దీపావళి వెల వెల

ABN , First Publish Date - 2020-11-14T04:53:00+05:30 IST

కరోనా ప్రభావంతో అన్ని పండుగలు కళ తప్పాయి. వెలుగుల దీపావళి సైతం వెలవెలబోయింది.

దీపావళి వెల వెల
ఆచంట మండలంలో వెలవెలబోతున్న బాణసంచా దుకాణాలు

మందకొడిగా బాణసంచా విక్రయాలు

రెండు గంటల నిబంధనతో నిరాశ


ఆచంట/వీరవాసరం, నవంబరు 13: కరోనా ప్రభావంతో అన్ని పండుగలు కళ తప్పాయి. వెలుగుల దీపావళి సైతం వెలవెలబోయింది. చిన్నారుల నుంచి పెద్దవారు సైతం బాణసంచా కాల్పులపై మక్కువ చూపుతారు. గ్రామాల్లో దీపావళి రోజు సాయంత్రం తిప్పే కుమ్మటం పొట్లాలకు పది రోజులకు ముందే కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకునేవారు. దీనితో గ్రామాల్లో పదిరోజులు ముందుగానే దీపావళి సందడి కనిపించేది. ప్రస్తుతం ఎక్కడా సందడి లేదు. ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు కూడా పండుగ చేసుకోవడానికి భయపడుతున్నారు. బాణసంచా దుకాణాల్లో అమ్మకాలు లేక వ్యాపారులు కుదేలయ్యారు. దీపావళి పండుగ ఒక్కరోజు విక్రయాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆచంట, వల్లూరులో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోయాయి. రెండు రోజుల నుంచి ఆచంట కచేరి సెంటర్‌లో వివిధ రకాల ప్రమిదలు విక్రయిస్తున్నారు. ఓ పక్క వాతావరణం కూడా మబ్బులు మేఘాలతో ఉండటంతో దీపావళి సందడి మరింత లేకుండాపోయింది.


ఒక్కరోజు దీపావళి

దీపావళికి మూడు రోజుల ముందే బాణాసంచా మోత మోగుతుంది. దుకాణాలు, వారం రోజుల నుంచి మతాబులు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు, తాటాకు టపాకాయలు, తారాజువ్వలు తయారీతో గ్రామాల్లో సందడే. కరోనా భయం, నిబంధనలు, వాతావరణం ప్రభావంతో దీపావళి ఒక్క రోజు పండుగే అయ్యింది. బాణాసంచా దుకాణాల్లో విక్రయాలు మందకొడిగా ఉన్నాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

Updated Date - 2020-11-14T04:53:00+05:30 IST