-
-
Home » Andhra Pradesh » West Godavari » From stock market to poultry
-
కరోనా కత్తి
ABN , First Publish Date - 2020-03-24T11:43:00+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం మార్కెట్‌పై పొడ చూపింది. పక్షం రోజులుగా జిల్లాలో పెద్దఎత్తున అన్ని వ్యవస్థలను

వ్యవస్థలపై వేటు.. కుప్పకూలిన కుటుంబాలెన్నో
స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి పౌల్ర్టీ వరకు
కోట్లు కూల్చేసిన కరోనా.. కోలుకోవడమూ కష్టమే
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్ ప్రభావం మార్కెట్‌పై పొడ చూపింది. పక్షం రోజులుగా జిల్లాలో పెద్దఎత్తున అన్ని వ్యవస్థలను దెబ్బతీసింది. స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి ఆక్వా వరకు ముంచింది. కష్టజీవిపై కత్తికట్టింది. పక్షం రోజులుగా కూలీనాలి లేక లక్షలాదిమంది బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో పరిస్థితి మరింత పతనమైంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో వ్యవసాయ కూలీల సంఖ్య దాదాపు తొమ్మిది లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతానికి వీరిలో 30 శాతం మందికే పని దొరుకుతుండగా, మిగతా వారంతా ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు పంటలు దెబ్బతినడంతో చేతినిండా పనిలేని పరిస్థితుల్లోనే కరోనా కాస్తా ముంచుకొచ్చింది.
ఇప్పటికే వీరిలో కొందరు దాదాపు అప్పుల పాలయ్యారు. ఎక్కువ మంది పనులకు పిలిచే అవకాశం లేక నిస్తేజంగా గడుపుతున్నారు. త్వరలోనే కోతలు దగ్గర పడుతుండగా కరోనాకు మహిళా కూలీలు భయపడుతున్నారు. ఇంకో వైపు ఆక్వా రంగంలో దాదాపు వేల మంది కూలి పొందుతున్నారు. గడిచిన నెల రోజులుగా చేపల పెంపకం, పట్టుబడి అదుపు తప్పింది. ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నా, దీనికి వదంతులు తోడవడంతో ఆక్వాకు షాక్ తగిలింది. అపోహలు నిజం కాదని, చేప, రొయ్యల వాడకంతో ఎలాంటి ముప్పు లేదని ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో ఆక్వా రంగానికి కొంత వెసులుబాటు లభించింది. ఇప్పటికే అనేక ఒడిదుడుకుల మధ్య రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి తోడు పౌల్ర్టీ రంగం కుదేలైంది.
ఇక్కడి నుంచే కోస్తా ప్రాంతానికి గుడ్లు, మాంసం చేరుతుంది. ఈ లెక్కన గడిచిన నెల రోజులుగా చికెన్‌పై దుష్ప్రచారం జరగడంతో వందలాది పౌల్ర్టీలు మూలన పడ్డాయి. దీనికితోడు పౌల్ర్టీ రైతులకు ఈ ఒక్క నెలలోనే దాదాపు రూ.140 నుంచి రూ.160 కోట్ల నష్టం వాటిల్లినట్లు తాజాగా లెక్క తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో పౌల్ర్టీకి నష్టం వాటిల్లడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం. అనుబంధంగావున్న మొక్కజొన్న పండించే రైతులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నారు. మార్కెట్ కుప్పకూలింది. పౌల్ర్టీ రైతులకు తోడు మొక్కజొన్న రైతులకు దాదాపు రూ.130 కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్‌లో ధర లేకపోగా, కొనుగోలుదారులు వెనక్కు తగ్గడంతో ఈ నష్టం తొంగి చూసింది. చైనాలో కరోనా వ్యాపించిన తరుణం నుంచే ఇక్కడ చికెన్, గుడ్లు అమ్మకాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
