భగ్గుమన్న భూ వివాదం

ABN , First Publish Date - 2020-12-10T06:24:30+05:30 IST

పశ్చిమ ఏజెన్సీలో మరోసారి భూ వివాదం భగ్గుమంది. గిరిజనులు, గిరిజనేతరులు దాడులు చేసుకున్నారు.

భగ్గుమన్న భూ వివాదం
పులిబోయిన అయ్యప్ప అనే గిరిజనేతరుడి భుజంలో దిగిన బాణం

 

ఇరువర్గాల దాడులు  

 గిరిజనేతరుడి భుజంలో దిగిన బాణం

ఆందోళనకారులతో డీఎస్పీ చర్చలు  

 పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు

బుట్టాయగూడెం, డిసెంబరు 9: పశ్చిమ ఏజెన్సీలో మరోసారి భూ వివాదం  భగ్గుమంది. గిరిజనులు, గిరిజనేతరులు దాడులు చేసుకున్నారు.    ఇరువర్గాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  కొవ్వాడ అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో బుట్టాయగూడెం మండలం రెడ్డిగూడెంకు చెందిన గిరిజనులకు, పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేటకు చెందిన గిరిజనేతరులకు  గొడవలు జరుగుతున్నాయి.  గిరిజనులు తమకు న్యాయం చేయాలంటూ కేఆర్‌ పురం ఐటీడీఏ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వగా ఇరువర్గాలతో చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాకపోవడంతో  మరోమారు చర్చలు జరుపుతామని వివాదాస్పద భూముల్లోకి ఎవరూ వెళ్ళవద్దని  చెప్పారు. అయితే ఎల్‌ఎన్‌డి పేటకు చెందిన కొందరు తమ  భూముల్లో  పత్తి  సాగు చేశారు. సమీప  భూముల్లో కొండ దేవతకు పూజలు చేయడం కోసం మంగళవారం రెడ్డిగూడెంకు చెందిన గిరిజనులు భూమిని బాగుచేయడంతో తమ భూముల్లోకి ఎలా వస్తారంటూ గిరిజనేతరులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. గిరిజనులకు గాయాలవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 బుధవారం మరోసారి ఇరువర్గాల వారు  కర్రలు, రాళ్ళు, బాణాలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఎల్‌ఎన్‌డీ పేటకు చెందిన పులిబోయిన అయ్యప్ప అనే యువకుడికి గిరిజనులు వేసిన బాణం భుజంలో దిగింది.  బరకాలకు నిప్పు పెట్టడంతో వాహనం ఒకటి దగ్ధమైంది. బాణం గుచ్చుకున్న అయ్యప్పతో పాటు మరో నలుగురిని ఎల్‌ఎన్‌డి పేట పీహెచ్‌సీకి తరలించగా మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం  ఏరియా ఆసుపత్రికి తరలించారు.  గాయపడిన  ఆరుగురు గిరిజనులను బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. పోలవరం డీఎస్పీ లలితాకుమారి,  సీఐ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో ఐటీడీఏ అధికారుల సమక్షంలో చర్చలు జరిపి సమస్య  పరిష్కరిస్తామని, అప్పటి వరకు శాంతంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి  గొడవ జరగకుండా ఉండేందుకు గ్రామాల్లో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-12-10T06:24:30+05:30 IST