కరోనా... వర్రీయేనా!

ABN , First Publish Date - 2020-04-01T10:53:36+05:30 IST

ప్రకృతి విపత్తు అన్నదాతలను ఏదో ఒక రూపాన వెంటాడుతూనే ఉంది.ప్రతీ ఏడాది ఏదో ఒక సమస్యతో చివరి వరకూ

కరోనా... వర్రీయేనా!

కోత కొచ్చిన పంటపై ఆందోళన


పాలకొల్లు, మార్చి 31 : ప్రకృతి విపత్తు అన్నదాతలను ఏదో ఒక రూపాన  వెంటాడుతూనే ఉంది.ప్రతీ ఏడాది  ఏదో ఒక సమస్యతో చివరి వరకూ ఆందోళనపడే రైతన్న..ఈ ఏడాది మాత్రం ఆరంభం నుంచి ఆందోళనలో ఉన్నాడు. ఒక పక్క చేలు చూస్తే రైతు మోము పులకిస్తుండగా.. మరో పక్క కరోనా మహమ్మారి కారణంగా కోతల సమయానికి ఎలా ఉంటుందోనని నీరుగారిపోతున్నాడు. దేశమంతటా  లాక్‌డౌన్‌ పాటిస్తూ పౌరులు ఇళ్ళకే పరిమితం కాగా జిల్లాలోని రైతులు చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి రైతుక్షేత్రంలోనే ఉంటూ సాగునీటికి పరుగులు తీస్తున్నారు.


కరోనా వైరస్‌ అలజడితో వ్యవసాయ కార్మికులు పనుల్లోకి రావడానికి వెనుకంజ వేస్తుండడంతో రైతులే చేలల్లో దిగి పనులు చేసుకుంటున్నారు.  రైతులు స్వేచ్ఛగా పర్యటించడానికి, పట్టణ ప్రాంతాలకు వెళ్ళి పురుగు మందులు వంటివి కొనుగోలు చేసి తెచ్చుకోవడానికి సంబంధిత శాఖ ద్వారా ఐడీ కార్డులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైనప్పటికీ అవగాహన లేని రైతులు ఐడీ కార్డులు పొందలేకపోతున్నారు.  


2.30 లక్షల హెక్టార్లలో సాగు

జిల్లా వ్యాప్తంగా 2,30,325 హెక్టార్లలో దాళ్వా వరి సాగవుతున్నది. ఇందులో అధిక శాతం ఇప్పటికే గింజ దశకు చేరింది. డెల్టాలోని పలు మండలాల్లో ఈనిక దశకు చేరగా..  మెట్టలో కోతలకు వచ్చేశాయి.జిల్లాలోని 15 మండలాల్లో వరికోతలు ఆరంభం అయ్యాయి.పాలకొల్లు మండలంలోని శివదేవునిచిక్కాలలో  కోతలు ఆరంభించారు.కాలువ శివారు భూములకు నీటి ఎద్దడి కనిపిస్తోంది.


20 మండలాల్లో సుమారు 10 శాతం ఆయకట్టు చివరి దశలో సాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్టు సమాచారం.  మరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో కోతలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌ 15 వరకూ సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తేనే నూరుశాతం పంట దక్కుతుంది.

Updated Date - 2020-04-01T10:53:36+05:30 IST