ఈ తప్పెవరిది? ప్రభుత్వానిదా? అధికారులదా ?

ABN , First Publish Date - 2020-12-11T05:33:44+05:30 IST

నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏలూరు నలుదిక్కులా చిన్నపాటి పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి పెరుగుతుందని అందరూ ఆశిస్తుండగానే ఇలాంటి పెనుముప్పు ఏర్పడటం తాజా పరిణామాలకు అడ్డంకిగానే భావిస్తున్నారు.

ఈ తప్పెవరిది? ప్రభుత్వానిదా? అధికారులదా ?
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

తప్పెవరిది..?

జల నిర్వహణలో విఫలం

నీటి శుద్ధిపై అధికారుల నిర్లక్ష్యం

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

ఏలూరులో వింత వ్యాధికి దారి తీసింది

నమూనాలను సేకరించిన వైద్య నిపుణులు

భారలోహం, రసాయనాల ప్రభావమే

స్థానిక వైద్యులదీ ఇదే అభిప్రాయం

నేడు వెల్లడి కానున్న నివేదికలు 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) : ఏలూరులో తాగునీరు కలుషితమై లోహాలమయం కావడం వెనుక వైఫల్యం ఎవరిది ? ప్రభుత్వానిదా ? నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులదా ? అన్నిటికంటే మించి నగరవాసుల్లో క్రమశిక్షణ తప్పడమా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినోటా వినిపిస్తున్నాయి. 


నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏలూరు నలుదిక్కులా చిన్నపాటి పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి పెరుగుతుందని అందరూ ఆశిస్తుండగానే ఇలాంటి పెనుముప్పు ఏర్పడటం తాజా పరిణామాలకు అడ్డంకిగానే భావిస్తున్నారు. పంపుల చెరువు సహా 26 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతూంటే ఎప్పటికప్పుడు శాంపిల్స్‌ సేకరించి పరీక్షల్లో లోపాలు నిర్ధారించాల్సింది పోయి కొన్ని సార్లు కొన్నిచోట్ల మాత్రమే పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న తప్పిదాలు, ఈ ప్రభుత్వ హయాంలోనూ మరింత ప్రభలడం నగర వాసులకు శాపంగా మారింది. పంపుల చెరువు సమీపాన నీటిని శుద్ధి చేసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. ఆ సమయంలో నీటిపై నాచు పైకి తేలుతూ కనిపించింది. దీనిపై ఆయన మున్సిపల్‌ అధికారులపై మండిపడ్డారు. అంతేకాదు.. చాలా చోట్ల డ్రైనేజీల్లో వున్న తాగునీటి కుళాయిలు, వాటిచుట్టూ కుప్పల తెప్పలుగా వ్యర్థ పదార్థాలు కనిపించాయి. వీటిని నిరోధించాల్సిన మున్సిపల్‌ కార్పొరేషన్‌, పారిశుధ్య విభాగం చూసీ చూడనట్టు వదిలేశారు. మరోవైపు కృష్ణా, గోదావరి, కాలువల్లో మరమ్మతులు లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం, చెత్తా చెదారం, మృతదేహాలు, పశువుల మృత కళేబరాలన్నీ ఈ కాలువలోనే ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేదు. ఫలితంగా నీరు కలుషితం కావడం లోహాలు శరీరంలోకి ప్రవేశించడంతో మూర్చతో సహా అనేక విపరీత వ్యాధులకు గురై ప్రజలు ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు ‘‘నీరు పుష్కలంగా లభించే ఏలూరులో ఇలాంటి పరిస్ధితుల దాపరించడం అత్యంత హేయం. దారుణం, కాపాడాల్సిన నేతలే పట్టించుకోకపోవడమే కారణం. కీలకంగా వ్యవహరించాల్సిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ తాజా వింత రోగాలకు కారణం కాదా ? ప్రజలు తాగునీటి వనరుల్లో చెత్తా చెదారా లను విసిరేయడం దుర్మార్గం కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా నిర్లక్ష్యం వహించినా యంత్రాంగాన్ని నిలువరించాల్సిన జిల్లా అధికారుల పాత్ర దారుణమేనని విద్యాధికులు అభిప్రాయపడుతున్నారు. వింత వ్యాధి కమ్మేసిన సమయంలోనూ రోడ్లపై చెత్తా చెదారం పందులను ఎందుకు కట్టడి చేయలేకపోయారనే ప్రశ్నలు ఉన్నాయి. 


ఇదీ ఓ కారణమే..!

ఏలూరు నగరానికి రెండు దిక్కులా వున్న కృష్ణా, గోదావరి కెనాల్‌లు పూడుకు పోవడం, విషకారకాలు ఈ రెండు కాల్వల ద్వారా ఏలూరు నగరాన్ని చేరడం, నగరం మధ్య నుంచి రెండు వైపులా ప్రవహించే తమ్మిలేరులో డ్రైనేజీ నీరు కలవడం వంటి పరిణామాల వల్లే వింత వ్యాధి చోటు చేసుకున్నట్టు అంచనాకు వస్తున్నారు. డ్రెయిన్ల నుంచి తాగునీటి వనరుల్లో ఆర్గాన్‌ క్లోరిన్‌ అనే విష పదార్థం మిళితం కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, దీనిని కట్టడి చేయాల్సిన శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోకపోవడం, ఏమౌతుందిలే అన్న తేలిక స్వభావం ఇంత ముప్పు తెచ్చింది. కేవలం దక్షిణపు వీధితోనే సరిపెట్టకుండా కొత్తపేట, పవర్‌పేట, పత్తేబాద, అశోక్‌ నగర్‌, ఏలూరు శివారు గ్రామాలను ఈ వింత వ్యాధి వణికించింది. వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసింది. 


తుది నివేదికలపై ఉత్కంఠ

ఏలూరులో వింత వ్యాధిపై వైద్య, నిపుణులు శుక్రవారం ప్రభుత్వానికి నివేదికలను సమర్పించనున్నారు. ప్రఖ్యాత ఎయిమ్స్‌ వైద్యుల దగ్గర నుంచి ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) తమ నివేదికల్లో నీటి కాలుష్యాన్ని, రసాయనాలు, లోహాల ప్రభావితాన్ని ప్రస్థావించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికల్లో సారాంశం ఏమిటనే దానిపై నగర వాసుల్లో ఉత్కంఠ పెరిగింది.  


Updated Date - 2020-12-11T05:33:44+05:30 IST