ఎంసెట్ అయ్యేనా..?
ABN , First Publish Date - 2020-07-08T11:25:55+05:30 IST
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అందరూ పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్ష

ఈ నెల 27 నుంచి పరీక్షలు..
17 వేల మందిపైగా దరఖాస్తు
నాలుగు నెలలుగా విద్యార్థుల ప్రిపరేషన్
కరోనా ఉధృతి నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు
భీమవరం ఎడ్యుకేషన్, జూలై 7 : కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అందరూ పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చినప్పటికీ సప్లిమెంటరీని రద్దు చేసింది. ఉన్నత విద్యలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై తర్జన భర్జన నడుస్తోంది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరని కేంద్రం ప్రకటించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఇంజ నీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్ - 2020)పై పడింది. ఈ నెల 27వ తేదీ నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.
జిల్లా నుంచి సుమారు 17 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకుని పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తూ రోజూ వందలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంటర్ పరీక్షలు ముగిసినప్పటి నుంచి ఇంజ నీరింగ్, అగ్రికల్చర్లో ఉన్నత విద్యే ధ్యేయంగా విద్యార్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కోచిం గ్లు తీసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఎంసెట్ జరుగుతుందా ? వాయిదా పడుతుందా? లేక ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరగు తుందా? అనే అంశాలపై ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకు లు, విద్యార్థుల మధ్య చర్చ జరుగుతోంది.
పరీక్ష నిర్వహిస్తే వైరస్ కారణంగా రెడ్జోన్లలో వున్న విద్యార్ధులు బయటకు వచ్చి రాయడం ఎలా అన్నది సందేహాలు నెలకొన్నాయి. జిల్లా లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసి ఆ ప్రాంతవాసులను బయటకురాకుండా చేస్తున్నారు. వచ్చే 20 రోజుల్లో ఇంకెన్ని కేసులు పెరిగి.. మరెన్ని కంటైన్మెంట్ జోన్లు ఏర్పడతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నా రు. ఎంసెట్ జరిగి ప్రవేశాలు ఎప్పుడు మొదలవుతాయోనని ఇంజనీరింగ్ కళాశాలలు ఎదురుచూస్తున్నాయి.
జిల్లాలోని 17 ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు 7,045, మేనేజ్మెంట్ సీట్లు 3,347 మొత్తం 10,392 సీట్లు భర్తీ కావాలి. ఎం సెట్ ద్వారా ఎంత మంది విద్యార్ధులు ఈ ఏడాది వస్తారన్న అంశంపై యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటా 7,045 సీట్లుగాను 5,180 సీట్లు మాత్ర మే భర్తీ అయ్యాయి. రెండు వేల సీట్లకుపైగా మిగిలిపోయా యి. ఈసారి ఏమవుతుందో వేచి చూడాలి.