16లోగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-07T05:55:58+05:30 IST

టిడ్కో ఇళ్లు ఈ నెల 16వ తేదీలోగా కేటాయించకపోతే లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.

16లోగా టిడ్కో ఇళ్లు ఇవ్వాలి
పోణంగిలో టిడ్కో గృహాల వద్ద ఆందోళనలో రామకృష్ణ

లేకుంటే లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అల్టిమేటం 


ఏలూరు రూరల్‌, నవంబరు 6 : టిడ్కో ఇళ్లు ఈ నెల 16వ తేదీలోగా కేటాయించకపోతే లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌తో కలిసి పోణంగిలో నిర్మించిన టిడ్కో గృహాలను పరిశీలించిన రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. పేదలకు నివాస స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని రాష్ట్రంలో 60 వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందన్నారు. వాటిని కేటాయిస్తామంటూ తేదీలు ప్రకటించి వెంటనే వాయిదా వేస్తారని ఇలా ఎందుకు చేస్తారో అర్ధం కావడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పట్టణంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇవ్వకపోతే భూ ఆక్రమణలకు పాల్పడతామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా ఇసుక సమస్య నేటికీ పరిష్కారం కాలేదన్నారు.

Updated Date - 2020-11-07T05:55:58+05:30 IST