ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దు

ABN , First Publish Date - 2020-05-09T08:17:50+05:30 IST

నూతన విద్యా సంవత్సరం 2020-21లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచవద్దని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 8 : నూతన విద్యా సంవత్సరం 2020-21లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచవద్దని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీటి అమలు బాధ్యత ఆర్జేడీ, డీఈవోలదేనని స్పష్టం చేసింది. వేసవి సెలవులు, కరోనా తీవ్రత తగ్గిన అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులంతా ‘ఆల్‌ పాస్‌’గానే పరిగణించారు.


ఇక ఈ ఏడాది కొత్తగా తదుపరి తరగతుల్లోకి ప్రవేశించే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులపై తల్లిదండ్రులకు ప్రస్తుత లాక్‌డౌన్‌ దృష్ట్యా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది (19-20)లో నిర్ణయించిన, వసూలు చేసిన ఫీజులనే నూతన విద్యా సంవత్సరంలోని ఆయా తరగతులకు తీసుకోవాలని, పెంపుదల ఉండరాదని స్పష్టం చేసింది. వీటిని ధిక్కరించే ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు రద్దుతోపాటు ఇతర బోర్డుల అఫిలియేషన్‌ పొందేందుకు ఇచ్చిన నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌వోసీ)లను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించింది. 

Updated Date - 2020-05-09T08:17:50+05:30 IST