చివరికి మునిగింది
ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST
సార్వా ఆరంభం నుంచి రైతులను వర్షం ముంచుతోంది.

వర్షం, ఈదురుగాలులతో నేలనంటిన వరి చేలు
స్తంభించిన జనజీవనం
రహదారులు జలమయం
భీమవరం / టౌన్ / రూరల్, వీరవాసరం, కాళ్ళ, పాలకోడేరు, ఆచంట, నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, పాలకొల్లు రూరల్, యలమంచిలి
సార్వా ఆరంభం నుంచి రైతులను వర్షం ముంచుతోంది. నారు, నాట్లు రెండు పర్యాయాలు వేయాల్సి వచ్చింది. డెల్టాలో ముందు వెనుకలుగా సాగు చేశారు. చాలా వరకు పంట కోత దశలో ఉన్న తరుణంలో నివర్ తుఫాన్ రైతు వెను విరిచేసింది. ఒడిదుడుకులు తట్టుకుని కనీసం పెట్టుబడుల కోసం మాసూళ్లకు సన్నద్ధమవుతున్న తరుణంలో పెట్టుబడులతో పాటు మాసూళ్ల ఖర్చు కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వర్షం, ఈదురు గాలులతో కోతకొచ్చిన చేలు నేలనంటాయి. వరి గింజలు నీటిలో నానుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది.
మొగల్తూరు మండలంలో చేలన్నీ నీట మునిగాయి. రెండు రోజులుగా కోతలతో పనలపై ఉన్న వరి నీట మునిగిం ది. ధాన్యం గింజలు రాలిపోయాయి. మండలంలో సుమారు 1,200 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. తీర గ్రామాల్లో గోతులు, గొప్పుల రహదారులు నీట మునగడం ప్రమాదకరంగా పరిణమించింది. ఆచంట మండలంలో పలుకాలనీలు జలమయం అయ్యాయి. దాళ్వా మాసూళ్లు ఊపందుకుంటున్న తరుణంలో తుఫాన్ రైతులను కన్నీరు పెట్టించింది. రోడ్డుపై ధాన్యం రాశులు, బస్తాలు తడిచిపోయాయి. పెనుగొండ మండలం లో వరిచేలు నేలవాలడంతో రైతులు కుదేలయ్యారు. వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఈదురు గాలులు, వర్షాలకు పాలకోడేరు మండలంలో వరి చేలు పూర్తిగా నేలనంటాయి. వర్షాలకు ముందు కోసిన ధన్యాం గట్లు మీదే బరకాలు కప్పి ఉన్నాయి. మండలంలో 13,500 ఎకరాలకు 2వేల ఎకరాలలో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట ప్రస్తుత వర్షాలకు నీటిలో నానుతోంది. కాళ్ళ మండలంలో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు, వరి, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పల్లపు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వరి పంట నేలమట్టమైంది.

పాలకొల్లు మండలంలో 1765 హెక్టార్లలో వరి చేలు నివర్ తుఫాన్ బారిన పడ్డాయి. కోతకు వచ్చిన చేలు నీట మునగడంతో రైతులు పంట దక్కదని ఆందోళన చెందుతున్నారు. ఆది నుంచీ సార్వా సాగు నీటి గండాన్ని ఎదుర్కొంటూనే ఉంది. పంట చేతికి వచ్చే సమయానికి ఎండు తెగులుతో దిగుబడి తగ్గడంతో పాటు నివర్ తుఫాన్ రైతులను కోలుకోలేనివిధంగా నీట ముంచిందని పలువురు రైతులు వాపోతున్నారు. యలమంచిలి మండలంలో చాలాచోట్ల చేలు నేలకొరిగాయి. కనీస పెట్టుబడులు దక్కని పరిస్థితి ఉందని అన్నదాతలు వాపోతున్నారు. మండలంలోని ఏనుగువానిలంక, యలమంచిలి పల్లెపాలెంకాలనీ రహదా రులపై వర్షపు నీరు నిలిచింది.

భీమవరం మండలంలో 11వేల ఎకరాల్లో పంట నేలవాలిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు గురువారం కురిసిన వర్షాలకు పట్టణంతో పాటు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము నుంచి కురిసిన వర్షంతో రహదారులు కాలువలను తలపించాయి. భీమవరం పట్టణంలో జనజీవనం స్తంభించింది. బస్టాండ్‌లో ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. వీరవాసరం మండలంలో మాసూలు చేసిన ధాన్యం తడిసిపోయింది. మరోవైపు కోతకు వచ్చిన చేలు నేలవాలాయి. వర్షం ప్రభావంతో రహదారులు, కాలువలను, పల్లపు ప్రాంత వీధులు నీటమునిగాయి.

పెనుమంట్ర మండలంలో వరి చేలు నేలవాలాయి. ధాన్యం కుప్పలు తడిసి ముద్దయయ్యాయి. పొలమూరు, కొయ్యేటిపాడు, పెనుమంట్ర, నత్తారామేశ్వరం నెగ్గిపూడి పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది.

నరసాపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భూపతివారి వీధి, స్టీమర్‌రోడ్, రైల్వేస్టేషన్, మిషన్‌హైస్కూల్, ఎన్టీఅర్‌కాలనీ, చలవపేట, పొన్నపల్లి తదితర ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. వానతో పాటు ఈదర గాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితయ్యారు. మండలంలోని దర్భ రేవు, సరిపల్లి, లిఖితపూడి, ఎల్‌బిచర్ల, చిట్టవరం వరి చేలు నీట మునిగాయి. సుమారు 1500 హెక్టార్లుల్లో వరి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
