కొవిడ్‌ ఫలితాల వెల్లడిలో జాప్యం

ABN , First Publish Date - 2020-07-10T11:12:46+05:30 IST

కొవిడ్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులకు..

కొవిడ్‌ ఫలితాల వెల్లడిలో జాప్యం

వారం రోజులైనా రాని రిపోర్టులు

అప్పటి వరకూ క్వారంటైన్‌లో ఉంచని అధికారులు 

ఇళ్లకు పంపేస్తున్న వైనం.. మరింత మందికి వైరస్‌ సోకే ప్రమాదం


ఏలూరు రూరల్‌, జూలై 9 : కొవిడ్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలకు చేసిన తర్వాత రిపోర్టులు రాకముందే ఇళ్లకు పంపేయడం వల్ల మరికొంత మంది కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏలూరు, మండలంలో అనుమానితులకు, కంటైన్మెంట్‌ జోన్‌లో పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టులు వచ్చినప్పటికీ వెంటనే ప్రకటించడం లేదు. జిల్లా కేంద్రానికి సమాచారం పంపి అక్కడ నుంచి అధికారికంగా ప్రకటించే వరకు ఇక్కడ ఏమీ చెప్పడం లేదు. స్థానిక పీహెచ్‌సీ మెడికల్‌ అధికారులకు కూడా చెప్పడం లేదు. జిల్లాలో కొవిడ్‌ ల్యాబ్‌ అందుబాటు లోకి వచ్చింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి ముక్కు ద్వారా శ్వాబ్‌ తీసి ట్రూనాట్‌ మిషన్‌లో బేటాకో పరీక్ష చేసేవారు. ప్రాథమికంగా పాజిటివ్‌ అని తేలితే సదరు వ్యక్తిని కొవిడ్‌ సెంటర్‌కు తరలించి నిర్ధారణ పరీక్ష చేసేవారు. అయితే రిపోర్టులు రోజుల తరబడి రావడం లేదు. ఏలూరు, చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్టు అయిన వారిని కొవిడ్‌ పరీక్షల నిమిత్తం కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ట్రూనాట్‌ మిషన్‌ ద్వారా వారందరికీ పరీక్షలు చేసి అదే రోజు రిపోర్టు ఇవ్వడం సాధ్యం కావడం లేదు.


ఒక మిషన్‌ మీద గంటకు రెండు నమూనాలు మాత్రమే పరీక్ష చేయడానికి వీలుంటుంది. దీంతో కొవిడ్‌ ఫలితాలు కొంతమందికి మొదటి రోజులోనే వస్తుంటే మరికొంత మందికి మరుసటి రోజు వస్తున్నాయి. ల్యాబ్‌కు వస్తున్నవారి నుంచి శ్వాబ్‌ సేకరించి ఇళ్లకు వెళ్లిపోమంటు న్నారు. తర్వాత పాజిటివ్‌ రిపోర్టు వస్తే వెంటనే సంబంధిత మెడికల్‌ అధికారికి కాని వైద్య సిబ్బందికి గాని సమాచారం ఇవ్వడం లేదు. జిల్లా వైద్యాధికారులకు మాత్రమే మెయిల్‌ పెడుతున్నారు. అక్కడ ప్రకటించే సరికి నాలుగు రోజుల నుంచి ఆరు రోజులు పడుతోంది. ఈ లోగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి విషయం తెలియక యథా విధిగా జనం మధ్య తిరిగేస్తున్నాడు. దీంతో పలువురు వైరస్‌ బారిన పడుతున్నారు. అంతేకాక పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఎవరెవరిని కలిశాడో గుర్తించడం కష్టంగా మారింది. కొవిడ్‌ పరీక్షా ఫలితాలు వచ్చే వరకు శ్వాబ్‌ తీసిన వారిని క్వారెంటైన్‌ కేంద్రంలో ఉంచాలని పలువురు సూచిస్తున్నారు.   

Updated Date - 2020-07-10T11:12:46+05:30 IST