బావా.. బామ్మర్థుల

ABN , First Publish Date - 2020-08-22T11:10:45+05:30 IST

బామ్మర్ధీ... పూర్వం రోజులు ఏమిట్రా.. కూడళ్లలో చలువ పంది ళ్లు వేసి చవితి ఉత్సవాలకు పోటా పోటీగా విగ్రహాలను ఏర్పాటు చేసే అవకాశమే లేదిప్పుడు.

బావా.. బామ్మర్థుల

చవితి ముచ్చట్లు  

ఓరేయ్‌ బావా.. చవితికి హడావిడి ఏమిటిరా... ? 

బామ్మర్ధీ... పూర్వం రోజులు ఏమిట్రా.. కూడళ్లలో చలువ పంది ళ్లు వేసి చవితి ఉత్సవాలకు పోటా పోటీగా విగ్రహాలను ఏర్పాటు చేసే అవకాశమే లేదిప్పుడు. 


బావా ఎక్కడో చైనాలో పుట్టిన మహమ్మారి ఈడకి దాపురిస్తే మన పూజలు ఆపేయాలా ? 


బామ్మర్ధీ లాజిక్‌లు మాట్లాడమాక. సర్కారోళ్ళు అమ్మే మద్యం షాపుల దగ్గర జనాలు ఒకడిపై ఒకడు పడి కుమ్మేసుకుంటుంటే వాడికి కరోనా రాదు. పార్టీలోళ్లు గుంపులు గుంపులుగా చేరి కార్యక్రమాలు చేసేస్తే కరోనా అంటదు... మనం మనస్ఫూర్తిగా గజాననుడిని పూజించుకుని నిమజ్జనాలు చేస్తేనే కరోనా వచ్చేస్తాదంట..!


బావా  పూజ ఇళ్లల్లోనే చేసుకోమంటున్నారు. వీధుల్లో జనాలు ఎగబడి వ్రత సామగ్ని కొనేస్తున్నారు.. అప్పుడేం రాదా ?  


ఓరే పిచ్చి బామర్దీ మొన్నామజ్జ లాక్‌డౌన్‌లో బైక్‌ మీద ఒక్కడినే తిరగమ న్నారు. (రెండో వాడు ఎక్కితే వాడికి కరోనా వచ్చేస్తాది) కారుల్లో ముగ్గురు తప్ప నాలుగోవాడు ఎక్కితే వాడికి కరోనా వస్తాది.. ఇలా ఉంటాయి పిచ్చి నియమాలు.. 


బావా.. మనం చేసే ప్రతీ పూజలో విఘ్నాలు రాకుండా ఉండటానికి మొదట వినాయక పూజ చేస్తాం? ఇప్పుడు ఆ సామి పూజకే విఘ్నాలు కలుగుతున్నాయేంటి? 


బామర్ధీ.. నువ్వు తెలివైనోడివి. అన్ని తెలియనట్టు అడక్కు. స్వామికి విఘ్నా

లు వస్తే ఊరుకుంటాడా ? అందుకే వీధులలో తిరగకుండా ఇంటిపట్టునే ఉండి చిన్నాపెద్ద భేదం లేకుండా అందరూ పూజల్లో కూర్చుంటారనే స్వామి ఇలా చేశాడు. 


సరే బావా... పూజ ఇంటి పట్టునే చేసుకుంటాం. మరి సంబరాల మాటేమిటి ? లడ్డూల పరిస్థితి ఏమిటీ? స్వామిని నిమజ్జనం చేసే అవకాశమే లేదా ? 


బామ్మర్ధీ.. మనోళ్లకి పర్యావరణంపై సెద్ద తగ్గుతోంది. కలుషితం చేసేస్తున్నారు. నిమజ్జనాల పేరుతో రసాయనాలు కలిసిన విగ్రహాలను మంచినీటి కొలనుల్లోనూ, కాలువల్లోనూ కలుపుతుంటే తాగే నీరు విషంగా మారుతోంది. అందుకే ఈ దఫా వక్రతుండుడు సక్రమమైన మార్గంలో నడవమని ఆజ్ఞాపించాడు. 


బావా  మరి మాలాంటి కుర్రోళ్ల సరదాల మాటేమిటి ? 

బామర్ధీ ఈ ఏడాది మన తొలి పండగను ఘనంగా నిర్వహించుకోవడానికి కరోనా కాటేసింది. గోదారమ్మ తల్లి ఊళ్లనే ముంచేసింది. అంతటా కరువు తాండవిస్తోంది. ఈ సమయంలో సరదాలు, సంబరాలు అంటే మనలాంటి పేదోళ్ల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారిపోతుంది.


అందుకే లంబోదరుడు ఈ దఫా మనకి కఠిన నియమాలు పెట్టాడు. ఏదైనా మన మంచికే.. ఇంటి పట్టునే ఉండి వినాయక వ్రత కల్పం.. పఠించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకో... వచ్చే ఏడాదికి నీ సరదాలు సంబరాలు తీరతాయని ఆశిద్దాం.                     - పాలకొల్లు

Updated Date - 2020-08-22T11:10:45+05:30 IST