2.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

ABN , First Publish Date - 2020-12-06T05:36:19+05:30 IST

ఈనెల 25న జిల్లాలో 2,75,000 మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు.

2.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
కలెక్టర్‌

  కలెక్టర్‌ ముత్యాలరాజు

కొవ్వూరు, డిసెంబరు 5: ఈనెల 25న జిల్లాలో 2,75,000 మందికి ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు తెలిపారు. శనివారం కొవ్వూరు మునిసిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామాల వారీగా ఇళ్ల స్థలాల లేఅవుట్‌ల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముత్యాలరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 3000 సచివాలయ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆర్‌బీకే, విలేజ్‌క్లినిక్‌ భవనాల నిర్మాణాలు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఈనెల 21న భూముల రీసర్వేను అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. దీనిలో భాగంగా భూరికార్డుల ఆధునీకరణతో పాటు, జలజీవన్‌ మిషన్‌ పఽథకంలో జిల్లాలో 4,47,000 మందికి ట్యాప్‌ కనెక్షన్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 గామన్‌ బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జిపై రహదారి మరమ్మతులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, నేషనల్‌ హైవే అధికారులు, పోలీసు, రవాణా శాఖాధికారుతో మరో రెండు రోజులలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారుల పాత బకాయిలతో పాటు, కొత్త పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. 


Read more