చేపనూ..వదల్లేదు

ABN , First Publish Date - 2020-03-18T06:36:46+05:30 IST

స్థానిక పోరు ఆరంభం దగ్గర నుంచి వైసీపీ ఎత్తుగడలు కొనసాగిస్తూనే ఉంది. ఏ అవకాశాన్ని జారవిడిచుకోకుండా, అనుకున్నది సాధించేలా ప్రత్యర్థి వర్గాలను దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఆఖరికి

చేపనూ..వదల్లేదు

స్థానిక పోరులో అధికార పార్టీ ఎత్తుగడ

ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే వారిపై గురి..

అనధికార చెరువులపై అధికారుల ఆరా..

యజమానులకు బెదిరింపులు

కలుషిత జలాలంటూ నీటి శాంపిల్స్‌ సేకరణ..

రైతులు, టీడీపీ ఆందోళన 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):స్థానిక పోరు ఆరంభం దగ్గర నుంచి వైసీపీ ఎత్తుగడలు కొనసాగిస్తూనే ఉంది. ఏ అవకాశాన్ని జారవిడిచుకోకుండా, అనుకున్నది సాధించేలా ప్రత్యర్థి వర్గాలను దిమ్మ తిరిగేలా చేస్తోంది. ఆఖరికి డెల్టాలో అధికారపక్షం దూకుడు గడిచిన 15 రోజులుగా తారస్థాయికి చేరింది. చేపల చెరువుల యజమానులనే లక్ష్యంగా తీసుకుంది. వీరిలో ఎవరైనా తమ ప్రత్యర్థులకు అండగా నిలుస్తున్నా, బంధువులుగా ఉన్నా స్నేహితులుగా ఒకింత సాయపడుతున్నా వీరిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆఖరికి ఆచంట దగ్గర నుంచి మిగతా ప్రాంతాలన్నింటిలోనూ రాజకీయ ప్రత్యర్థులను మూడు చెరువుల నీళ్లు తాగించేందుకు సిద్ధపడుతున్నారు.


ఒక దశలో వైసీపీ నేతలు ఈ తరహా వ్యక్తులను ముందుగా ఎంచుకుని, వారందరినీ జాబితాలోకి చేర్చి వేధింపులు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. డెల్టాలో చేపల చెరువులకు బదులుగా రొయ్యల చెరువులను అక్కడకక్కడ సాగు చేస్తారు. అధికారిక అనుమతి చేపల చెరువులకే ఉండగా, రొయ్య పెంపకం ఎలా చేస్తారంటూ అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. దీనిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. గ్రామాల వారీగా చెరువులు కలిగిన వారందరి దగ్గరికీ ప్రత్యేకించి కొన్ని శాఖల అధికారులు, సిబ్బందిని పంపుతున్నారు. మాట వింటే సరేసరి లేదంటే చెరువు గోవిందా అంటూ ప్రత్యక్షంగానే హడావుడి చేస్తున్నారు. హడలిపోయిన వారంతా అధికార పక్షంవైపే మొగ్గు చూపాల్సి వస్తోంది.


లేదంటే తమను ఏదో రూపంలో దెబ్బ తీసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతారోనని ప్రత్యేకించి తెలుగుదేశం అనుకూలురు బెంబేలెత్తిపోతున్నారు. మరికొందరు చాలా కాలంగా చేపల సాగే వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఆ చెరువులన్నింటిపైనా మీకు లైసెన్సు ఉందా, అనుమతులు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నికలు వాయిదా పడినప్పటికీ వారి దూకుడు తగ్గలేదు. బెదిరింపులు మరింతగా పెరిగాయి. ‘మేం చెప్పినట్టు వినాల్సిందే, మేము ఏ పార్టీకి చెబితే మీరు దానికి మద్దతు ఇవ్వాల్సిందే. కాదు కూడదంటే చెరువులన్నీ సర్వ నాశనమవుతాయి’  అంటూ బెదిరిస్తున్నారు. చేపల సాగంటేనే సున్నితత్వంతో ముడిపడి ఉంది. లక్షలు విలువైన మత్స్య సంపద చివరి క్షణం వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆదమరిచినా, శత్రువులు కన్నేసి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినా లక్షలు కోల్పోవాలి. అప్పుల పాలు కావాల్సిందే. దీనికి భయపడే పెద్ద రైతులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నారు.  


అధికారుల పాత్ర ఏంటి

అధికార పక్షం మూడో కంటికి తెలియకుండా అధికారులు, సిబ్బందిని ఉపయోగించుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి రొయ్యల చెరువులు సాగు చేస్తున్న వారినే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని మరీ ఈ తరహా బెదిరింపులు ఉధృతం చేశారు. కొన్ని శాఖలకు చెందిన వారు చెరువుల జాబితాలను రూపొందించారని, వీలైతే ఈ చెరువుల అనుమతులపై వేటేసే అవకాశం ఉందనే సమాచారం ఆ నోటా ఈ నోటా అందరికీ చేరింది. ఈ మఽధ్య పోడూరు మండలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం టార్గెట్‌గా చేపలు, రొయ్యల చెరువుల యజమానులపైనే దృష్టి పెట్టారు. 


నీటి శాంపిల్స్‌ ఎందుకోసం

చేపల చెరువుల యజమానులు తెలుగుదేశంకు చెందిన వారైతే వారితో అధికారపక్షం ఒక ఆటాడుకుంటున్నది. కొద్ది రోజులుగా చేపల చెరువుల్లో ఉన్న నీటిని కొందరు అధికారులమని చెప్పుకుని శాంపిల్స్‌ సేకరించారు. చెరువు విస్తీర్ణం, ఇతర వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. అక్కడి నుంచి అందరికీ కంటిమీద కనుకులేనంత టెన్షన్‌. వచ్చింది ఎవరో నిర్ధారించలేకపోతున్నారు. చెరువుల నుంచి ప్రత్యేకంగా నీటి శాంపిల్స్‌ను సేకరించి తీసుకువెళ్ళారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ తతంగమంతా జరిగినట్టు వెల్లడవుతోంది. 

Updated Date - 2020-03-18T06:36:46+05:30 IST