ఎవరికి వారే ప్రయత్నాలు.. సీఎం జగన్ నిర్ణయంపై నరసాపురంలో ఉత్కంఠ..!

ABN , First Publish Date - 2020-06-22T18:38:50+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపింది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అందుబాటులో ఉన్న భూముల వివరాలను సమర్పించింది.

ఎవరికి వారే ప్రయత్నాలు.. సీఎం జగన్ నిర్ణయంపై నరసాపురంలో ఉత్కంఠ..!

ఎక్కడికి వచ్చేనో..?

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు రెండుచోట్ల ప్రతిపాదనలు

తాడేపల్లిగూడెంలో 37.. నరసాపురంలో 50 ఎకరాలు 

రెవెన్యూ శాఖ నివేదిక.. సీఎం నిర్ణయమే ఫైనల్‌ 


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపింది. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అందుబాటులో ఉన్న భూముల వివరాలను సమర్పించింది. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో 37 ఎకరాలు, నరసాపురంలో ఇళ్ల పట్టాల మంజూరుకు సేకరించిన 50 ఎకరాల భూములను మెడికల్‌ కళాశాలకు అధికారులు ప్రతిపాదించారు. రెండు చోట్ల భూముల వివరాలతో ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. రెండు ప్రాంతాల్లో ఎక్కడ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలో ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది. రాష్ట్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు లేని నియోజక వర్గాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.ఇతర పార్లమెంటరీ నియోజక వర్గాల్లో చాలా వరకు ఒక్కచోట మాత్రమే భూములు అందుబాటులో ఉన్నాయని ప్రతిపాదనలు వెళ్లాయి.


 నరసాపురం నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి పోటీ ఏర్పడింది. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో ఇక్కడ పరిశీలన జరపాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మరెక్కడా ప్రభుత్వ భూములు లేవు. ఇళ్ల స్థలాలు పంపిణీకి నరసాపురం సమీపంలో 50 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. అదే భూమిని ఇప్పుడు ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు చొరవతో ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇలా రెండుచోట్ల ప్రతిపా దనలు వెళ్లడంతో మెడికల్‌ కళాశాల ఎక్కడ ఏర్పాటు అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. డెల్టాలో ప్రభుత్వ వైద్యం అంతగా అందుబాటులో లేదు. ఫలితంగా నరసాపురంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఓ వైపు వినిపిస్తోంది. తాడేపల్లిగూడెం, తణుకులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులున్నాయి. తాజాగా తణుకులో జిల్లా ఆసుపత్రి ఏర్పాటవుతోంది.


తాడేపల్లిగూడెం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఏలూరులో ఒక ప్రభుత్వ మెడి కల్‌ కళాశాలను నెలకొల్పుతున్నారు. ఏలూరు పరిధిలోనే ప్రైవేటు మెడికల్‌ కళాశాల ఇప్పటికే ఉంది. కాబట్టి నర్సాపురం ప్రాంతానికి కొత్త కళాశాల ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ నియోజక వర్గానికి కేంద్రంగావున్న నరసాపురం జిల్లాకు ఒక మూలన ఉంది. ఒకవైపు సముద్ర తీరప్రాంతం. అదే తాడేపల్లిగూడెం అయితే జిల్లా నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉంటుంది. మెడికల్‌ విద్యార్థుల రాకపోకలకు ప్రధాన రైలు మార్గం ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉంది. అటు గన్నవరం, ఇటు రాజమండ్రి విమానాశ్రయాలు గంట ప్రయాణంలోనే ఉన్నాయి. ఇటువంటి మౌలిక వసతులు ఉన్న తాడేపల్లిగూడెంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని మరో ప్రతిపాదన నడుస్తోంది. రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద వినిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరికి వారే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.  అంతిమంగా సీఎం నిర్ణయంపైనే మెడికల్‌ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆధారపడి ఉంటుంది. ఇతర జిల్లాల్లో కొత్త కళాశాలల ఏర్పాటుపై ఒక స్పష్టత ఉంది. పశ్చిమలో మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రభుత్వమూ గోప్యత పాటిస్తోంది. 

Updated Date - 2020-06-22T18:38:50+05:30 IST