పెళ్లికి సిద్ధం చేసేద్దాం..!

ABN , First Publish Date - 2020-05-11T10:06:40+05:30 IST

‘కరోనాతో ఇప్పటికే పెళ్లిని వాయిదా వేశాం..

పెళ్లికి సిద్ధం చేసేద్దాం..!

నెలాఖరుతో ముగుస్తున్న ముహూర్తాలు 

12, 13, 14, 15, 23, 24 తేదీల్లో భారీగా పెళ్లిళ్లు

కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినతరం

అనుమతులు కోరుతూ దరఖాస్తులు

నిబంధనల మేరకు జరిపించేందుకు సిద్ధం

మళ్లీ శ్రావణమాసం వరకూ ముహూర్తాల్లేవ్‌


ఏలూరు(పశ్చిమ గోదావరి): ‘కరోనాతో ఇప్పటికే పెళ్లిని వాయిదా వేశాం. ఇది ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. హంగు, ఆర్భాటాలతో చేసేకంటే మీ వైపో పది మంది, మా వైపో పది మందితో ఇంటి వద్దే సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేద్దాం. అన్నీ సద్దుమణిగిన తర్వాత ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేసుకోవచ్చు’ అంటూ పెద్దలు ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వందలాది జంటలను ఈ మాసంలో ఒక్కటి చేసేందుకు అధికారులకు దరఖాస్తులు చేస్తున్నారు. కరోనా వైరస్‌ ఉధృతి, లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి ముహూర్తాలు వాయిదా వేస్తున్నప్పటికీ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో నెలాఖరులోగా పెళ్లిళ్లు చేసేందుకు ముహూర్తాలు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే పురోహితులను సంప్రదిస్తున్నారు.


కొందరు అధికారికంగా పెళ్లికి అనుమతి తీసుకుంటుండగా మరికొందరు గ్రామ పెద్దలు, స్థానిక అధికారుల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా మార్చి నుంచి మే వరకూ మంచి శుభలగ్నాలు ఉంటాయి. ఈ సీజన్‌లో వేలాది పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. మూడు నెలల ముందు నుంచే కల్యాణ మండపాలు, పూల మండపాలు, క్యాటరింగ్‌, పురోహితులు, బ్యాండ్‌ మేళాలు, ఫొటో, కెమేరాలను ముందుగానే బుక్‌ చేసుకున్నారు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో కొద్ది రోజులే కదాని కొందరు ముహూర్తాలను వాయిదా వేసుకున్నారు.


ఇప్పటికే 50 రోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ముహూర్తాల గడువు మే నాటికి ముగియనున్నది. మళ్లీ శ్రావణ మాసం వస్తే గాని ముహూర్తాలు లేనందుకు ఈ నెలలోనే చేయాలని చాలా మంది నిర్ణయించుకున్నారు. ఈ నెలలో 12, 13, 14, 15, 23, 24 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంది. తక్కువ సంఖ్యలో అతిథులు, భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి పెళ్లిళ్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


మే 30 నుంచి జూన్‌ 8 వరకూ శుక్ర మౌఢ్యం కారణంగా పెళ్లిళ్లకు ఆస్కారం లేదు. ఆ తరువాత జులై 21 నుంచి ఆగస్టు 19 వరకూ శ్రావణమాసంలో ముహూర్తాలు ఉన్నాయి. 15 రోజులపాటు వరుసగా వివాహాలు జరగనున్నాయి. శ్రావణంలో ఆగస్టు 13న చివరి ముహూర్తం, ఆ తరువాత వచ్చే రోజుల్లో ముహూర్తాలు అంతగా లేకపోవడం వల్ల ఈ నెలలో వున్న బలమైన ముహూర్తాలను ఖరారు చేసుకుని వధూవరులకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కంటైన్మెంట్‌, రెడ్‌జోన్‌లలో వివాహాలు, వేడుకలు నిర్వహించేందుకు అనుమతులు లేవని కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. మిగతా ఏరియాల్లో 30 మందికంటే ఎక్కువ ఉండకూడదన్నారు.


అనుమతి తప్పనిసరి

‘లాక్‌డౌన్‌లో వివాహం చేసుకోదల్చిన వారు నిబంధనలను పాటించాలి. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలి. రెడ్‌జోన్‌లో వివాహాలకు అనుమతులు ఇవ్వం. వరుడు, వధువు ఒకే జిల్లా వారైతే తహసీల్దార్‌ అనుమతిస్తారు. ఇతర జిల్లాల వారైతే ఇరు జిల్లాల  కలెక్టర్ల అనుమతి అవసరం. అప్పుడే వివాహానికి అనుమతిస్తాం. అతి తక్కువ అతిథులతో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. వివాహ ఆహ్వాన పత్రికతో పాటు నిబంధనలు పాటిస్తామనే దరఖాస్తులను తహసీల్దార్లకు అందజేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’  అని ఏలూరు తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2020-05-11T10:06:40+05:30 IST