ఊరట ఫార్ములా !

ABN , First Publish Date - 2020-05-18T10:59:14+05:30 IST

వివాదాలమయంగా మారిన డీఎస్సీ -2008 రిక్రూట్‌మెంట్‌లో జిల్లాలో నష్టపోయిన 364 మంది బీఎడ్‌

ఊరట ఫార్ములా !

డీఎస్సీ -2008 ఎంపిక విధానంలో  తప్పిదాన్ని సరిచేసేందుకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాలు 

భర్తీకాని ఖాళీల కోసం తదుపరి మెరిట్‌ అభ్యర్థుల వేడుకోలు


ఏలూరు, ఎడ్యుకేషన్‌, మే 17: వివాదాలమయంగా మారిన డీఎస్సీ -2008 రిక్రూట్‌మెంట్‌లో జిల్లాలో నష్టపోయిన 364 మంది బీఎడ్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని, అప్పటి నియామక విధానంలో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు డీఎడ్‌ అర్హతలతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు  పొందిన కొందరిని తొలగించాల్సి రావొచ్చని సమాచారం. ఇలా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా డీఎడ్‌ అభ్యర్థులు సుమారు 165 మంది ఉంటారని తెలుస్తోంది. అప్పట్లో కామన్‌ మెరిట్‌ లిస్టు ప్రకారం ఎంపిక విధానాన్ని చేపట్టకుండా జిల్లా విద్యాశాఖ సొంత పెత్తనంతో పాటించిన ఎంపిక విధానం వల్లే తమకు అర్హ తలు ఉండీ, ఉద్యోగ ఎంపికల్లో నష్టపోయామని పలువురు బీఎడ్‌ అభ్యర్థులు పుష్కరకాలంగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు.


వీరి వాదన న్యాయ సమ్మత మేనని విద్యాశాఖ ఎట్టకేలకు గుర్తించింది. అయితే సంబంధిత పోస్టుల్లో ఎంపికై ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న సుమారు 165 మంది డీఎడ్‌ అభ్యర్థులను తొలగించడం ద్వారా వచ్చే న్యాయపరమైన వివాదాలను దృష్టిలో ఉంచుకుని మఽధ్యేమార్గంగా నష్టపోయిన బీఎడ్‌ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. 


గరిష్టంగా 150 మందికే అవకాశం.. 

నష్టపోయిన 364 మంది బీఎడ్‌ అభ్యర్థుల్లో వందమంది తదుపరి డీఎస్సీ నియామకాల్లో ఉపాధ్యాయ ఉద్యో గాలు పొందారని విద్యాశాఖ గుర్తించింది. మరికొందరు ఇతర ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో ఉన్నట్టుగా భావిస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఎస్జీటీలుగా ఉద్యోగాలు పొందేందుకు అంగీకారం తెలిపే బీఎడ్‌ అభ్యర్థులు గరిష్టంగా 150 మందికి మించి ఉండక పోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపఽథ్యంలో భర్తీ కాకుండా బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే కాంట్రాక్టు ఎస్జీటీ పోస్టులను డీఎస్సీ -2008 రిక్రూట్‌మెంట్‌ కామన్‌ మెరిట్‌ జాబితాలోని తదు పరి అభ్యర్థులకు ఇవ్వాలన్న అభ్యర్థనలు జిల్లా విద్యాశాఖకు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వమే  తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  

Updated Date - 2020-05-18T10:59:14+05:30 IST