ఆటో..దారెటో...

ABN , First Publish Date - 2020-05-17T09:35:44+05:30 IST

ఆటో.. దారెటో తెలియడం లేదు.. నిన్నటి వరకూ ఉపాధి దారి ఉండేది.. వేలాది కుటుంబాలకు అండగా ఉండేది..

ఆటో..దారెటో...

సడలింపులిచ్చినా ముందుకు సాగని బతుకు బండి

ఆర్థిక ఇబ్బందుల్లో ఆటో వాలాలు


(ఏలూరు - ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

ఆటో.. దారెటో తెలియడం లేదు.. నిన్నటి వరకూ ఉపాధి దారి ఉండేది.. వేలాది కుటుంబాలకు అండగా ఉండేది.. కరోనా దెబ్బకు  నేడు దారి తెన్నూ లేని జీవితంగా మారిపోయింది..  లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. ఆంక్షలు సడలించినా.. బతుకు చక్రం మాత్రం ఆగిపోయింది.. ఆటో రోడ్డెక్కినా  నిబంధనల ప్రకారం కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి.. అయినా పోలీసులు  అడ్డు తగులుతూనే ఉన్నారు.. దీంతో ఎటూ కదల్లేక.. ఇంట్లో ఉండలేక.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక.. సతమతమవుతున్నారు.. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఆటోవాలాల జీవనం నడిసంద్రంలో నావలా తయారైంది.. - తణుకు


 కరోనా ఆటో వాలాల కొంపముంచింది.. వైరస్‌ నుంచి ఎప్పుడు బయటపడతామో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్‌ కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు. అంటే ఇప్పటిలో కరోనా తగ్గే అవకాశమే లేదన్నమాట. కరోనా తగ్గకపోతే ఆటో డ్రైవర్ల జీవనం ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆటోలు తిరిగే అవకాశమే ఉండదు.. ఒక వేళ తిరిగినా గతంలో తిరిగినట్టు నిండుగా ప్యాసింజర్స్‌తో వెళ్లడానికి కరోనా అడ్డంకి.. దీంతో ఆటో దారెటో తెలియక డ్రైవర్లు సతమతమవుతున్నారు. 


ఆనందమంతా గతం...

గతంలో ఆటోలు ఎంతో మంది ఉపాధినిచ్చాయి. సాయంత్రం సమయంలో సరదాగా ఆటోపై తిరిగి రోజుకు రూ. వెయ్యి సంపాదించిన వారు కూడా ఉండేవారు. దీంతో ఆటోవాలాల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. ఎంత తిరిగితే అంత సంపాదించేవారు. అటువంటిది నేడు నిబంధనలు చుట్టుముట్టాయి..ఎక్కడపడితే అక్కడ తిరగడానికి వీల్లేదు.అదీ కాకుండా డ్రైవర్‌తో పాటు కేవలం ఇద్దరికే అవకాశం..ఆ విధంగా ఆటో బయటకు తీసినా కనీసం డీజిల్‌ ఖర్చులకు కూడా డబ్బులు వచ్చే పరిస్ధితి లేదు.ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆటోలు ఇంటికే పరిమితమై ఉన్నాయి. దీంతో ఆటో వాలాల జీవితం రోడ్డున పడింది. 


ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు..

నేటికి లాక్‌డౌన్‌ ప్రకటించి 53 రోజులైంది.. రెండు నెలలగా ఆటోలు తిరగకుండా ఇంటికే పరిమితమయ్యాయి.దీంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది.ఆటోలు తిరగడం లేదన్న విషయం ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకులకు తెలుసు.అయితే అవన్నీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో ఆటో డ్రైవర్లు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.ఆటోలు తిరిగినా, తిరక్కపోయినా మాకు సం బంధం లేదని, మా వాయిదాలు చెల్లించాలని చెబుతున్నట్టు వాపోతున్నారు.అసలు బయటకు వెళ్లే పరిస్థితులు లేనప్పుడు, కుటుంబపోషణ కష్టంగా ఉన్న సమయంలో వాయిదాలు చెల్లించడం ఎలా సాధ్యమని వాపోతున్నారు.జాతీయ స్థాయి బ్యాంకులైతే మారిటోరియం విధించడం వల్ల ప్రస్తుతం ఫోన్లకే పరిమితమవుతున్నారు. పైసా ఆదాయం లేక.. బతుకు బండి నడిచే దారి లేక ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.  


