అరగంట ముందుగానే అనుమతి
ABN , First Publish Date - 2020-03-02T11:30:45+05:30 IST
జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏడాది పరీక్షల్లో పలు సంస్కరణలను ఇంటర్‌బోర్డు

ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు.. 4 నుంచి 23వ తేదీ వరకు
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
103 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
ఏలూరు ఎడ్యుకేషన్ మార్చి 1: జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏడాది పరీక్షల్లో పలు సంస్కరణలను ఇంటర్‌బోర్డు ప్రవేశ పెట్టింది. పరీక్షార్థులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలను చేపట్టింది. ఇన్విజిలేటర్ల నియామకాలు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, కస్టోడి యన్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల విధుల నిర్వహణపై స్పష్టత ఇచ్చిన ఇంటర్‌బోర్డు ఆ మేరకు జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించాలని నిర్ణయిం చింది. ఈనెల 20వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఎండల బారిన పడకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు పరీక్ష గదుల్లో స్పష్టమైన వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
103 సెంటర్లలో పరీక్షలు
ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 37,931 మంది, ఒకేషనల్ విభాగంలో 5085 మంది విద్యార్థులు కలిపి మొత్తం 43,079 మంది దరఖాస్తు చేసుకున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 33,676 మంది, ఒకేషనల్ విభాగంలో 3046 మంది కలిపి మొత్తం 36,722 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఇంటర్ థియరీ పరీక్షలకు 79,741 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 30, ఎయిడెడ్ కళాశాలల్లో 14, ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో 3, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 56 పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 103 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందుగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థినులను అనుమతిస్తారు.
‘నోయువర్ సీట్’ యాప్
విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం, లోకేషన్, సీటు వివరా లను ప్రత్యక్షంగానే తెలుసుకు నేందుకు వీలుగా ‘నోయువర్ సీట్’ పేరిట ప్రత్యేక యాప్‌ను ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ముందుగానే పరీక్షా కేంద్రం, పరీక్ష గది, కేటాయించిన సీటు గురించి తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రం ఉన్న ప్రాంతం గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు.
సమస్యాత్మక కేంద్రాలు
జిల్లాలో గోపాలపురం, చింతలపూడి, ఆచంట, దుంప గడపలోని జూనియర్ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాల్‌ప్రాక్టీస్ కేసులు, మాస్ కాపీయింగ్ జరగకుండా నిరోధించేందుకు సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నాలుగు ప్లయింగ్ స్క్వాడ్‌లు, 14 సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా నియమించారు. ఒక్కో స్క్వాడ్ బృందంలో ఇంటర్‌బోర్డు నియమించిన ప్రతినిధి, డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్‌ఐ ఉంటారు. సెల్ప్ సెంటర్‌లుగా పెదవేగి, పెదపాడు ఉన్నాయి. ఇక్కడ కూడా సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.
సౌకర్యాలు
అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. వైద్యబృందాలు ఉంటాయి. పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం 13 పాయింట్ల నుంచి ఆర్టీసీ బస్సులను ఆపరేట్ చేయాలని నిర్ణయించారు.
సీసీ కెమెరాలు
అన్ని పరీక్షా కేంద్రాల్లో 5-6 చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రశ్నాపత్రాలు తెరిచే ప్రిన్సిపాల్ గదిలోని, జవాబు పత్రాలను ప్యాక్ చేసే గదిలోనూ సీసీ కెమెరాలు ప్రత్యేకంగా అమరుస్తారు. ప్రాక్టికల్ పరీక్షల మాదిరిగానే జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ విధానంలో అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఇంటర్‌బోర్డు రాష్ట్ర అధికారులు నేరుగా పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ఫిర్యాదులకు నంబర్
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎక్కడైనా అవాంఛనీయ పరిణామాలు తలెత్తినా, విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నా, పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులకు ఆర్‌ఐవో కార్యాలయంలో ఫోన్ నెంబరు 08812-230197తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే ఇన్విజిలేటర్లలో ఎవరైనా నిబంఽధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రం సీఎస్, డీవోలపై కూడా చర్యలు ఉంటాయి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు తెచ్చేందుకు ఇన్విజిలేటర్లతో సహా ఎవరికీ అనుమతి లేదు. జిల్లాలో ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థి ఫిర్యాదు చేయలేదు. విద్యార్థులే ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లోకి వెళ్ళి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఈ ఏడాది నుంచి కల్పించారు.
-బి.ప్రభాకర్‌రావు, ఆర్‌ఐవో, ఇంటర్ బోర్డు