ఆఫీసుల్లో.. అటెన్షన్‌.. కబలిస్తున్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2020-08-01T21:23:32+05:30 IST

సర్కారు కార్యాలయాల్లో కరోనా క్రమేపీ విస్తరిస్తోంది. రోజు వారీ ప్రణాళికల లక్ష్యాలను దెబ్బతీస్తోంది. అనేకచోట్ల సందర్శకులపై ఆంక్షలు కొనసాగుతున్నా..

ఆఫీసుల్లో.. అటెన్షన్‌.. కబలిస్తున్న కరోనా మహమ్మారి

నిన్న ఆర్‌ఎంవో.. నేడు ఎంపీడీవో మృతి

భయపడుతున్న అధికార యంత్రాంగం

దెబ్బతింటున్న ప్రణాళికలు

సమీక్షల్లోనే ఒకింత వెసులుబాటు

జిల్లా కేంద్రానికే పూర్తిగా పరిమితం


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): సర్కారు కార్యాలయాల్లో కరోనా క్రమేపీ విస్తరిస్తోంది. రోజు వారీ ప్రణాళికల లక్ష్యాలను దెబ్బతీస్తోంది. అనేకచోట్ల సందర్శకులపై ఆంక్షలు కొనసాగుతున్నా.. వివిధ శాఖాధిపతులు కట్టడి చేస్తున్నా.. జిల్లా అధికారి నుంచి గ్రామ స్థాయిలో వీఏవోల వరకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ బారినపడ్డారు. గడిచిన నెల రోజులుగా అనేక విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్న జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవోను కరోనా బలి తీసు కుంటే.. నేడు ఎంపీడీవోను కబళించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని అనేక విభాగాల్లో కేసుల అలజడి పెరుగుతుంటే.. రోజు వారీ విధులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఐదు నెలలుగా కార్యాల యాల రూపు రేఖలే మారిపోయాయి.


అంతటా భయం.. భయం

జిల్లా ప్రధాన ప్రభుత్వ విభాగమైన కలెక్టరేట్‌ను కరోన వదిలి పెట్ట లేదు. నెల రోజుల కిందట ఆర్డీవో కార్యాలయంలో కొందరికి పాజిటివ్‌ సంక్రమించింది. మార్చి నుంచి ఇప్పటి వరకు అర డజను మంది జిల్లాస్థాయి అధికారులతో సహా పదుల సంఖ్యలోనే ఉద్యోగులకు వైరస్‌ సంక్రమించింది. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వరుసగా 14 మందికి వైరస్‌ సోకడంతో ఉద్యోగుల హాజరును నియంత్రించి, పాలనా వ్యవహారాలు చక్కబెట్టేందుకు చాలాకాలమే పట్టింది. గ్రామస్థాయిలో కీల కమైన వీఆర్‌ఏలు, వీఆర్‌వోలు పెద్ద సంఖ్యలోనే దీని బారినపడి కొవిడ్‌ ఆసుపత్రుల పాలయ్యారు. వాస్తవానికి ఇళ్ల పట్టాల వ్యవహారం ముం దుకు వచ్చిన తరువాత నెలన్నర సమయంలో అత్యధికులు, ప్రభుత్వ శా ఖల ఉద్యోగులు వైరస్‌ బారినపడ్డారు. తద్వారా వారి కుటుంబీకులకు సం క్రమించింది. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వారిని వైరస్‌ వదిలి పెట్టలేదు. నిత్యం ప్రజల మధ్య ఉండే వలంటీర్లు కేర్‌ సెంటర్లకు చేరాల్సి వచ్చింది.


వైరస్‌ ఉధృతికి ప్రభుత్వ శాఖలన్నీ దాదాపు రూపు కోల్పోయా యి. ఉద్యోగుల సంఖ్య దాదాపు పరిమితమైంది. సందర్శకుల రాకపోకలు లేవు. వైరస్‌ కారణంగా సందర్శకుల అనుమతికి కొన్నిచోట్ల నిషేధం పాటించ డంతో ఈ సంఖ్య గణనీయంగా పడిపో యింది.పోస్టాఫీసులు, చిన్నచిన్న కార్యాలయాలన్నీ మూతబడ్డాయి. పోలీసు విభాగంలో ఎన్నడూ లేని విధంగా డీఐజీ స్థాయి అధికారి కార్యాలయం నుంచి కింద స్థాయి పోలీస్‌స్టేషన్‌ వరకు డజన్ల సంఖ్యలోనే పోలీసులు వైరస్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరిలో కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతోపాటు మరికొంత హోదా ఉన్న వారంతా ఐసొలేషన్‌కు వెళ్లారు. ఇంకొందరు హోం ఐసొలేషన్‌ను కోరుకున్నారు. కొవ్వూరు, కాళ్ల, భీమవరం, ఏలూరు వంటి ప్రాంతాల్లో పోలీసులు తెలియకుండానే కరోన బారినపడ్డారు.


నిన్న ఆర్‌ఎంవో.. నేడు ఎంపీడీవో

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో యోగేంద్రబాబు కరోనా బారిన పడి కన్నుమూశారు. ఈ విషాదం నుంచి వైద్య విభాగాలు కోలుకోలేదు. ఇప్పటికే డీఎంహెచ్‌వో సహా అనేకమంది వైరస్‌ సంక్రమించి భయాందోళనకు గురయ్యారు.దీంతో జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు కరోనా భయం వెంటాడుతోంది. వేలేరుపాడు ఎంపీ డీవో అంకమ్మరావును కరోనా కబలించింది. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఆయన కుటుంబం వైరస్‌ బారిన పడింది. ఆఖరికి ఆశ్రం ఐసోలేషన్‌లో చికిత్సకు చేరినా ప్రాణాలు దక్కలేదు. వరుసగా అధికారులే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం కొన్నిశాఖల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఇప్పటికే కలెక్టర్‌తో పాటు జేసీలు వ్యక్తిగత కట్టడి పాటిస్తూనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకనాడు సందర్శకులు, అధికారులతో కిట కిటలాడే కలెక్టరేట్‌ కరోనా దెబ్బకు వెలవెలబోతోంది. ఫలితంగా లక్ష్యాల సాధనలో మండల, డివిజన్‌ స్థాయి సమీక్షలన్నీ దాదాపు తగ్గిపోగా, జిల్లా స్థాయిలోనే పథకాల పర్యవేక్షణ కొనసాగించాల్సి వస్తుంది.

Updated Date - 2020-08-01T21:23:32+05:30 IST