ముందుస్తు సాగేనా..!
ABN , First Publish Date - 2020-12-11T05:39:28+05:30 IST
పోలవరం కాపర్ డ్యామ్ నిర్మాణం కారణంగా వచ్చే ఏడాది మార్చి 31 వతేదీ నాటికి గోదావరి కాలువలు కట్టివేయనున్నారు.
ఇంకా పూర్తి కాని రబీ నారుమళ్లు
ఏప్రిల్‌లో కోతలు పూర్తవ్వాలని లక్ష్యం
చాలా ప్రాంతాల్లో సార్వా కోతలు
ఏలూరు సిటీ, డిసెంబరు 10 : పోలవరం కాపర్ డ్యామ్ నిర్మాణం కారణంగా వచ్చే ఏడాది మార్చి 31 వతేదీ నాటికి గోదావరి కాలువలు కట్టివేయనున్నారు. అందువల్ల జిల్లాలో గోదావరి కాలువల కింద ముందస్తు సాగు చేసి రబీ వరికోతలు 2021 ఏప్రిల్ 10వ తేదీనాటికి పూర్తిచేయాలని జిల్లా యంత్రా ంగం నిర్ణయించింది. డిసెంబర్ మొదటివారం నాటికి వరినారుమళ్లు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా ఇంకా నారు మళ్లు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్నిచోట్ల సార్వా వరికోతలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో లక్షా 69 వేల హెక్టార్లలో రబీ సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో కాలువల కింద లక్షా 28 వేలు, బోర్ల కింద 41 వేల హెక్టార్లలో రబీ సాగు జరుగుతుందని అంచనా వేశారు. రబీ సాగుకు సంబంధించి జిల్లా మొత్తం మీద 8,445 హెక్టార్లలో నారు మడులు వేయాల్సి ఉంది. కాల్వల కింద 6,420 హెక్టార్లు, బోర్ల కింద 1,845 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గోదావరి కాల్వల కింద 5,645 హెక్టార్లలో, బోర్లు కింద 955 హెక్టార్లలో నారుమళ్లు పూర్తయినట్టు చెబుతున్నారు. డిసెంబరు 15 వరకు నారుమళ్ళు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. బెంగాల్ కూలీలు, మిషన్ ప్లాంటేషన్, డైరక్ట్ ప్లాంటేషన్ చేస్తే ఏప్రిల్ 10 నాటికి కోతలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో 91 శాతం వరికోతలు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నా ఇంకా చాలా ప్రాంతాల్లో వరికోతలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు ఎంతవరకు సాఽధ్యమనే విషయం చర్చనీయాంశంగా తయారైంది.
తడిసిన ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు
రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలను సడలించారు. కేంద్రప్రభుత్వం నిర్ణయిం చిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం మొత్తం 5 శాతం మించకూడదనే నిభందన ఉండేది. ఈ 5 శాతంలో దెబ్బతిన్న, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యంలో విడివిడిగా ఏదీ 4 శాతం మించరాదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 5 శాతం నిబంధనలను సడలించి 10 శాతం వరకు పెంచారు. తదనుగుణంగా ధర తగ్గింపు కూడా ప్రకటించారు. ఈ 10 శాతంలో కూడా దెబ్బతిన్న, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం విడివిడిగా ఏ ఒక్కటీ కూడా 4 శాతం మించరాదని స్పష్టం చేసింది. రైతుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నెంబరు 1800–4256453కు ఫోన్ చేయవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ఇప్పటికే 2,38,600 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు డి.రాజు తెలిపారు. దాదాపు 446 కోట్లు రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రైతులకు రూ.150 కోట్లు చెల్లించినట్టు తెలిపారు.