గీత దాటితే చర్యలే

ABN , First Publish Date - 2020-05-08T07:34:02+05:30 IST

‘కంటైన్మెంట్‌ జోన్లలో ఏ విధమైన అనుమతులు లేవు. అతిక్రమిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌

గీత దాటితే చర్యలే

కంటైన్మెంట్‌ క్లస్టర్లలో రాకపోకలు బంద్‌

వలస కార్మికుల వివరాలు ఇవ్వాలి

పెళ్లిళ్లకు ఆర్డీవో అనుమతులు తీసుకోవాలి

వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ ముత్యాలరాజు

కోయంబేడు వెళ్లిన లారీలను గుర్తించండి

డ్రైవర్లు, క్లీనర్లను క్వారంటైన్‌కు తరలించండి

జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ ఆదేశం


ఏలూరు, మే 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కంటైన్మెంట్‌ జోన్లలో ఏ విధమైన అనుమతులు లేవు. అతిక్రమిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి కొవిడ్‌-19 ఇన్‌స్టాంట్‌ ఆర్డర్‌-43 ఉత్తర్వుల అమలుపై ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌తో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, పోలీసు అధికారులతో సమీక్షించారు. ‘పాజిటివ్‌ కేసు నమోదై బారికేడింగ్‌ చేసిన కంటైన్మెంట్‌ క్లస్టర్‌లోని ప్రజల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంది. మెడికల్‌ టీమ్‌, శాంపిల్స్‌ సేకరించే టీమ్‌, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలు మినహా మిగిలిన ఏ విధమైన వాటికి అనుమతి లేదు. అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారు కంటైన్మెంట్‌ క్లస్టర్‌ చెక్‌ పోస్టు విధుల్లోవున్న వారికి తెలియచేసి సహాయం పొందవచ్చు. క్లస్టర్‌ పరిధిలోని ఉద్యోగస్తుల రాకపోకలకు అనుమతి లేదు. వారు క్లస్టర్‌ వెలుపల ఉండి విధులకు హాజ రయ్యేలా చర్యలు తీసుకోవాలి.


క్లస్టర్‌లోని రాకపోకలు ఒకే ఎంట్రీ ద్వారా జరగాలి. వెళ్లి, వచ్చే వారి వివరాలు రిజిస్టర్‌లో నమోదుచేయాలి. ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చి ఖర్చును భరించే వారికి భీమవరంలో రెండు హోటళ్లను కేటాయించాం. పశ్చిమ బెంగాల్‌, జార్కండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి న కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలని కోరుకుంటే ముం దుగా ఎన్యూమరేట్‌ చేసి వారి వివరాలను సేకరించాలి. 1200 మంది ఉంటే రైలు ఏర్పాటు చేస్తాం. వివాహాలకు  ఆర్డీవోలు అనుమతి ఇస్తారు. జిల్లా లోపల జరిగే వివాహాలకు క్వారం టైన్‌ లేకుండా నిబంధనలకు లోబడి అనుమతిస్తాం. వేరే జిల్లా వాళ్లయితే వివాహం అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారందరినీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతాం.


ఇతర దేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయాల్లో రిసీవ్‌ చేసుకు నేందుకు ఒక నోడల్‌ అధికారిని నియమించాం. వారందరినీ భీమవరం క్వారంటైన్‌కు తరలించి.. విధిగా పరీక్షలు నిర్వహిం చాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తాడేపల్లిగూడెంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించాలి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారిని కొవ్వూరు క్వారంటైన్‌కు తరలించాలి. రాష్ట్రంలో కేంద్రం ప్రకటించిన ఐదు రెడ్‌ జోన్‌ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చేందుకు ఎవరినీ అనుమతి లేదు. ప్రతి క్వారంటైన్‌ కేంద్రం లో మహిళలకు ప్రత్యేక బ్లాక్‌లు కేటాయించాలి.


14 రోజుల తర్వాత మరోసారి టెస్ట్‌లు నిర్వహించి, నెగెటివ్‌ వచ్చిన వారిని ఇళ్లకు పంపించాలి. జిల్లాలో మొత్తం 27 లక్షల మాస్కులు సిద్ధం చేశాం’ అని కలెక్టర్‌ ముత్యాలరాజు స్పష్టం చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవల చెన్నై కోయంబేడు మార్కెట్‌లో పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అక్కడకు వెళ్లి జిల్లాకు వచ్చిన లారీలను పోలీసు అధికారులు గుర్తించాలి. ఆయా లారీల డ్రైవర్లు, క్లీనర్‌లను క్వారంటైన్‌లో ఉంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇటువంటి లారీలు తాడేపల్లిగూడెం మార్కె ట్‌కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది’ అని చెప్పారు. సమావేశంలో జేసీ వెంకటరమణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌-2 తేజ్‌భరత్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-08T07:34:02+05:30 IST