-
-
Home » Andhra Pradesh » West Godavari » cm polavaram tour
-
నీటి కొరత రానివ్వకండి
ABN , First Publish Date - 2020-12-15T05:34:18+05:30 IST
‘కాఫర్ డ్యామ్ మూసివేసే సమయంలో డెల్టాకు సాగు, తాగునీటి కొరత రాకూడదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.

పక్కా ప్రణాళిక రూపొందించండి
కాఫర్ డ్యామ్ మూసివేస్తే ప్రత్యామ్నాయాలు కావాలి
మంత్రులు, ఎమ్మెల్యే అభిప్రాయాలను స్వీకరించండి
పునరావాసం కొలిక్కి తీసుకురావాలి
పోలవరం సమీక్షలో సీఎం జగన్
ఏలూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘కాఫర్ డ్యామ్ మూసివేసే సమయంలో డెల్టాకు సాగు, తాగునీటి కొరత రాకూడదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. దీనికి అనువుగానే ఇప్పటి నుంచి యంత్రాంగం సంసిద్ధం కావాలి. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో నీటి ఇబ్బందులు తలెత్తకూడదు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ ఇతర పనులను సోమవారం సీఎం పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టు ఏజెన్సీ, ఇంజనీర్లతో సమీక్షించారు. కీలకమైన పనులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూస్తూనే ఇంకోవైపు రైతులకు కాని ప్రజలకు కాని నీటి కొరత రాకుండా ఉండాలంటే ప్రభుత్వపరంగా ఏం చేయబోతున్నామనే దానిపై స్పష్టత ఉండాలని చెప్పారు. ఇదే అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే సీఎం దృష్టికి తెచ్చింది. ‘గోదావరికి ఎదురీత’ శీర్షికన సాగు, తాగునీటికి కష్టాలు తప్పవనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చింది. ఇదే అంశానికి సీఎం జగన్ సైతం సమీక్ష సమావేశంలో ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కాఫర్ డ్యామ్ కుడి,ఎడమల వైపు ఉన్న ఖాళీలను మార్చి, ఏప్రిల్ నాటికి మూసివేయాలని ఇదే సమయంలో గోదావరి డెల్టాలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి కొరత ఎదురవకూడదని సూచించారు. నీటి కొరత రాకుండా ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అధికా రులు వివరించారు. కీలక అంశాలపై తీసుకునే ప్రణాళికల గురించి ముఖ్య ప్రజా ప్రతినిధులందరికీ వివరించాలని అధికారులకు సీఎం సూచన చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు సమీక్షలో ఉండగానే సీఎం ఈ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.కొన్ని కీలక అంశాల్లో అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తరువాత ప్రజలకు తాము సమాధానపర్చాల్సి వస్తుందన్న భావనలో మంత్రులు ఉండగా దీనికి సీఎం ఈ రకంగా చెక్ పెట్టారు. మీ సూచనల ప్రకారం వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తాం. పక్కా ప్రణాళికకు ఇది మరింత దోహదపడేలా జాగ్రత్త పడతాయని ఇరిగేషన్ అధికారులు బదులిచ్చారు.
పునరావాసంపైనే ప్రధాన చర్చ
సమావేశంలో సహాయ పునరావాస పనుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా సహాయక పునరావాసం పూర్తి కావాలని ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు. ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ బాబూరావు నాయుడు ప్రభుత్వపరంగా ఏంచేస్తే బాగుంటుందో సీఎంకు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఇంకా భూసేకరణ, పూర్తికాని అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ళ నాని, అనిల్‌కుమార్, పేర్ని నాని, రంగనాఽథరాజు, తానేటి వనిత, విశ్వరూప్, వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, వాసుబాబు, తలారి వెంకట్రావు, కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్‌ఈ నాగిరెడ్డి, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సర్రాజు, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు సీఎంను కలిశారు.
సీఎంకు ఘనస్వాగతం
పోలవరం, డిసెంబరు 14 : పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఉదయం 10.50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు బాలరాజు కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జేసీ కె.వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. తొలుత ప్రాజెక్టు రివ్యూ ప్రాంతానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి స్పిల్‌వే పనులు 11.10 గంటలకు పరిశీలించారు. 11.33 గంటలకు స్పిల్ వే దిగువన 44, 45 బ్లాక్‌ల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన రేడియల్ గేట్లు స్విచాన్ చేశారు. 11.40 గంటలకు ఎగువ కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు కార్యాలయంలో గంటకుపైగా ఇంజనీర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఒంటిగంటన్నర ప్రాంతంలో హెలికాప్టర్‌లో తాడేపల్లి బయల్దేరి వెళ్లారు.