అంతుచిక్కని కరోనా

ABN , First Publish Date - 2020-05-24T09:47:40+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే వందల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అంతుచిక్కని కరోనా

పెరుగుతున్న కేసులు.. నిర్ధారణ కావాల్సినవి వందల్లోనే

తాజాగా మరో మూడు అనుమానిత కేసులు

జిల్లాలో నాలుగు రెడ్‌జోన్ల ఎత్తివేత

జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు కీలక ప్రకటన


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే వందల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు వెలువరించాల్సి ఉంది. ఒకానొకదశలో నాలుగు వంద లలోపే పెండింగ్‌లో ఉండగా వీటి సంఖ్య వేలకు చేరింది. ప్రతిరోజు చేసే పరీక్షల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితాల వెల్లడిలో మాత్రం జాప్యం తొంగి చూస్తోంది. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల నమోదు, పరీక్షలు పెండింగ్‌ల వంటి అంశాలన్నీ జిల్లాస్థాయి అధికారుల పరిధిలోనే ఉండిపోతున్నాయి. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలను బట్టి ఏరోజుకారోజు బులిటెన్‌ ప్రకటిస్తూ వచ్చారు.


ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏలూరు, పెనుగొండతో పాటు మిగతా కొత్త ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించినప్పుడు కొందరికి వైరస్‌ లక్షణాలు బయటపడినట్లు సమాచారం.అధికారికంగా నిర్ధారించకపోయినా ఇప్పటికే దాదాపు ఇంకా ఐదు కేసులు ధృవపడాల్సి ఉంది. పెనుగొండ నుంచి ఇద్దరు పిల్లలు, ఏలూరు నుంచి వైద్యారోగ్యశాఖకు చెందిన ఒక ఉద్యోగికి పాజిటివ్‌ లక్షణాలు బయట పడినా మరోమారు వీరికి సంబంధించి పరీక్షలు కొనసాగించబోతున్నారు. పెనుగొండ మం డలం చెరుకు వాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ కొందరికి వైద్య పరీక్షలు నిర్వ హించి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. అలాగే జిల్లాకు చేరు కుంటున్న వివిధ రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. వీరందరిని గుర్తించి పరీక్షలు నిర్వహించి అనుమానితులను క్వారంటైన్‌కు చేర్చేపనిలో ఉన్నారు. జిల్లాలో అధికారికంగా ప్రకటించిన కేసుల సంఖ్య 89 ఉండగా చికిత్స పొందుతున్న వారు 35 మంది ఉన్నారు.54 మంది డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లిపోయారు.


నాలుగు రెడ్‌జోన్ల ఎత్తివేత 

జిల్లాలో ఇప్పటికే పాజిటివ్‌ కేసులు గుర్తించిన చోట్ల వేచిచూసి కొత్త కేసులు ఏమీ నమోదు కాకపోతే నిబంధనల ప్రకారం రెడ్‌జోన్లను ఎత్తి వేస్తున్నారు. తాజాగా మరో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేస్తున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటించారు. భీమడోలు మండలం గుండుగొలను, పెనుగొండ, కొవ్వూరు అర్బన్‌ (5,14,18,19 వార్డులు), టి.నర్సాపురం మండలంలోని ఏపిగుంట రెడ్‌జోన్లను ఎత్తి వేసినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అలాగే కొత్తగా రెండు కంటైన్మెంట్‌ జోన్లు తెరిచారు. పెనుగొండ మండలం చెరుకువాడ, తణుకు అర్బన్‌లోని 12వ వార్డులో తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇక్కడ  రెడ్‌జోన్లు తెరిచారు. 

Updated Date - 2020-05-24T09:47:40+05:30 IST