మూడేళ్లుగా ముందుకీ..వెనక్కీ..

ABN , First Publish Date - 2020-11-12T04:58:43+05:30 IST

ఒకే గదిలో తరగతులు.. ఆనక అక్కడే పడక.. పురుగు, పుట్రతో సహవాసం చేస్తూ కష్టాలు పడుతున్న విద్యార్థులపై అధికారులు కనికరం చూపలేదు. శిథిల భవనంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాసరే కళ్లు తెరవలేదు.

మూడేళ్లుగా ముందుకీ..వెనక్కీ..
ఆరుగొలనులో అదనపు అంతస్థు కోసం ఎదురుచూస్తున్న హాస్టల్‌ భవనం

హాస్టల్‌ అదనపు అంతస్తుపై తేల్చని అధికారులు   

పూర్తికాని రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణం

ఆరుగొలను గురుకుల విద్యార్థులకు తప్పని కష్టాలు

శిథిల భవనంలో పురుగు..పుట్రలతో సహవాసం..!

పెండింగ్‌లో రూ.23 కోట్ల ప్రాజెక్టు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

ఒకే గదిలో తరగతులు.. ఆనక అక్కడే పడక.. పురుగు, పుట్రతో సహవాసం చేస్తూ కష్టాలు  పడుతున్న విద్యార్థులపై అధికారులు కనికరం చూపలేదు. శిథిల భవనంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాసరే కళ్లు తెరవలేదు. నూతన రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణానికి అవరోధంగా మారిన హాస్టల్‌ అదనపు అంతస్తుపై ఎటూ తేల్చలేక పోతున్నారు. అనుమతులు మంజూరులో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా పనులు నిలిచిపోయాయి. గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తికాలేదు. గడచిన మూడేళ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. శిథిలమైన భవనంలోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదీ తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గురుకుల పాఠశాలలో విద్యార్థుల దుస్థితి. పాడుబడ్డ భవనంలో ఉన్న ఒకే గదిలో పగలు చదువుకుంటూ రాత్రి అక్కడే పడు కోవడం విద్యార్థులకు అలవాటైపోయింది. ఇతర గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో  ఉపాధ్యా యులకు గత్యంతరం లేక ఒకే గదిలో చదువు చెపుతూ రాత్రి నిద్రపోయేలా ఏర్పాట్లు చేశారు. నూతన రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటైతే ఇటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించారు. కానీ సమీప భవిష్యత్తులో విద్యార్థుల కష్టాలు తొలగేలా లేవు. పాత భవనాలకు ఆనుకుని ఉన్న స్థలంలోనే మూడేళ్ల క్రితం కొత్త గురుకుల పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  వాస్తవానికి దానిని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న బాలయోగి గురుకుల పాఠశాల కోసం కేటాయించారు. ఆరుగొలనులో ఉన్న గురుకుల పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తగా నిర్మాణం చేపట్టిన పాఠశాలను వారికి బదలాయించారు. బాలయోగి గురుకుల పాఠశాలకు కొత్త భవనాలను తాడేపల్లిగూడెంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. దాంతో ఆరుగులను విద్యార్థులకు కష్టాలు తొలగిపోయేనట్టేనని సంబరపడ్డారు.మూడేళ్లు గడచినా ఇంకా నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పేట్టులేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్దిరోజులు నూతనంగా నిర్మిస్తున్న గురుకుల పాఠశాలకు బిల్లులు మంజూరులో జాప్యం చేశారు. ఇప్పుడు హాస్టల్‌ నిర్మాణంపై తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుతం రెండు అంతస్థుల హాస్టల్‌ భవనం పూర్తయ్యింది. దానిపై మూడో అంతస్తు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనుమతులు మంజూరు చేస్తే పాఠశాల నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటిదాకా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అదనపు అంతస్తు నిర్మించాలా వద్దా అనే విష యాన్ని తేల్చడం లేదు. దాంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే దాదాపు రూ.23 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్ట్‌ పూర్తికావడానికి మరి కొన్నేళ్లు ఎదరు చూడకతప్పుదు. ఎప్పటిలాగే ఆరుగొలను గురుకుల పాఠ శాల విద్యార్థులు అష్టకష్టాలతో విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది. 


 వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తాం

 రాధా సుధావాణి,  గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త

 ఆరుగొలను గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెస్తాం. పదిహేను రోజుల క్రితమే కొత్తగా నిర్మిస్తున్న పాఠశాలను సందర్శించాను. నిధులు అందుబాటులో ఉన్నట్టు ప్రిన్సిపాల్‌ చెప్పారు. కాంట్రాక్టర్‌తోనూ మాట్లాడాం. హాస్టల్‌ విషయమై నిధులు ఉంటే అదనపు అంతస్తు నిర్మిస్తాం. లేదంటే అలాగే ఉంచేస్తాం. నిర్మాణ వేగవంతం చేయాలని ఆదేశించాం. 


Updated Date - 2020-11-12T04:58:43+05:30 IST