మన బ్యాంక్ కనుమరుగు!
ABN , First Publish Date - 2020-04-01T10:52:18+05:30 IST
ఆ బ్యాంకుకు 97 ఏళ్లు..ప్రతీ పల్లె పౌరుడికి అది మా బ్యాంక్..మన బ్యాంక్.. ఆంధ్రా బ్యాంక్‌తో అంతటి అనుబంధం..

యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్ విలీనం
జిల్లా వాసులతో ప్రత్యేక అనుబంధం
అదే దారిలో కార్పొరేషన్ బ్యాంక్
ఏలూరు సిటీ, మార్చి 31 :ఆ బ్యాంకుకు 97 ఏళ్లు..ప్రతీ పల్లె పౌరుడికి అది మా బ్యాంక్..మన బ్యాంక్.. ఆంధ్రా బ్యాంక్‌తో అంతటి అనుబంధం.. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరికి ఆ బ్యాంక్‌లో ఖాతా ఉండాల్సిందే..కష్టంలో.. పొదుపులో.. రుణాల్లో అన్నింటా ఆ బ్యాంద్‌పై పైచేయి..అదే ఆంధ్రాబ్యాంక్... అందుకే ఏ పల్లెలో చూసినా ఆ శాఖ ఒకటి కనిపిస్తూనే ఉం టుంది..అటువంటి బ్యాంక్ నేటి నుంచి కనుమరుగు కానుంది..మన జిల్లాలోని భీమడోలు మండలం గుండు గొలనుకు చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రాబ్యాంకు తొలి బ్రాంచ్‌ను మచిలీ పట్నంలో ప్రారంభించారు.నాటి నుంచి అంచలం చెలుగా ఎదిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక శాఖలు కలిగిన బ్యాంకుగా ప్రసిద్ధిగాంచింది. దీనివల్ల లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తారు.
కేంద్ర ప్రభుత్వ నూతన సంస్కరణల్లో భాగంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆంధ్రాబ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీ నం కాబోతోంది.ఆంధ్రా బ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాం కులో విలీనం అవుతోంది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆంధ్రాబ్యాంకు లోగో కనుమరుగు కానుంది. ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు ఉద్యోగులు యూనియన్ బ్యాంకు ఉద్యోగులుగా మారనున్నారు.ఆంధ్రాబ్యాంక్‌తో అనుబంధంపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి.
జిల్లాలో 114 శాఖలు..
జిల్లాలో ఆంధ్రా బ్యాంకుకు 114 శాఖలతో రూ.9870 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. వీటిలో రూ.5,083 కోట్లు రుణాలు, రూ.4,788 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. 800 మందికిపైగా ఉద్యోగులు ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్నారు.కార్పొరేషన్ బ్యాంకుకు జిల్లాలో 11 బ్రాంచ్‌లు ఉన్నాయి. టర్నోవర్ రూ.435 కోటు.్ల జిల్లాలో యూనియన్ బ్యాంకుకు 20 శాఖలు మాత్రమే ఉన్నాయి. యూనియన్ బ్యాంకు జిల్లాలో రూ.2,178 కోట్లు టర్నోవర్‌తో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంతో దేశంలోనే ఐదో అతి పెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంకు అవతరించనుంది. దాదాపు రూ. 15 లక్షల కోట్ల లావాదేవీలను యూనియన్ బ్యాంకు నిర్వహించనుంది. ఆంధ్రాబ్యాంకు విలీనం అనంతరం యూనియన్ బ్యాంకు జిల్లా లీడ్ బ్యాంకుగా మారనుంది.