ఏటీఎం కార్డుల కేటుగాడు అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-05-29T11:26:15+05:30 IST

ఏటీఎం కార్డులను అపహరించి నగదును డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు చివరకు పోలీసులకు చిక్కాడు.

ఏటీఎం కార్డుల కేటుగాడు అరెస్ట్‌

ఏలూరు క్రైం, మే 28: ఏటీఎం కార్డులను అపహరించి నగదును డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు చివరకు పోలీసులకు చిక్కాడు. డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ కేసు వివరాలను గురువారం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన అట్లూరి ధన పూర్ణచంద్రరావు (19) ఏలూరులోని ఒక పాలిటెక్నికల్‌ కాలేజీలో చదివేవాడు. తోటి విద్యార్థుల ఏటీఎం కార్డులు అపహరించి డబ్బులు డ్రా చేస్తుండడంతో అధ్యాపకులు మందలించారు. దీంతో రెండోసంవత్సరంలో చదువు మానేశాడు. విలాసాలకు, కోడి పందేలకు, లగ్జరీగా బతకడానికి నేరాలు చేయడం ప్రారంభించాడు.


ఏటీఎం సెంటర్ల వద్ద ఉండి కార్డులపై అవగాహన లేని అమాయకులను, రైతులను నమ్మించి వారి కార్డుతోనే డబ్బును డ్రా చేసి ఇచ్చేవాడు. అనంతరం వారి కార్డుకు బదులు వేరే కార్డును మార్చి ఇచ్చేవాడు. అనంతరం తాను అపహరించిన కార్డుతో వారి అకౌంట్లోని నగదును డ్రా చేసేవాడు. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి కేసులు ఐదు, టూ టౌన్‌  స్టేషన్‌ పరిధిలో రెండు నమోదయ్యాయి. ఎస్పీ నవదీప్‌ సింగ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ ఆధ్వర్యంలో సీఐ మూర్తి, ఎస్‌ఐలు ఎం.వెంకటర మణ,  బీఎస్‌డీఆర్‌ ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. చొదిమెళ్ల పెట్రోల్‌ బంకు వద్ద ఏటీఎం  కార్డు ద్వారా నగదు డ్రా చేసినట్టు గుర్తించారు. అక్కడ సిబ్బంది చెప్పిన గుర్తులతో దర్యాప్తు చేసి ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మడిచర్లలో ధనపూర్ణచంద్రరావును అరెస్ట్‌ చేశారు. అతను రూ.2,56,450లను ఏటీఎం కార్డుల ద్వారా అపహరించి చెడు వ్యసనాలకు, విలాసాలకు ఖర్చు చేసినట్టుగా గుర్తించారు. అతని నుంచి లక్షా 27 వేలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-05-29T11:26:15+05:30 IST