రోడ్డున పడిన 26 వేల కుటుంబాలు..

 జిల్లావ్యాప్తంగా 26 వేల ఆటోలు ఉన్నాయి. అంటే జిల్లా వ్యాప్తంగా 26 వేల కుటుంబాలు ఆటోను నమ్ముకుని బతుకు బండిని లాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. కరోనా తగ్గే దారి కానరాక.. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొంత మంది  ఆటో కార్మికులు ఇతర పనులకు వెళుతున్నారు. అదిక శాతం ఇతర పనులకు వెళ్లలేక ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో కొంత మంది ఆటో డ్రైవర్లు ధైర్యం చేసి బయటకు వచ్చినా పోలీసుల వలలో చిక్కుకుని జరిమానాలకు గురవుతున్నారు. ఇటీవల తణుకులో అదే విధంగా సుమారు 10 కేసుల వరకూ నమోదు చేశారు. జరిమానా చెల్లించలేక ఆటోలను పోలీస్‌ స్టేషన్లలోనే వదిలేశారు. దీంతో మిగిలిన ఆటో డ్రైవర్లు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 


నా జీవనాధారం పోయింది...

నాకు ఆటోనే జీవనాధారం.. వేరే పని తెలియదు..లాక్‌డౌన్‌ ముందు వరకూ కుటుంబ పోషణ  చాలా ఆనందంగా సాగిపోయేది.. ఇప్పుడె లాగో అర్ధం కావడం లేదు.. రెండు నెలలగా ఇంటి వద్దే ఉండిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు బ్యాంకు రుణాలు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 

- కొమ్మిరెడ్డి సాయి దుర్గారావు, డ్రైవర్‌


మా జీవితాలను డౌన్‌ చేసింది.. 

లాక్‌డౌన్‌.. మా జీవితాలను డౌన్‌ చేసింది.. కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. తణుకు పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఆటోలు ఉన్నాయి.  ఆయా కుటుంబాలకు ఆటోలే జీవనాధారం. ఆయా కుటుంబాలు రోజు గడవడమే కష్టంగా ఉంది. దీంతో పాటు ఫైనాన్స్‌ సంస్థల ఏజెంట్ల ఒత్తిడి మరింత క్షోభకు గురి చేస్తోంది. 

- పంగం రాంబాబు, ఆటో యూనియన్‌ అధ్యక్షుడు


సడలింపు ఉన్నా అడ్డుకుంటున్నారు..

కుటుంబ పోషణకు బయటకు వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయి. ప్రభుత్వం సడలింపు ఇచ్చింది కదా అని ఆటోతో  బయటకు వస్తే రవాణా, పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏం పాపం చేశమో తెలియడం లేదు.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

- కె.వెంకటేశ్వరరావు, ఆటో డ్రైవర్‌, తణుకు


తినీ తినక.. ఉంటున్నాం.. 

సుమారు 60 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాం. రూపాయి ఆదాయం లేదు.. ఇంటి అద్దెలు.. ఫైనాన్స్‌ బకాయిలు భారంగా మారాయి.. ఏం చేయాలో తోచడం లేదు. మా  కుటుంబాలు ఆర్థిక నలిగి పోతున్నాయి. ఏదో తినీతినక రోజులు గడుపుతున్నాం.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు.  ప్రభుత్వం సహాయం అందించాలి.

-తూము శ్రీనివాసరావు, ఆటో డ్రైవర్‌, తణుకు


Updated Date - 2020-05-17T09:35:44+05:30 IST