పక్కదారిలో ఉచిత ఇసుక
ABN , First Publish Date - 2020-09-14T10:33:59+05:30 IST
గ్రామాల్లో ప్రభుత్వం ఉచితంగా అందించే ఇసుక పక్కదారి పడుతోంది. ఇసుక అవసరమైన వారు ఆయా గ్రామ ..
ర్యాంపులపై సిండికేట్.. వారి మాటే వేదం
కుక్కునూరులో పరిమితికి మించి రవాణా
నల్లజర్ల/కుక్కునూరు, సెప్టెంబరు 13 : గ్రామాల్లో ప్రభుత్వం ఉచితంగా అందించే ఇసుక పక్కదారి పడుతోంది. ఇసుక అవసరమైన వారు ఆయా గ్రామ సచివాలయాల్లో అనుమతి పొంది ఉచితంగా ఇసుకను తరలించుకోవచ్చని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నల్లజర్ల మండలంలో ఇసుక ర్యాంపు వున్న గ్రామాల్లో కొంత మంది ట్రాక్టర్ నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి వారి వాహనాల్లోనే ఇసుక తీసుకెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ర్యాంపు మార్గాన్ని తామే అభివృద్ధి చేశామని, అందుకు ఖర్చులయ్యాయని అందువల్ల తామే ఇసుక రవాణా చేస్తామని చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆవపాడుకు చెందిన అచ్యుతసీతారామయ్య మూడు ట్రాక్టర్ల ఇసుక అవసరమై గ్రామ సచివాలయం వద్ద అనుమతి పొంది ట్రాక్టర్ తీసుకుని పోతవరం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు.
అక్కడ ఇతర వాహనాలకు అనుమతి లేదని, తామే ఇసుక రవాణా చేస్తామని కొంత మంది చెప్పడంతో తాను పొందిన అనుమతి పత్రాలు ఇచ్చాడు. నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇసుక ఇవ్వలేదు. పైపెచ్చు తన పేరుతో ఉన్న పత్రాలపై ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల నుంచి 6 వేలకు తమ ముందే నల్లజర్లలో విక్రయించినట్టు సీతారామయ్య ఆరోపిస్తున్నారు. రామచంద్రపురం నుంచి లక్ష్మణరావు సచివాలయం అనుమతి పొంది కవులూరు ర్యాంపు వద్దకు వెళ్లగా అక్కడ ఇసుక మాఫియా ఇతర గ్రామాల వాహనాలను ర్యాంపులోకి అనుమతి లేదని చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఇదేతంతు నబీపేట, పోతినీడుపాలెం, అనంతపల్లి గ్రామా ల్లో జరుగుతున్నట్లు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఎంపీడీవో వాణి వివరణ ఇస్తూ అన్ని గ్రామాల లబ్ధిదారులకు ఉచిత ఇసుక తీసుకునే హక్కు ఉందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
పరిమితికి మించి ఇసుక రవాణా
కుక్కునూరు మండలం బూరుగువాయిలో ప్రభుత్వం అధికా రికంగా ఇసుక ర్యాంపును ఏర్పాటుచేసింది. ఇక్కడ నుంచి పునరా వాస కాలనీలకు ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్‌కు అనుమతులు ఇచ్చింది. అయితే పునరావాస కాలనీ లకు ఇసుకను తరలించే క్రమంలో అక్రమాలు చోటు చేసుకుంటు న్న విషయం వెలుగుచూసింది. పరిమితికి మించి ఇసుకను అక్ర మంగా తరలిస్తుండటంతో పోలీసు తనిఖీల్లో విషయం బయట పడింది. కుక్కునూరు ఎస్‌ఐ పైడిబాబు తెలిపిన వివరాల మేరకు బూరుగువాయి ఇసుక ర్యాంపు నుంచి పలు ప్రాంతాల్లో నిర్మిస్తు న్న పునరావాస కాలనీలకు తగిన పరిమితిలోనే ఇసుకను లోడు చేసుకుని వెళ్లాల్సి ఉండగా 5 టన్నుల అధిక వ్యత్యాసంతో తరలి స్తున్నారు. ఏపీఎండీసీ తరపున పనిచేస్తున్న వ్యక్తిపై, ర్యాంపు నిర్వాహకుడు, ఇసుకను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి, లారీని సీజ్ చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.