అలజడి

ABN , First Publish Date - 2020-11-26T05:12:31+05:30 IST

తీరంలో తుఫాన్‌ అలజడి రేపుతోంది. బుధవారం ఒక్కసారిగా వాతావారణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

అలజడి
తీరంలో ఎగసిపడుతున్న అలలు

తీరంలో ఎగసి పడుతున్న అలలు

గాలులకు నేలవాలిన చేలు 

హడావుడిగా మాసూళ్లు


నరసాపురం, నవంబరు 25: తీరంలో తుఫాన్‌ అలజడి రేపుతోంది. బుధవారం ఒక్కసారిగా వాతావారణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చలిగాలులు, ఆకాశం మేఘావృతమైంది. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. సాయంత్రం నుంచి కడలి హోరు పెరిగింది. తుఫాన్‌ తీర గ్రామాల్లో బీభత్సం సృష్టింస్తోందోమోనని భయం నెలకొంది. తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రభావం సముద్ర తీర ప్రాంతంపై ఎక్కువగా ఉంది. వేటకు వెళ్లిన బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా ఉన్నాయా అని ఆధికారులు ఆరా తీస్తున్నారు. అంతర్వేది లైట్‌ హౌస్‌ నుంచి ప్రమాద హెచ్చరికను బోట్లకు చేరవేశారు. దీంతో చాల బోట్లు పట్టణంలోని లాకుల వద్దకు చేరుకున్నాయి. అలల ఉధృతికి చినలంక, పీఎంలంక, పేరుపాలెం వద్ద గట్టు కోతకు గురి అవుతున్నాయి.


రైతుల్లో అందోళన నెలకొంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సార్వా సాగు ఆలస్యమైంది. సార్వా ఆరంభం నుంచి వర్షాలు, వరదలతో నష్టపోయారు. ఆగస్టు, సెప్టెంబరులో మరోసారి నాట్లు వేశారు. చాలా చోట్ల పంట చివరి దశలో ఉంది. భారీ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నీటి పాలవుతుందని రైతులు భయపడుతున్నారు.


పెరిగిన చలిగాలులు..

గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రత పడిపోయింది. బుధవారం తీర ప్రాంతంలో 18 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీలు నమోదైంది. మంగళ వారం రాత్రి కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత గ్రామాల్లో నివసించే ప్రజలు తుఫాన్‌ తీరం దాటే వరకు ఇళ్లలోనే ఉండాలంటూ ప్రచారం చేస్తున్నారు. వేట పడవల న్నింటిని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు.


పంట మాసూళ్లకు రైతుల పరుగులు


భీమవరం రూరల్‌, నవంబరు 25 :  తుఫాన్‌ గాలులతో వరి చేలను నేలవాలాయి. వాతావరణం మేఘావృతం కావడంతో పంట మాసూళ్లలో రైతులు పరుగులు తీశారు. భీమవరం మండలం గునుపూడి, కొవ్వాడ, నరశింహపురం ప్రాంతాలలో పంట మాసూళ్లు జరుగుతున్నాయి. ధాన్యాన్ని వాహనాలపై తరలించడం, యంత్రంతో వరి కోతలు చేశారు. వెనుకగా సాగు చేసిన చేలు గాలులకు నేలకు వాలాయి. వర్షం పడితే భారీ నష్టం, కష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు.


ఆచంట, నవంబరు 25 : ఆచంట మండలంలో గాలులులతో చిరుజల్లులతో రైతుల్లో ఆందోళన పెరిగింది. మండలంలో యంత్రాలు, కూలీలతో మాసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డుపై ధాన్యాన్ని రాశులు చేసి బరకాలు కప్పుతున్నారు. మండలంలో 11.500 ఎకరాలకు గాను సుమారు 25శాతం మాత్రమే మాసూలైంది. ఈ సమయంలో భారీ వర్షం పడితే రైతుకు భారీ నష్టమే.

Updated Date - 2020-11-26T05:12:31+05:30 IST