్దు 

కలెక్టర్‌ ముత్యాలరాజు  


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్థానిక నగారా మోగింది. వరుసగా మూడు వారాల పాటు ఈ నెలాఖరు వరకు స్థానిక సమరానికి వీలుగా నిర్ణీత షెడ్యూల్‌ను ప్రకటించారు. తక్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని       ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీనికి అనుగుణంగానే వ్యవహరించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ నిర్దేశించింది. ఇంతకు ముందు ఊహించినట్టుగానే తొలుత జట్పీడీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో పాటు ఎన్నికల నియమావళి పడక్బంధీగా అమలు చేయాల్సిందిగా కూడా కమిషన్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని సూచించింది. స్థానిక సమరం మూడు విడతలుగా పూర్తి చేస్తారు. దీనికి అనుగుణంగానే ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు, నామినేషన్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ  తేదీలను ప్రకటించారు. ఈనెల 9న ఆరంభ మై 29 నాటికి స్థానిక సమరం  పూర్తవుతుంది. ఈమేరకే షెడ్యూల్‌ విడుదలైంది. 


జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇది :

ఎన్నికల కమిషన్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి శనివారం షెడ్యూల్‌ విడుదలైంది. ఆ వెనువెంటనే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈనెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుంది. 21న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 9 నుంచి 11 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 ఉదయం 8 గంటల నుంచి నామినేషన్లను పరిశీలన పూర్తి చేస్తారు. 13న తిరస్కరించిన నామినేషన్లపై జడ్పీటీసీలు అయితే కలెక్టర్‌కు, ఎంపీటీసీలు అయితే సంబంధిత ఆర్డీలకు దరఖాస్తు చేసుకో వాలి. 14 మధ్యాహ్నం నాటికి అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఈనెల 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 24 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. 


మునిసిపల్‌ ఎన్నికల వివరాలు

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఈ నెల 15న ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే 18వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 20వ తేదీ మధ్యాహ్నం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. దీనికి అనుగుణంగానే ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. 29న ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 


రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు 

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15, 17న నోటిఫకేషన్‌ విడుదలవుతుంది. రెండు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలకు 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ 17 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. అలాగే 22న అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 27న ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. దీని ధరిమిల అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. అలాగే రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా 17న నోటిఫికేషన్‌ జారీ చేసి, 19 నుంచి 21వ తేదీ మధ్యన నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటిరోజు నామినేషన్లను పరిశీలించి 24న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ధేశించారు. 29వ తేదీ పోలింగ్‌ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభించి, ఫలితాలను అదేరోజు ప్రకటిస్తారు. 


ఎన్నికల నియమావళి తక్షణం అమలులోకి :

ఎన్నికల నియమావళి తక్షణం అమలులోకి వచ్చింది. పార్టీ నేతలు, అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత దూషణలు చేయ రాదని, జాతి, కుల, మత పరమైన విభేదాలు సృష్టించకూడదని ఆంక్షలు విధించారు. తగ్గట్టు గానే వివిధ రకాలైన పద్ధతులను సూచించారు. ఎన్నికల నియమావళి వెలువడిన తర్వాత ఎలాంటి గ్రాంట్లు చేయకూడదు. కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు, రహదారుల నిర్మాణం చేపట్టకూడదు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చేముందు దానికి సంబంధించిన సీడీనీ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి, అనుమతి పొందాలి.  ప్రభుత్వ వసతిగృహాలు, సభాస్థలిలు, హెలిప్యాడ్‌లు వంటి సౌకర్యాలు కేవలం అధికార పార్టీకే కాకుండా ఇతరులు వినియోగించుకునే అవకాశం కల్పించాలి.


సెక్యూరిటీ వాహనాల్లోనూ మూడు కంటే ఎక్కువ వాడితే దానిని ఎన్నికల వ్యయం కింద చూపెట్టాలి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమలులోకి వస్తుంది. పోలింగ్‌ రోజున ఏఏ పద్ధతులు పాటించాలో సూచించారు. శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు ఉండకూడదని,  పోలింగ్‌ రోజు అంతకంటే 24 గంటలు ముందు మద్యం పంపిణీ చేయకూడదని ఆంక్ష పెట్టారు. ఎన్నికల ప్రచార పర్వంలోనూ గీత దాటితే సహించేది లేదని ఎన్నికల కమిషన్‌ తేల్చి చెప్పింది.  


ఎన్నికల నియమావళి అమలు చేయాలి : కలెక్టర్‌ ముత్యాలరాజు 

రాష్ట్ర ఎన్నికల సంఘం, జడ్పీటీసీ, ఎంపీటీసీల నోటిఫికేషన్‌ జారీ చేసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్టేనని, దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణం కల్పించాలని కూడా తేల్చి చెప్పారు. అభ్యర్థులు ప్రచారం చేసేటప్పుడు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు, గోడలను ప్రచారానికి వినియోగించకూ డదన్నారు.


ఈనెల 9 నుంచి రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు విధి నిర్వహణలో ఉండాలన్నారు.జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలకు 48కు పైగా జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు బ్యాలెట్‌ పేపర్లు ముద్రించాల్సి ఉన్నందున మండలాల్లో ఉన్న ప్రింటర్స్‌ వారి ప్రింటింగ్‌ కెపాసిటి వివరాలు కలెక్టరేట్‌కు తెలియజేయాలన్నారు. గ్రామ వాలంటీర్లను ఈ ఎన్నికల్లో వినియోగించకూడదని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు డ్యూటీలు కేటాయించిన సిబ్బంది విధిగా శిక్షణా తరగతులకు హాజరుకావాలని, అలా కాని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


పోలీసులు సమర్థత ప్రదర్శించాలి : ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ 

ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదుకు పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ సూచించారు. తెలంగాణ నుంచి వచ్చే అక్రమ మద్యం తరలించకుండా చెక్‌పోస్టులను పటిష్టం చేసి 24 గంటలూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చింతలపూడి, వేలేరుపాడు చెక్‌పోస్టుల నుంచి ఏ వాహనం వచ్చినా విధిగా తనిఖీ చేయాలని, రాత్రి సమయాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T11:36:01+05:30 IST