కొబ్బరికి గడ్డుకాలం

ABN , First Publish Date - 2020-03-24T11:40:06+05:30 IST

ఉద్యాన పంటలపై కరోనా ప్రభావం పడింది. జిల్లాలోని రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే కొబ్బరి, అరటి ఎగుమతులు మూడు రోజులుగా

కొబ్బరికి గడ్డుకాలం

అరటి రైతుకు తీరని నష్టం

ఎగుమతులు లేక తోటల్లోనే పంటలు


పాలకొల్లు, మార్చి 23: ఉద్యాన పంటలపై కరోనా ప్రభావం పడింది. జిల్లాలోని రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే కొబ్బరి, అరటి ఎగుమతులు మూడు రోజులుగా నిలిచి పోవడంతో ఒక వైపు రైతులు, మరోవైపు వర్తకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 24,200 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. రానున్న 10-15 రోజులలో కొబ్బరి ఎగుమతి చేసే అవకాశం లేనందున వర్తకులు కొనుగోళ్లు విరమించారు. ఇప్పటికే వర్తకుల వద్ద ఉన్న పచ్చికొబ్బరి నిల్వలు పాడవుతాయని చెబుతున్నారు. మొత్తంగా పెరిగిన ధరలు రైతుకు తృప్తిని మిగల్చలేదు. జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీలు కొబ్బరి ఎగుమతి అవుతుంది. ఇప్పుడు కరోనా కారణంగా ట్రాన్స్‌పోర్ట్‌ నిలిచిపోయింది. 


తోటల్లోనే అరటి గెలలు

జిల్లాలో సుమారు 12 వేల హెక్టార్లలో అరటి సాగవుతుంది. గత ఏడాది అక్టోబరు నుంచి అరటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యయం రాని కారణంగా రైతులు అరటి గెలలను తోటల్లోనే వదలి వేశారు. మహా శివరాత్రి నుంచి ధరలు పెరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌ పుంజుకుంటున్నది. ఒరిస్సా, కలకత్తాలకు ఎగుమతి అయ్యే కర్పూర, కూర అరటి రకాలు టన్ను రూ.లక్ష ధర పలికేది. కరోనా వైరస్‌ ఇబ్బందులు మొదలైన అనం తరం టన్ను ధర రూ.60 వేలకు పడిపోయింది. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు మెట్టలోనూ అరటి సాగు చేస్తున్నారు.


ఇక్కడ అధిక శాతం కర్పూర రకం పండిస్తారు. ఇటీవల కూర అరటికి డిమాండ్‌ ఉండడంతో సాగు విస్తీర్ణం పెంచారు. తెల్ల చక్కెరకేళి, అమృతపాణి రకాలు స్థానికంగానే అధికంగా విని యోగిస్తారు. గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎదుర్కొన్న పరిస్థితి మరలా ఇప్పుడు వస్తుందని ఎకరానికి రూ.లక్షపైగా నష్టపోతామని అరటి సాగుచేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Read more