నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-13T11:22:05+05:30 IST

ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు

నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

డీఐజీ మోహనరావు 


ఏలూరు క్రైం, మార్చి 12 : ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు మాట్లాడుతూ జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. 24 గంటలూ చెక్‌ పోస్టులను కొనసాగించాలన్నారు.


ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, పెద్దమొత్తంలో వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  పోలీసు అధికారులు తమ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి తెలియజేయాలన్నారు. శాంతి యుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చడానికి అందరి సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలన్నారు.


జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీపై దాడులు చేసి పూర్తిగా నిర్మూలించా లన్నారు. జిల్లాలో లైసెన్సు కలిగి ఉన్న తుపాకులను స్వాధీనం చేసుకోవాలన్నారు. వివిధ నేరాల్లో ఉన్న నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు. ఇప్పటి నుంచి పోలీసులు తమ విధి నిర్వహణలో అప్రమ త్తంగా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని డీఐజీ మోహనరావు ఆదేశించారు. జిల్లా ఎస్పీ నదీప్‌సింగ్‌ గ్రేవాల్‌ మాట్లాడుతూ నిజాయితీతో, బాధ్యతతో అధికారులందరూ పనిచేయాలని, అలా చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

Updated Date - 2020-03-13T11:22:05+05:30 IST