కొబ్బరి.. అధరహో!

ABN , First Publish Date - 2020-10-31T05:46:11+05:30 IST

కరోనా కష్టాలు అనంతరం కొబ్బరి ధరలు పెరుగుతూ వచ్చాయి.

కొబ్బరి.. అధరహో!

 వెయ్యి కాయల ధర రూ.12 వేలు  

 ఎగుమతి ధర రూ.15 వేలు  

 ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్‌ 


పాలకొల్లు, అక్టోబరు 30 : కరోనా కష్టాలు అనంతరం కొబ్బరి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు జిల్లాలోని ఆయా ప్రాంతాలను బట్టి రైతు వారి అమ్మకాలు వెయ్యి కాయల ధర రూ.10 వేల నుంచి రూ.12 వేలు  ఉంది. ధరలు పెరగడంతో రైతులు కొబ్బరి చెట్ల నుంచి కాయలను దింపి సొమ్ము చేసుకుంటున్నారు. దశమికి ముందు పెరిగిన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇవే ధరలు కార్తీక మాసం ఆరంభం వరకూ ఉంటాయని వర్తకులు చెబుతున్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలల్లో కొబ్బరి దిగుబడి తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాలలో డిమాండ్‌ పెరగడంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులకు డిమాండ్‌ పెరిగింది. అమ్మకాలలో దళారులు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దశాబ్ధ కాలానికి ముందు నూటికి నాలుగు కాయలు శనగ ఇస్తే ఇప్పుడు పది కాయలు చేశారని, చిన్న కాయలను రెండు కలిపి ఒక కాయగా లెక్కిస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొబ్బరి కాయలు నాణ్యత పరిశీలించిన తరువాతే కొనుగోలు చేస్తున్నందున ఉచితంగా తీసుకునే కాయలు (శనగ) తగ్గించాలని రైతులు వర్తకులను కోరుతున్నారు. 


100 లారీల ఎగుమతి

ఎగుమతులు ఊపందుకోవడంతో జిల్లా నుంచి రోజుకు సుమారు 100 లారీల కొబ్బరి కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, కర్ణాటక రాష్ర్టాలకు అధికంగా ఎగుమ తులు అవుతున్నాయి. పది రోజులుగా ముసురు తగ్గడంతో కొబ్బరి రైతులు చెట్ల నుంచి కాయలు దింపుతున్నారు. మరో 10, 15 రోజుల్లో సార్వా వరి కోతలకు రానుండడంతో ఈ లోపుగా కొబ్బరి పంటను వబ్బిడి చేస్తున్నారు


గండేరాకు గట్టి డిమాండ్‌

ఢిల్లీ క్వాలిటీ (గండేరా) పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.13 వేలు, గండేరా పాత కాయ రూ.15 వేలు ఎగుమతి ధరలు ఉన్నట్టు వర్తకులు తెలిపారు. కురిడి చిన్నకాయ రూ.8, 70 బత్తీల ధర వెయ్యి కాయలు రూ. 10 వేలు, నెంబరు కాయ రూ.9 వేలకు ఎగుమతులు అవుతున్నాయి.  ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురియడం, మే నెల నుంచి వర్షాలుమొదలు కావడంతో కొబ్బరి చెట్లకు కాయలు అధికంగా కాశాయి. దీంతో దిగుబడులు పెరిగాయి. డిసెంబరు నాటికి కొబ్బరి దిగుబడి మరింతగా పెరుగుంతుందని రైతులు చెబుతున్నారు. అయితే దిగుబడి పెరిగే సమయానికి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, వరి, గోధుమ తరహాలోనే కొబ్బరి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


Read more