-
-
Home » Andhra Pradesh » West Godavari » akrama ravana
-
ఒకే లారీ... మూడు నెంబర్లు
ABN , First Publish Date - 2020-10-31T05:55:50+05:30 IST
అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిని ఎంచుకుంటున్నారు. శుక్రవారం విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఇదే విషయం వెలుగుచూసింది.

రేషన్ బియ్యం తరలింపులో కొత్త కోణం
అధికారుల కన్ను కప్పేందుకు అక్రమార్కుల ఎత్తులు
సీజ్ అయిన లారీ నెంబర్లతో యథేచ్ఛగా తరలింపు
విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు
ఏలూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిని ఎంచుకుంటున్నారు. శుక్రవారం విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఇదే విషయం వెలుగుచూసింది. ఖమ్మం నుంచి ఏపీ16టీయూ 2099 వాహనంలో 300 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు జిల్లాలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ వాహనం గోపాలపురం మీదుగా చింతలపూడి వరకు వచ్చింది. ఆ తరువాత అర్ధాంతరంగా మాయమైంది. ఏపీ 16 టీవీ 6797 నెంబరుతో ప్రత్యక్షమైంది. చింతలపూడి నుంచి ఏలూరు చేరుకోనే లోపు లారీ తెలంగాణ లారీగా మారిపోయింది. టీఎస్ 40 యూబీ 8876 నెంబరుతో ఏలూరు బైపాస్‌లో ప్రత్యక్షమైంది. ఏలూరు బైపాస్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులకు ఈ సమాచారాన్ని ఇన్ఫార్మర్లు ముందుగానే చేరవేయడంతో ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీని ఆపి తనిఖీ చేసిన అధికారులు 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దానితో పాటు క్యాబిన్‌లో మూడునెంబరు ప్లేటులు కన్పించాయి. ఈ నెంబరు ప్లేట్లకు సంబంధించిన వాహనాల వివరాలు ఆరా తీయగా అవి మూడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎక్కిరాల బాలకృష్ణ (ఉరఫ్ బాల)కు చెందిన లారీలని తేలింది. ఈ లారీల వివరాలను ఆరా తీయగా ఏపీ 16 టీవీ 6797 నెంబరు గల బస్సు ఖమ్మం జిల్లా వైరా పోలీస్‌స్టేషన్‌లో 9 నెలల క్రితమే బియ్యం అక్రమ రవాణా కేసులో సీజ్ అయి ఉన్నట్లు తేలింది. ముందస్తుగా అందిన పక్కా సమాచారం ఉండడంతో ఈ వాహనాన్ని గుర్తించగలిగామని లేకుంటే సాధ్యమయ్యేది కాదని విజిలెన్స్ అధికారులు చెప్పారు. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు అక్రమార్కులు షేక్ సహీద్దుపాషా, ఎక్కిరాల బాలకృష్ణ, ఐ.శ్రీనివాస్, షేక్ మౌలానా, పద్మలపై 6ఏ 7–1 కేసులతో పాటు ఐపీసీ సెక్షన్ 464, 471 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశామని విజిలెన్స్ ఎస్పీ వరదరాజు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ తహసీల్దార్ రవికుమార్, ఎస్‌ఐ ఏసుబాబు, సివిల్ సప్లయ్స్ డీటీ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