సాధారణంగా కోడి మేతలో మొక్కజొన్న వినియోగిస్తారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు ఆరేడు మండలాల్లో రైతులు ఆందోళనలో ఉన్నారు. నిండా మునిగామని, తేరుకోవడం కష్టమేనని, ఇదంతా కరోనా తీసిన దెబ్బేనని బావురమం టున్నారు. ప్రత్యేకించి డెల్టాలో అరటి, కొబ్బరి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్‌లో వీటికి డిమాండ్ తగ్గింది. ఒక దశలో పుంజుకున్నట్టే కనిపించినా, తాజా మార్కెట్ సరళిని బట్టి అరటి అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన కొబ్బరి ఎగుమతులు కాస్తా నిలిచిపోయాయి. దీంతో ఈ రెండు పంటలకు దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. ఇది మరికాస్త పెరిగే అవకాశం లేకపోలేదు. చిరు వ్యాపారులు దాదాపు రూ.70 కోట్లకు పైగానే చేజార్చుకున్నారు. ఇతరత్రా జోరుగా సాగుతున్న వ్యాపారాల్లో కరోనా కుదుపుతో దాదాపు రూ.130 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
స్టాక్ కింద కోట్లు కూలాయి
స్టాక్ ఎక్సేంజ్ తరచూ పతనం కావడంతో మదుపుదారులు భారీగా నష్టపోయారు. జిల్లాకు చెందిన అనేక మంది స్టాక్స్ లిస్టు ఎప్పటికప్పుడు పరిశీలించి పెట్టుబడులకు దిగుతారు. ఈ లెక్కన కరోనా ఆరంభమైన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్‌లో కుంగుబాటు కనిపిస్తోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు ఈ జిల్లాలో రూ. 158 కోట్లు చేజారాయి. దీంతో అనేక మంది పూర్తిగా దివాలా తీసినట్టయ్యింది. ఎవరూ ఊహించని రీతిలో ఒకరోజు కాక పోతే మరొక రోజు అయినా మార్కెట్ పుంజుకుంటుందనుకుంటే విరుద్ధంగా కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ నష్టాలు ఇంతటితో ఆగకపోగా, దాదాపు మూడువందల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మదుపుదారులు చెబుతున్నారు.
కూలీల కడుపు కాలింది
ఒకవైపు రైతులు పూర్తిగా దెబ్బ తింటుండగా, మరోవైపు కూలీల బతుకులు అస్తవ్యస్తంగా మారాయి. ఫుట్‌పాత్‌ల వ్యాపారం పూర్తిగా పతనమైంది. రోజువారీ వ్యాపారంలో దాదాపు 20 వేల మంది బతుకీడ్చుకొస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ వ్యాపారం చితికిపోయింది. దీనినే నమ్ముకున్న వారంతా కుప్పకూలిపోయారు. పరిస్ధితి మరింత దిగజారడంతో వీరి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. వారం వారం కట్టాల్సిన వడ్డీలు, అప్పులు, తడిసి మోపుడవుతున్నాయి. పరిస్థితిని అంచనా వేసేందుకు వీలులేనంతగా మారింది. కేవలం కరోనా ప్రభావంతోనే ఈ వ్యవస్థ అంతా తల్లకిందులైంది. ఆఖరికి వారం రోజులపాటు లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు పరిస్ధితి మరింత దారుణంగా మారింది.
ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి చిరు వ్యాపారుల వరకు పూర్తిగా నష్టాన్ని చవిచూడాల్సిందే. అంతకంటేమించి వీరు కోల్పోయేది లక్షల్లోనే ఉన్నా, ఇలాంటి కుటుంబాలపై ఆధారపడినవారు మాత్రం భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఆఖరికి పల్లెల్లోనూ పని లేదు. మరోవైపు పట్నాల్లో హోటల్స్‌తో సహా మిగతావి మూత పడడంతో వందలాదిమంది రోజువారీ భృతి కోల్పోయారు. నిరుద్యోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.
వృద్ధులు, యాచకుల గగ్గోలు
పట్టణ ప్రాంతాల్లో తరచూ కనిపించే వృద్ధులు, యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికే కొందరు దాతలు ముందుకు వచ్చి, వీరికి మధ్యాహ్నం వేళ కొంత ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఆకలి దప్పులతో అలమ టిస్తున్నారు. ఒకవైపు యాచకులుగా జీవిస్తున్న వారంతా కాలే కడుపుతో ఎక్కడికక్కడ పస్తులు ఉంటున్నారు. ఇంకోవైపు వీరిని ఆదరించేందుకు ఎవరూ సాహసించటం లేదు.
మిగిలిన నష్టం
స్టాక్ మార్కెట్ రూ. 158 కోట్లు
పౌల్ర్టీ రంగం రూ.150 కోట్లు
మొక్కజొన్న రైతులు రూ.130 కోట్లు
ఆక్వాలో కోల్పోయింది రూ.90 కోట్లు
చిరు వ్యాపారులు రూ.70 కోట్లు
బులియన్ మార్కెట్ రూ.45 కోట్లు
ఇతరత్రా వ్యాపారాలు రూ.130 కోట్లు