కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ABN , First Publish Date - 2020-05-08T07:35:49+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.

కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 7 : జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పాజిటివ్‌ కేసులు ఉన్న కంటైన్మెంట్‌ జోన్లతో పాటు అనుమానిత లక్షణాల వ్యక్తులుంటే క్వారంటైన్‌ సెంటర్లు అన్నింటిలోనూ ఫీవర్‌ క్లీనిక్‌లను తక్షణమే ఏర్పాటు చేయాని నిర్ణయించింది. కొత్తగా ఈ ప్రాంతాల నుంచి ఏ ఒక్క పాజిటివ్‌  కేసు నమోదు కారాదన్న లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసు కున్నారు. ఫీవర్‌ క్లీనిక్‌లు ఏర్పాటు అయిన తర్వాత విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో బాధపడుతున్న వారి వివరాలను గ్రామ/వార్డు వలంటీర్‌ ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వివ రాలన్నీ స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారికి కూడా వెళ్తాయి.


అనుమానిత లక్షణాలతో ఉన్న పేషెంట్లు వద్ద వైద్యాధికారి వెళ్లి పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు స్థానికంగానే చేయడం లేదా ఆస్పత్రికి తరలిస్తారు. క్వారంటైన్‌ సెంటర్లు, కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలందరికీ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. అలాగే ఫార్మసీ యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో మొత్తం 3116 హోల్‌సేల్‌, 1400 రిటైల్‌ మెడికల్‌ షాపులు ఉన్నాయి. ఇవన్నీ ఫార్మసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


రిటైల్‌ మెడికల్‌ షాపుల నిర్వాహకులు తమ వద్దకు ఔషధాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారిలో ఎవరైనా కరోనా అను మానిత లక్షణాలతో వస్తే వారి వివరాలను ఫోన్‌ నెంబర్‌తో సహా ఫార్మసీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  వారం రోజుల్లోగా హోల్‌సేల్‌ షాపులతో సహా మిగతా రిటైల్‌ దుకాణాల ఫర్మ్‌ ఐడీలతో సహా ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఫార్మసీ యాప్‌లో నమోదైన అనుమానిత లక్షణాలు గల వ్యక్తుల వద్దకు మెడికల్‌ ఆఫీసర్లు వెళ్లి వైద్య చికిత్సలు చేస్తారు. 

Updated Date - 2020-05-08T07:35:49+05:30 IST